ఒకవైపు కరోనా నంబర్లలో దినవారీగా పెరుగుదల కనిపిస్తూ ఉంది. ఇప్పుడు దేశంలో ప్రతి రోజూ కొత్తగా నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య దాదాపు 78 వేల స్థాయికి చేరింది. ఇటీవలే ఉన్నట్టుండి రోజూ ఇరవై వేలకు పైగా అదనపు కేసులు నమోదు కావడం మొదలైంది. ఆ పరిస్థితి అలాగే కొనసాగుతూ ఉంది. ఇక డిశ్చార్జిలు 60 వేల స్థాయిలో కొనసాగుతూ ఉన్నాయి. రోజువారీగా యాక్టివ్ కేసుల లోడ్ క్రమం తప్పకుండా పెరుగుతూ ఉంది. ఇక రోజుకు 900 మంది స్థాయిలో కరోనాతో మరణిస్తున్న వారున్నారని కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న గణాంకాల్లోనే పేర్కొంటూ ఉంది.
డిశ్చార్జి అయ్యే వారి శాతం, కోలుకుంటున్న వారి సంఖ్య భారీగానే ఉన్నా.. కరోనా కారణం చేత దేశంలో ప్రతి రోజూ అంతమంది మరణిస్తూ ఉండటం భయానకమైన అంశమే.
అయితే అలాగని జనాలు ఎక్కడా ఆగడం లేదు. లాక్ డౌన్ సమయాల్లోనే కొందరు పెళ్లిళ్లు చేసేసుకున్నారు. అన్ లాకింగ్ ప్రక్రియలో వందల మందిని పిలిచి పెళ్లి కార్యక్రమాలు చేసుకుంటున్నారు. అలాగే ఇతర ఫంక్షన్ల విషయంలో కూడా జనాలు ఎక్కడా తగ్గడం లేదు. కాస్త తక్కువమందిని పిలుస్తున్నారేమో కానీ.. దేన్నీ ఆపడం లేదు.
ఇక సిటీ బస్సుల్లో ప్రయాణాలు ఫుల్ గా సాగుతున్నాయి. చిన్న చిన్న పల్లెటూళ్లలో కూడా కరోనా కేసులు చోటు చేసుకుంటున్నాయి. అయినా.. జనాలు వెనుకంజ మాత్రం వేయడం లేదు. దేన్నీ ఆపడం పట్ల వారు ఆసక్తి చూపడం లేదు. పెరుగుతున్న నంబర్లు, తిరుగాడుతున్న జనాలను గమనిస్తే.. ఇక కేసుల సంఖ్యను లెక్కించడం కూడా పెద్దగా ఉపయోగం లేని అంశం అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.