చిన్న పిల్లల ఆట వస్తువుల విషయంలో చైనా ఆధిపత్యం ఈనాటిది కాదు. ఇండియాలో అయితే రెండు దశాబ్దాల నుంచి చైనా బొమ్మలు పూర్తి ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ ఉన్నాయి.
చిన్న పిల్లలు ముచ్చటగా ఆడుకునే కార్లూ, రైలు బొమ్మలతో మొదలుపెడితే.. ఆఖరికి బంకమట్టి కూడా చైనా నుంచినే దిగుమతి అవుతున్న పరిస్థితి ఉంది. ఏ టాయ్ స్టోర్ కు వెళ్లి చూసినా.. నూటికి 90 శాతం బొమ్మలు మేడిన్ చైనావే అయ్యుంటాయి. బ్యాటరీలతో నడిచే బొమ్మలైతే వందకు వంద శాతం చైనా ప్రోడక్ట్సే! చిన్న పిల్లల ప్లాస్టిక్ బాల్స్, రబ్బర్ తరహా పాలిమర్ తో తయారైన ఫుట్ బాల్స్ కూడా మేడిన్ చైనానే.
దేశీ టాయ్ స్టోర్ల కు వెళ్లినా, మాల్స్ లోని ఖరీదైన టాయ్ స్టోర్స్ కు వెళ్లినా చైనా బొమ్మలే కనిపిస్తాయి. అవే చౌక కూడా! దీంతో తప్పనిసరిగా అవే కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది. చైనా ప్రోడక్ట్స్ లో టాయ్స్ వంతు చాలా తక్కువ. వాటితో మొదలు.. పెడితే ఇండియన్ మార్కెట్ లో చైనా వస్తువుల భాగం భారీగా ఉంటుంది.
తాజాగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ మన్ కీ బాత్ లో మాట్లాడుతూ.. చైనా బొమ్మలకు చెక్ పెట్టాలని, దేశీయంగా బొమ్మలను తయారు చేయాలని పిలుపునిచ్చారు. అయితే ఉత్తుత్తి పిలుపులు పరిస్థితిని మార్చే పరిస్థితి లేదు.
అసలు చైనా ఆటబొమ్మలను తక్కువ ధరకు ఎలా తయారు చేయగలుగుతోంది అనే కిటుకును గ్రహించాలి. దానికి గురించి కాస్త గూగుల్ సెర్చ్ చేసినా.. కొన్ని విషయాలు బోధపడతాయి. చైనాలో ఆటబొమ్మలను తయారు చేసేది ఇతర పరిశ్రమల వ్యర్థాలతోనే! బొమ్మల తయారీకి అంటూ ప్రత్యేకంగా పరిశ్రమలు అని కాకుండా.. వేరే పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాలతో బొమ్మల తయారీ సాగుతోందని తెలుస్తోంది. బొమ్మల కోసమే పాలిమర్స్ ను సేకరించుకుని, తయారీ చేయాలంటే..ఎవరు తయారు చేసినా ఖరీదు ఎక్కువే అవుతుంది.
అయితే వేరే పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థ పాలిమర్స్ తో వాటిని తక్కువ ధరకు తయారు చేయడం చైనాలో సాధ్యం అవుతున్నట్టుగా ఉంది. కేవలం ఇండియా అనే కాదు.. ప్రపంచానికంతా చైనా తన టాయ్స్ ను ఎగుమతి చేస్తోంది. చైనా తయారు చేసే బొమ్మలను మిగతా ప్రపంచ తయారు చేసుకోలేక కాదు.. ముడి సరుకు తక్కువ ధరకు అనేది చైనా విజయంలో కీలకమైన అంశం. అలాంటి విషయాల గురించి ఇండియా కూడా పరిశోధించుకుంటే ఫలితాలు ఉంటాయి.