బడ్జెట్ సమావేశాలు ముగిసిన 6 నెలలకు తెలంగాణ అసెంబ్లీ తిరిగి ఈరోజు సమావేశమవుతోంది. ఈ 6 నెలల్లో తెలంగాణలో కావాల్సినంత రాజకీయ మసాలా తయారైంది. ఈటల రాజేందర్ బహిష్కరణ, తదనంతర పరిణామాలతో తెలంగాణ పాలిటిక్స్ వేడెక్కాయి. అదే క్రమంలో దళితబంధు తెరపైకి రావడం.. ఇతరత్రా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై కూడా వాడివేడి చర్చ జరిగే అవకాశం ఉంది.
డ్రగ్స్, శాంతి భద్రతల సమస్యలపై చర్చ..
డ్రగ్స్ కేసులో ఈడీ విచారణపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ మేరకు అసెంబ్లీలో ఈ అంశాన్ని చర్చకు కోరే అవకాశం ఉంది. ఓవైపు సిటీ సివిల్ కోర్టు రేవంత్ రెడ్డి నోటికి తాళం వేసినప్పటికీ.. కాంగ్రెస్ సభ్యులు డ్రగ్స్ అంశాన్ని లేవనెత్తే అవకాశం ఉంది. మరోవైపు లైంగిక దాడులు, మహిళలపై పెరుగుతున్న అకృత్యాలపై ప్రతిపక్షాలు చర్చకు పట్టుబట్టే అవకాశముంది.
దళితబంధుపై దృష్టి..
హుజూరాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్ దళితబంధు పథకాన్ని తెరపైకి తెచ్చారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ప్రస్తుతానికి హుజూరాబాద్ తో పాటు మరో 4 నియోజకవర్గాల్లో ఒక్కో మండలంలో ప్రయోగాత్మకంగా దీన్ని అమలు చేస్తున్నారు. దశలవారీగా రాష్ట్రమంతా విస్తరిస్తామని ప్రభుత్వం ప్రకటిస్తున్న.. వెంటనే దాన్ని అమలులో పెట్టాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఉద్యోగాలు, ప్రాజెక్ట్ ల మాటేంటి..
తెలంగాణలో నిరుద్యోగ సమస్య గురించి ఉద్యమాలు జరుగుతున్నాయి, ఇటీవల భారీ రిక్రూట్ మెంట్లేవీ మొదలు కాలేదు. మరోవైపు ఆర్టీసీ ప్రైవేటీకరణ అంశం కూడా అసెంబ్లీ సమావేశాలను వేడెక్కించే అవకాశముంది. ఇక తెలంగాణలో పలు నీటిపారుదల ప్రాజెక్ట్ లపై ఏపీ అభ్యంతరాలు తెలపడం, కేంద్రం మధ్యవర్తింత్వంపై కూడా చర్చ జరిగే అవకాశముంది.
ఐదు బిల్లుల ఆమోదానికి..
ఈ సమావేశాల్లో అసెంబ్లీ ఆమోదానికి 5 ముసాయిదా బిల్లులను ప్రభుత్వం సిద్ధం చేసింది. గృహనిర్మాణ సంస్థ బిల్లు, ఉద్యాన విశ్వ విద్యాలయ బిల్లు, పర్యాటకులపై దాడులను నియంత్రించే ప్రత్యేక చట్టం, రెవెన్యూ రిజిస్ట్రేషన్ చట్ట సవరణ, పురపాలక పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లులను తెలంగాణ అసెంబ్లీ ఆమోదించాల్సి ఉంది.
నేడు ఢిల్లీకి కేసీఆర్..
ఓవైపు అసెంబ్లీ సమావేశాలు మొదలవుతుంటే, మరోవైపు సీఎం కేసీఆర్ మూడు రోజులు ఢిల్లీ పర్యటన పెట్టుకోవడం విశేషం. ఈనెల 1 నుంచి 9వ తేదీ వరకు కేసీఆర్ ఢిల్లీలోనే ఉన్నారు. టీఆర్ఎస్ భవన్ కు శంకుస్థాపన చేయడంతోపాటు ప్రధాని సహా ఇతర కేంద్ర మంత్రులతో ఆయన భేటీ అయ్యారు. విభజన చట్టంలోని హామీల అమలుకోసం అర్జీలిచ్చారు. పనిలో పనిగా యాదాద్రి ప్రారంభోత్సవానికి ఢిల్లీ పెద్దల్ని ఆహ్వానించారు.
ఇప్పుడు ఇదే నెలలో రెండోసారి కేసీఆర్ ఢిల్లీ టూర్ ఆసక్తికరంగా మారింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో జరిగే ఓ సదస్సు కోసం ఆయన ఢిల్లీ వెళ్తున్నారని అంటున్నా.. అసలు కథ వేరే ఉందని ఇప్పటికే ప్రతిపక్షాలు విమర్శలు మొదలు పెట్టాయి.
గత పర్యటనలో కూడా టీఆర్ఎస్, బీజేపీ సంబంధాలపై కాంగ్రెస్ విరుచుకుపడింది. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎంని రంగంలోకి దింపి, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చే విషయంపై కేసీఆర్, అమిత్ షా చర్చించారని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. ఇప్పుడు మరోసారి కేసీఆర్ ఢిల్లీ పర్యటన పెట్టుకోవడంపై కూడా వారు విమర్శలు గుప్పిస్తున్నారు.