తెలంగాణలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను హత్య చేయడానికి కుట్ర జరిగింది. సుపారీ గ్యాంగ్ కు పని అప్పగించారు. ఆ కుట్ర కాస్తా బయటపడింది. పోలీసులు చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించి ఈ వ్యవహారంలో పలువురిని అరెస్టు చేశారు. మంత్రి హత్యకు ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న రాఘవేంద్రరాజు వెల్లడించిన విషయాలు వింటే మాత్రం విస్తుపోవాల్సిందే.
తనకు వ్యాపారాల్లో నష్టం వచ్చేలా చేస్తున్నాడు గనుక.. తన వ్యాపారాలను దెబ్బకొడుతున్నాడు గనుక మంత్రిని హత్య చేయించాలని నిర్ణయించుకున్నట్లుగా రాఘవేంద్రరాజు వెల్లడించారు. అధికారంలో ఉన్న రాజకీయ నాయకుడు, తన మీద కక్ష కట్టి తన వ్యాపారాలను దెబ్బ కొట్టినంత మాత్రాన.. హత్య చేయించడానికి సిద్దమవుతారా? అనేది ఆశ్చర్యంగా ఉంది.
అయితే ఈ కేసులో పలువురిని అరెస్టు చేసిన సమయంలో పోలీసులు బీజేపీకి చెందిన మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, మాజీ మంత్రి డికె అరుణల పాత్ర మీద కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. హత్యకు ప్రణాళిక వేసిన వారు.. జితేందర్ రెడ్డి సర్వెంట్ క్వార్టర్స్ లో తలదాచుకున్నట్లుగా తేలడం కూడా అందుకు ఒక కారణం. పోలీసులు వెల్లడించిన తర్వాత.. జితేందర్ రెడ్డి ఇంటిపై దాడి కూడా జరిగింది. ఆయన ప్రెస్ మీట్ పెట్టి తాను సచ్ఛీలుడినని వెల్లడించారు.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. వ్యాపారాల్లో నష్టాలు కలిగిస్తున్నారనే ఉద్దేశంతో మంత్రిని చంపడానికి పూనుకుంటారా? అనేదే ప్రజల సందేహం. ఎందుకంటే.. రాజకీయంగా ఆటుపోట్లు ఎదుర్కొని ఎదిగిన వారు చాలా సహజంగా కొందరి మీద కక్ష కడతారు. వారి ఎదుగుదలను అడ్డుకోడానికి ప్రయత్నిస్తుంటారు.
ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా.. వారి ప్రత్యర్థి పార్టీలకు చెందిన వారు.. కొంత ఆర్థిక నష్టాలకు, వ్యాపార నష్టాలకు సిద్ధపడాల్సి ఉంటుంది. ఇలాంటి కారణాలకు హత్యలు చేసేట్లయితే.. మన దేశంలో ఇంచుమించుగా ప్రతిరోజూ ఏదో ఒక చోట, ఎవరో ఒక మంత్రి హత్యకు కుట్రలు జరుగుతూనే ఉండాలేమో.
తలసాని హత్యకు కుట్ర కేసులో అనుమానితుడైన రాఘవేంద్రరాజు చెబుతున్న ప్రకారం ఆయనకు మొత్తంగా 6 కోట్ల రూపాయల మేర వ్యాపార నష్టాలకు తలసాని కారణమయ్యారు. అయితే, అందుకోసం 15 కోట్ల రూపాయల సుపారీ ఇవ్వడానికి సిద్ధపడి హత్య చేయించడానికి పూనుకుంటారా? కేవలం తలసాని చావు ద్వారా.. ఈ 21 కోట్ల నష్టాన్ని భర్తీ చేసుకోవచ్చునని ఎలా అనుకున్నారు? ఇవన్నీ సందేహాత్మక ప్రశ్నలే.
ఈ రాఘవేంద్ర రాజు అనే వ్యక్తి.. తానే హత్య చేయించదలచుకున్నాడా.? మరెవ్వరైనా ఇతరుల హత్యకుట్రలో తాను ఒక పావుగా ఉన్నాడా? ఎటూ హత్య జరగలేదు గనుక.. హత్యకు కుట్ర మాత్రమే బయటపడింది గనుక.. మరీ పెద్ద శిక్షలు పడకపోవచ్చు గనుక.. ఇలాంటి కారణాలు చెప్పి పోలీసులను బుకాయించాలని చూస్తున్నారా? తెరవెనుక సూత్రధారులు ఇంకెవరైనా ఇలాంటి వ్యూహాత్మక సమాధానాలతో ఎండ్ కార్డు వేసే ప్రయత్నం చేస్తున్నారా? అనే వివరాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.