తాడిప‌త్రిలో ఓవ‌రాక్ష‌న్‌

జ‌నం ఎప్పుడూ బ‌ల‌హీనుల ప‌క్షానే ఉంటారు. ఈ విష‌యాన్ని గుర్తెరిగి రాజ‌కీయాలు చేస్తే ప్ర‌త్య‌ర్థుల‌ను బ‌ల‌హీన‌ప‌ర్చొచ్చు. అలా కాకుండా అత్యుత్సాహానికి పోయి, ఒక‌ట్రెండు రోజుల్లోనే ప్ర‌త్య‌ర్థుల‌ను ఏదో చేసేయాల‌ని అనుకుంటే మాత్రం అస‌లుకే ఎస‌రు…

జ‌నం ఎప్పుడూ బ‌ల‌హీనుల ప‌క్షానే ఉంటారు. ఈ విష‌యాన్ని గుర్తెరిగి రాజ‌కీయాలు చేస్తే ప్ర‌త్య‌ర్థుల‌ను బ‌ల‌హీన‌ప‌ర్చొచ్చు. అలా కాకుండా అత్యుత్సాహానికి పోయి, ఒక‌ట్రెండు రోజుల్లోనే ప్ర‌త్య‌ర్థుల‌ను ఏదో చేసేయాల‌ని అనుకుంటే మాత్రం అస‌లుకే ఎస‌రు వ‌స్తుంది. 

అనంత‌పురం జిల్లా తాడిప‌త్రిలో అధికార ప‌క్షం వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఈ సూక్ష్మాన్ని ప‌సిగ‌ట్ట‌కుండా మొండిగా వ్య‌వ‌హ‌రిస్తూ, చేజేతులా ప్ర‌త్య‌ర్థులైన జేసీ బ్ర‌ద‌ర్స్‌పై సానుభూతి తెప్పిస్తున్నార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి ఇంటిపైకి గురువారం దాడికి వెళ్ల‌డ‌మే కాకుండా, తాజాగా వారిపైన్నే ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టడాన్ని పోలీసుల ఓవ‌రాక్ష‌న్‌గా జ‌నం అభిప్రాయ‌ప‌డుతున్నారు. టీడీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు, జేసీ బ్ర‌ద‌ర్స్ ప్ర‌త్య‌ర్థుల‌పై ఇష్ట‌మొచ్చిన‌ట్టు నోరు పారేసుకున్నారు. 

అధికారంలో ఉన్న‌ప్పుడు పులుల్లా గాండ్రించిన జేసే బ్ర‌ద‌ర్స్‌…. అధికారం పోగానే పిల్లుల్లా “మ్యావ్ మ్యావ్” మంటున్నారు. దీన్ని బ‌ట్టి బ‌లం అధికారానిదే త‌ప్ప వ్య‌క్తుల‌గా త‌మ‌ది కాద‌ని జేసీ బ్ర‌ద‌ర్స్‌కు జ్ఞానోద‌యం అయింది.

జ‌గ‌న్ ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌ర్వాత జేసీ బ్ర‌ద‌ర్స్ కోర‌లు తీసింది. నెల‌ల త‌ర‌బ‌డి జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి, ఆయ‌న త‌న‌యుడిని జైల్లో పెట్టించి గ‌తంలో చేసిన త‌ప్పు ప‌నుల‌ను త‌గిన శిక్ష వేయించిన‌ట్టైంది. 

అలాగే ఆర్థికంగా కూడా జేసీ బ్ర‌ద‌ర్స్‌ను జ‌గ‌న్ ప్ర‌భుత్వం చావు దెబ్బ‌తీసింది, ఇంకా తీస్తోంది. ఇప్పుడు జేసీ బ్ర‌ద‌ర్స్ చాలా బ‌ల‌హీన‌ప‌డ్డారు. జేసీ బ్ర‌ద‌ర్స్‌పై ఇంత వ‌ర‌కూ ప్ర‌భుత్వం తీసుకున్న చ‌ర్య‌ల‌కు ప్ర‌జ‌ల నుంచి కూడా ఆమోదం ఉంది.

కానీ రెండు రోజుల క్రితం జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి ఇంటిపైకి ఎమ్మెల్యే పెద్దారెడ్డి వెళ్ల‌డాన్ని జ‌నం త‌ప్పు ప‌డుతున్నారు. జేసీ బ్ర‌ద‌ర్స్ మ‌న్ను అయితే, పెద్దారెడ్డి దుమ్ము అని తాడిప‌త్రి ప్ర‌జానీకం పెద‌వి విరుస్తున్నారు. ఇద్ద‌రూ దొందు దొందే అంటున్నారు. 

ఇసుక అక్ర‌మ ర‌వాణా విష‌య‌మై త‌న భార్య‌పై సోష‌ల్ మీడియాలో జేసీ బ్ర‌ద‌ర్స్ అబద్ధ‌పు ప్ర‌చారాన్ని చేస్తున్నార‌ని పెద్దారెడ్డి ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. నిజంగా కుటుంబ స‌భ్యుల‌పై అస‌త్య ప్ర‌చారం ఎవ‌రికైనా బాధ క‌లిగిస్తుంది. అయితే పెద్దారెడ్డి ఇక్క‌డ ఓ లాజిక్ మిస్ అయ్యారు. అధికారంలో తామున్నామ‌నే విష‌యాన్ని ఆయ‌న మ‌రిచిపోయారు.

తాను ఏదైతే అబ్ధ‌మ‌ని భావిస్తున్నారో దానిపై పోలీసుల‌తో విచార‌ణ చేయించి, త‌న ప్ర‌తిష్ట‌కు భంగం క‌లిగిస్తున్న వారిపై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకునే అధికారం చేతిలో పెట్టుకుని, అన‌వ‌స‌ర వివాదానికి తెర‌లేపార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. 

చ‌ట్టాన్ని పెద్దారెడ్డి త‌న చేతుల్లోకి తీసుకోవ‌డంపైనే అభ్యంత‌రమ‌ల్లా. ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి, ఆయ‌న త‌న‌యుడు అస్మిత్‌రెడ్డిల‌తో పాటు ప‌లువురు జేసీ అనుచ రుల‌పై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్ట‌డం విమ‌ర్శ‌ల‌కు దారి తీస్తోంది. 

జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి ఇంటిపై దాడి చేయ‌డ‌మే కాకుండా, మ‌ళ్లీ వాళ్ల‌పై అట్రాసిటీ కేసులు పెట్ట‌డం క‌క్ష‌పూరిత చ‌ర్య‌గా అభివ‌ర్ణిస్తున్నారు. ఇంత‌కాలం జేసీ బ్ర‌ద‌ర్స్ చేసిన‌ ఏ ప‌నుల‌నైతే జ‌నం అస‌హ్యించుకున్నారో, ఇప్పుడు వాటినే పెద్దారెడ్డి చేస్తున్నార‌నే అభిప్రాయాలు నెమ్మ‌దిగా జ‌నంలోకి వెళుతున్నాయి. 

వ్య‌క్తులు మారారే త‌ప్ప‌, విధానాల్లో మార్పు రాలేద‌నేది అనంత‌పురం జిల్లా ప్ర‌జానీకం అవేద‌న‌. తాడిప‌త్రిలో ప్ర‌శాంత జీవ‌నానికి బాట‌లు వేయాల్సిన పెద్దారెడ్డి, అందుకు విరుద్ధంగా అధికారాన్ని దుర్వినియోగం చేయ‌డం ఎవ‌రికి మంచిదో ఒక్క‌సారి ఆలోచించాల్సిన అవ‌స‌రం ఉంది. 

వ‌చ్చే సంవ‌త్స‌రం పెళ్లి చేసుకుంటాను