జనసేనాని పవన్‌కళ్యాణ్ శపథం చేశారు. గతంలో కూడా ఆయన పలుమార్లు, పలువురిని ఓడిస్తానని శపథం చేయడం తెలిసిందే. తాజాగా ప్రకాశం జిల్లా వైసీపీ ఎమ్మెల్యే రాంబాబు వచ్చేసారి ఎలా గెలుస్తారో చూస్తానని వీర్రావేశంతో ఊగిపోయారు.
గతనెల 16న ప్రకాశం జిల్లాలోని కోనపల్లికి వచ్చిన ఎమ్మెల్యే రాంబాబును డ్రైనేజీ అధ్వాన్న పరిస్థితిపై జనసేన కార్యకర్త వెంగయ్యనాయుడు నిలదీశాడు. దీంతో జనసేన కార్యకర్తపై ఎమ్మెల్యే తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యాడు. ఆ ఘటన తర్వాత కొన్ని రోజులకు వెంగయ్యనాయుడు తన పొలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఎమ్మెల్యే అనుచరుల వేధింపుల వల్లే ఆత్మహత్యకు పాల్పడ్డాడని జనసేన నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మృతుడి కుటుంబాన్ని జనసేనాని పరామర్శించి ఆర్థిక సాయాన్ని అందించారు.
అనంతరం ఒంగోలులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పవన్ మాట్లాడుతూ .. జనసేన కార్యకర్తలపై పదే పదే దాడులు చేస్తే ఎలా ఎదుర్కోవాలో తమకు తెలుసని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో అన్నా రాంబాబు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా అసెంబ్లీలో అడుగు పెట్టకుండా చూసే బాధ్యత తాను తీసుకుంటున్నట్టు స్పష్టం చేశారు. గతంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌ను ఉద్దేశించి ఎట్టి పరిస్థితుల్లోనూ ముఖ్యమంత్రి కానివ్వనని పవన్ శపథం చేసిన సంగతి తెలిసిందే.
ఇలా ఏ ఊరికి వెళితే అక్కడి ప్రజాప్రతినిధిని హెచ్చరించడం పవన్‌కు వెన్నతో పెట్టిన విద్య అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. కాగా ఒంగోలులో కార్యకర్తల సమావేశం అనంతరం ప్రకాశం జిల్లా ఎస్పీని కలిసి వెంగయ్య ఆత్మహత్యకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని పవన్‌కల్యాణ్ కోరారు.