అమరావతి రాజధానికి అనుకూలంగా ఇలా హైకోర్టు తీర్పు వచ్చిందో లేదో అలా పార్టీలన్నీ సిద్ధమైపోయాయి. అమరావతి క్రెడిట్ ను తమ ఖాతాలో వేసుకునేందుకు ఎవరి ప్రయత్నాల్లో వాళ్లు పడిపోయారు. వాస్తవానికి అమరావతి పోరాటానికి మొదట్లో ఉన్నంత క్రేజ్ ఆ తర్వాత రాలేదు.
అమరావతి రైతులు కూడా టెంట్లలో అప్పుడప్పుడు కనిపిస్తున్నారు కానీ, ఎవరి పనుల్లో వారు బిజీగా ఉంటున్నారు. మూడు రాజధానుల బిల్లుని ప్రభుత్వం ఉపసంహరించుకున్న తర్వాత కోర్టు తీర్పుతో పెద్దగా ఉపయోగం లేదనేది అందరికీ తెలిసిన విషయమే. అందులోనూ మిగతా ప్రాంతాల్లో వ్యతిరేకత వస్తోందని తెలిసే సరికి టీడీపీ సహా అన్ని పార్టీలు ఈ ఆపరేషన్ అమరావతికి దూరంగానే ఉంటున్నాయి. కానీ అనుకోకుండా హైకోర్టు తీర్పు వారికి సానుకూలంగా రావడంతో మళ్లీ అన్ని పార్టీలు రంగంలోకి దిగాయి. మేం గెలిచాం, మేమే గెలిచామంటూ జబ్బలు చరుచుకుంటున్నాయి. క్రెడిట్ కొట్టేసేందుకు పాకులాడుతున్నాయి.
టీడీపీ గోల ఇంతింత కాదయా?
చంద్రబాబు, లోకేష్ పాత బైట్లను తీస్తోంది. జై అమరావతి నినాదాల్ని వీడియోలుగా చేసి వదులుతోంది. ఫొటోల్ని మరోసారి వైరల్ చేస్తోంది. మరీ ముఖ్యంగా భువనేశ్వరి రెండు గాజుల కాన్సెప్ట్ ను తెరపైకి తెస్తోంది. అమరావతి పాదయాత్ర, దానికి టీడీపీ నాయకుల మద్దతు, ఇలా అన్ని విషయాలను హైలెట్ చేస్తోంది. ముఖ్యంగా అమరావతి రైతులకు జగన్ క్షమాపణ చెప్పాలంటూ కొత్తగా, చెత్త లాజిక్ తీస్తోంది టీడీపీ.
సుప్రీంకోర్టుకి వెళ్లొద్దని ఉచిత సలహాలిస్తూ రెచ్చగొడుతోంది. అమరావతి బర్నింగ్ ఇష్యూగా ఉండటమే చంద్రబాబుకి కావాల్సింది. ఢిల్లీకి వెళ్లినా అక్కడ రిజల్ట్ ఎలా ఉంటుందో, ఎవరున్నారో బాబుకి తెలుసు కాబట్టి.. వద్దు వద్దంటూనే గిల్లుతున్నారు. ఇక ఇది ప్రజా విజయం, అమరావతి రైతుల, విజయం, టీడీపీ విజయం అంటూ పచ్చపాత మీడియా ఊదరగొడుతోంది.
జనసేన కష్టాలు పగవాడికి కూడా వద్దయ్యా!
అమరావతి ఏకైక రాజధానిగా గుర్తించాలంటూ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన ఏకైక పార్టీ జనసేన అంటూ గుర్తు చేస్తున్నారు ఆ పార్టీ నాయకులు. టీడీపీ కుడా అఫిడవిట్ విషయంలో అమరావతి రైతుల్ని మోసం చేసిందని, కానీ జనసేన ముందడుగు వేసిందని అంటున్నారు. సో ఆ క్రెడిట్ తమదేనని చెప్పుకుంటున్నారు.
అమరావతి రైతులకు పవన్ అండగా నిలబడ్డారని, అందుకే ఈ విజయం సాధించారని డబ్బా వాయించేస్తున్నారు నాదెండ్ల. ఈ సందర్భంగా గతంలో పవన్ మాట్లాడిన వీడియోల్ని 'సైనికులు' వైరల్ చేస్తున్నారు.
లాస్ట్ గా వచ్చి లేటెస్ట్ గా క్రెడిట్ కొట్టేస్తున్న బీజేపీ
అమరావతికి తాము మద్దతిచ్చిన తర్వాత కోర్టులో చలనం వచ్చిందని చెప్పుకునే ప్రయత్నం చేస్తోంది బీజేపీ. గతంలో అమరావతికి మద్దతుగా వీర్రాజు మాట్లాడిన పాత వీడియోలు బయటకొస్తున్నాయి. అంతేకాదు.. అమరావతి విజయం పేరిట భారీ బహిరంగ సభ పెట్టే యోచన కూడా చేస్తోంది కమలం పార్టీ. టీడీపీ కంటే ముందే అమరావతిలో విజయోత్సవం చేయాలని వీర్రాజు తహతహలాడుతున్నారు.
బీజేపీ కూడా అమరావతిపై ఎటూ తేల్చుకోలేని పరిస్థితుల్లో.. అమిత్ షా తిరుపతిలో మొట్టికాయలు వేయడంతో వారు తొందరపడ్డారు. ఆ తర్వాతే బీజేపీ అమరావతి ఉద్యమానికి కాస్తో కూస్తో దగ్గరైంది. కానీ ఇప్పుడు అసలా ఉద్యమమే తమది అని సిగ్గులేకుండా చెప్పుకుంటోంది బీజేపీ..
వామపక్షాలు తక్కువ తినలేదు..
సామ్యవాదం, సమ సమాజం అని చించుకునే వామపక్షాల నేతలు కూడా పెట్టుబడిదారుల సర్వస్వం అయిన అమరావతికి మద్దతివ్వడం ఏపీలో పెద్ద విశేషం. కేవలం చంద్రబాబు అడుగులకు మడుగులొత్తేందుకే వామపక్షాలు కూడా అమరావతి జపం చేశాయి.
రాజధాని ప్రాంతంలో ఎస్సీ, ఎస్టీలకు నివాస స్థలాలు కేటాయిస్తే ప్రతిపక్షం కోర్టుకెళ్లి అడ్డుకోడాన్ని వామపక్షాలు అప్పట్లో సమర్థించాయి కూడా. అలాంటి పాపం చేసి, పేదలకు అన్యాయం చేస్తున్న వామపక్ష నేతలు, అమరావతి క్రెడిట్ లో తమకూ వాటా ఉందంటున్నారు. తీర్పు తర్వాత తొలిగా స్పందించారు. ఏ పార్టీ తరపున విజయోత్సవాలు జరిగినా.. తమ పాత్ర ఉండేలా పథకం రచిస్తున్నారు.
ఇలా అన్ని పార్టీలు అమరావతి క్రెడిట్ కోసం కొట్టుకుంటున్నాయి. చంద్రబాబుకి కావాల్సింది కూడా ఇదే. అమరావతి పేరుతో అన్ని పార్టీలు ఒకే దగ్గరకు చేరాలని, ప్రతిపక్షాలన్నిటినీ ఏకం చేసి, జగన్ పై తుపాకీ ఎక్కుపెట్టాలనేది బాబు ఆలోచన. అమరావతి అనే కామన్ కాన్సెప్ట్ తో ఆ దిశగా పథకం రచిస్తున్నారు బాబు.