బత్యాల చెంగల్రాయులు… టీడీపీ సీనియర్ నేత. కడప జిల్లా రాజకీయాల్లో తలపండిన నాయకుడు. ప్రస్తుతం రాజంపేట టీడీపీ ఇన్‌చార్జ్. ఈ నియోజకవర్గానికి సమీపంలోని రైల్వేకోడూరు స్వస్థలం. రాజంపేట, రైల్వేకోడూరులలో బలమైన సామాజక వర్గం అండదండలున్నాయి. ఒకప్పుడు వైఎస్ రాజారెడ్డితో ఢీ అంటే ఢీ అని తలపడ్డాడు. రాజారెడ్డితో గొడవ పడి ప్రాణాల మీదకు కూడా తెచ్చుకుని, బతికి బయట పడ్డాడు.
ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరి వైఎస్ కుటుంబంతో సఖ్యత ఏర్పరచుకున్నారు. రైల్వేకోడూరు నియోజకవర్గం ఎస్సీకి కేటాయించడంతో ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనే అవకాశం లేకుండా పోయింది. దీంతో ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి కాంగ్రెస్ గౌరవించింది. 2014 రాష్ట్ర విభజన నేపథ్యంలో టీడీపీలో చేరారు. రైల్వేకోడూరులో టీడీపీ తరపున పని చేశారు.
2019 ఎన్నికల్లో రాజంపేట నుంచి అనివార్య పరిస్థితుల్లో బరిలో దిగాల్సి వచ్చింది. ఆ ఎన్నికలకు కొన్ని నెలల ముందు టీడీపీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి వైసీపీలో చేరడంతో పార్టీకి పెద్ద దిక్కు లేకుండా పోయింది. రాజంపేటలో బలిజ సామాజిక వర్గం బలంగా ఉన్న నేపథ్యంలో, బత్యాల చెంగల్రాయుల్ని టీడీపీ బరిలో నిలిపింది. వైఎస్ జగన్ గాలిలో బత్యాల ఓటమిని మూట కట్టుకోవాల్సి వచ్చింది.
అయితే రాజంపేటలో టీడీపీకి పెద్ద దిక్కుగా ఉన్న ఆయన్ను తిరిగి అక్కడి నుంచి రైల్వేకోడూరుకు సాగనంపే పనిలో చంద్రబాబు ఉన్నట్టు సమాచారం. రాజంపేటలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన, ఆర్థికంగా బలవంతుడైన నాయకుడిని నిలబెట్టడం ద్వారా పార్టీకి మంచి రోజులు వస్తాయని చంద్రబాబు ఆలోచన చేస్తున్నారని సమాచారం. దీంతో బత్యాలకు పరోక్ష సాంకేతాలు ఇచ్చినట్టు సమాచారం.
తిరిగి రైల్వేకోడూరుకు వెళ్లి టీడీపీని బలోపేతం చేయాలని బత్యాలకు సూచించినట్టు తెలిసింది. 2024లో పార్టీకి గెలుపు అవకాశాలున్నాయని, తాను ఎమ్మెల్యే అవుతానని కలలు కంటున్న బత్యాల ఆశలపై టీడీపీ అధిష్టానం నీళ్లు చల్లిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తమ నాయకుడిని కరివేపాకులా పార్టీ వాడుకుంటోందని బత్యాల అనుచరులు వాపోతున్నారు.