ప్రస్తుతం తెలంగాణలో కేటీఆర్ కాబోయే ముఖ్యమంత్రి అనే సబ్జెక్ట్ హాట్ టాపిక్ గా మారింది. అధికార టీఆర్ఎస్ నాయకులకు, మంత్రులకైతే ఇదో పారాయణం మాదిరిగా మారింది. ఒకరిని మించి ఒకరు రెచ్చిపోతున్నారు.
కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పకపోతే అది తమ కెరీర్ కు మైనస్ పాయింట్ అవుతుందేమోనని నాయకులు భయపడే పరిస్థితి. తనపై ఇలాంటి ప్రచారం చేయవద్దని నాయకులకు కేటీఆర్ ఫోన్లు చేసి చెబుతున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. ఇది ఎంతవరకు నిజమో తెలియదు.
కాబోయే సీఎం కేటీఆర్ అని ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేయిస్తున్నారని కొందరు ప్రతిపక్ష నాయకులు చెబుతున్నారు. నిజానిజాలేమిటో తెలియకపోయినా ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది. ఇన్ని రోజులు మంత్రులు కేటీఆర్ కాబోయే ముఖ్యమంత్రి అని మీడియా సమావేశాల్లో, యేవో ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు చెప్పారు. కానీ డిప్యూటీ స్పీకర్ పద్మారావు మాత్రం ఇలాంటి శషభిషలు పెట్టుకోదలచుకోలేదు.
అందుకే మొన్న మంత్రి కేటీఆర్ పాల్గొన్న సభలోనే ఆయన ఎదురుగానే కాబోయే ముఖ్యమంత్రికి ముందుగానే అభినందనలు చెప్పేశాడు. ఆ మరునాడే కేటీఆర్ తాను సీఎం అవుతానని ప్రచారం చేయవద్దని మంత్రులకు, నాయకులకు ఫోన్లు చేసినట్లు వార్తలొచ్చాయి. కానీ పద్మారావు ఊరుకోవడంలేదు.
కేటీఆర్ త్వరలోనే సీఎం అవుతాడని మీడియా సమావేశంలో మరోసారి నొక్కి వక్కాణించాడు. ఈ సందర్భంగా కేటీఆర్ పనితీరులు ఎలా ఉందో చెబుతూ ప్రశంసలు కురిపించాడు. అసలు నాలుగేళ్ల క్రితమే కేటీఆర్ సీఎం అవుతాడని తాను చెప్పానని పద్మారావు అన్నాడు.
అప్పట్లో ఓ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూ లో పాల్గొన్నప్పుడు కాబోయే సిఎం ఎవరు ? హరీష్ రావా ? కెటిఆరా ? అని అడిగితే కేటీఆర్ అవుతాడని తాను చెప్పానని అన్నాడు. ఇంతటితో ఊరుకోకుండా తనతో ఎవరూ ఇలా చెప్పించడంలేదని, తానే అంచనా వేసుకొని చెబుతున్నానని అన్నాడు పద్మారావు.
ఇదిలా వుంటే కేటీఆర్ సీఎం అయితే పరిస్థితి ఎలా ఉంటుందని అధికారులు, ఉద్యోగులు చర్చించుకుంటున్నారని ఓ పత్రిక రాసింది. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల్లో జోరుగా చర్చ సాగుతోందట.
ఇప్పుడున్న మంత్రులు తమ పదవులు ఉంటాయో, ఊదుతాయో అని భయపడుతున్నారట. కొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మంత్రి పదవుల కోసం ఆశ పడుతున్నారట. కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ అనే ప్రచారం ఇంకా ఎంత జోరుగా సాగుతుందో మరి.