cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: బంగారు బుల్లోడు

సినిమా రివ్యూ: బంగారు బుల్లోడు

రివ్యూ: బంగారు బుల్లోడు
తారాగణం: అల్ల‌రి నరేష్‌, పూజ ఝ‌వేరి, తనికెళ్ల భరణి, పోసాని కృష్ణమురళి, ప్రవీణ్‌, వెన్నెల‌ కిషోర్‌, రాజేష్‌, పృధ్వీ తదిత‌రులు
సంగీతం: సాయి కార్తీక్‌
ఎడిటింగ్‌: ఎం.ఆర్‌. వర్మ
సినిమాటోగ్రఫీ: సతీష్‌ ముత్యాల‌
నిర్మాత: సుంకర రామబ్రహ్మం
రచన, దర్శకత్వం: గిరి పలిక
విడుదల‌ తేదీ: జనవరి 23, 2021

జబర్దస్త్‌ జమానాలో అచ్చంగా కామెడీ సినిమాలు తీసి జనాల‌ను మెప్పించడం అంత తేలిక కాదు. ఒకానొక దశలో ఏడాదికి అరడజను సినిమాలు చేసిన అల్ల‌రి నరేష్‌ కనీసం ఏడాదికి ఒకటీ రెండూ సినిమాలు కూడా చేయలేని పరిస్థితి వచ్చిందంటే అచ్చమైన కామెడీ సినిమాకు డిమాండ్‌ ఎంత పడిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ‘బంగారు బుల్లోడు’ అంటూ ఎప్పుడో తొంభైల‌లో వచ్చిన బాల‌కృష్ణ సినిమా టైటిల్‌ పెట్టిన ఈ చిత్రం సాగే తీరు చూస్తే ఇది కూడా అదే టైమ్‌లో చేసి వుండాల్సిన సినిమా అనిపిస్తుంది. సినిమా మొత్తంలో బాల‌కృష్ణ సినిమాలోని ఆ రీమిక్స్‌ పాట మాత్రమే వినసొంపుగా వుంది. 

దేవుడి గుళ్లో నగలు మాయం కావడం, ఆ స్థానంలో వేరే నగలు చేయించి పెట్టించి తద్వారా తన తాతయ్య చివరి కోరిక తీర్చడం హీరో ల‌క్ష్యం. బ్యాంక్‌ ఉద్యోగులు కుదవ పెట్టుకున్న నగల‌ను పర్సనల్‌ పనుల‌కు వాడుకుంటూ వుండడం, అదే ఐడియాతో తన తాతయ్య బాధ తీర్చాల‌ని హీరో అనుకోవడం లాంటి అంశాల‌తో బంగారు బుల్లోడు ఆశాజనకంగానే మొదల‌వుతుంది. అయితే ఆ ఆరంభ సన్నివేశాల‌లో భాగంగానే వచ్చే శ్మశానంలోని పేకాట దృశ్యంతో ఇందులో హాస్యం ఎలా వుండబోతుందనే హింటు దొరుకుతుంది. 

అయినప్పటికీ ఈ సినిమాలో ఏదో కామెడీ వుంటుందని ఆశ పడితే ఒక్కో సన్నివేశం చూసే కొద్దీ అది నీరుగారిపోతుంది. పాము, కోళ్లు కూడా తాకట్టు పెట్టుకుని వడ్డీకి డబ్బులిచ్చే పోసాని పాత్ర ద్వారా పండుతుందని అనుకున్న కామెడీ అసలు నవ్వించలేకపోయింది. ఇక అల్ల‌రి నరేష్‌ విషయానికి వస్తే ఇంకా పెళ్లి కాని పాతికేళ్ల కుర్రాడంటే నమ్మలేనట్టుగా వుండడం ఒక ఎత్తు అయితే, అప్పట్లో తన సినిమాల్లో మిగతా వాళ్లెలా వున్నా తను మాత్రం ఎనర్జీతో నటించి ఎలాగయినా నవ్వించాని ప్రయత్నించేవాడు. 

బహుశా ఈ కథ కానీ, పాత్ర కానీ ఏ విధమైన ఎక్సయిట్‌మెంట్‌ ఇవ్వకపోవడమో లేదా ఈ సినిమా తనను మళ్లీ బిజీ చేస్తుందనే కాన్ఫిడెన్స్‌ రాకపోవడమో అల్ల‌రి నరేష్‌ చాలా నీరసంగా కనిపించాడు. కామెడీ పండించడం కంటే ఎమోషన్‌ సీన్స్‌ మీద ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నట్టు అనిపించాడు. కమెడియన్లను చాలా మందిని పెట్టుకున్నా, జబర్దస్త్‌ బ్యాచ్‌ని కూడా వాడేసినా కానీ హాయిగా నవ్వుకునే ఒక్క సీన్‌ అయినా సృష్టించలేకపోయారు. 

కామెడీ అనేది కేవలం తాలింపు మాత్రమే అనుకునే సినిమాల్లో హాస్య సన్నివేశాలు పేల‌కపోతే ఫర్వాలేదు కానీ అచ్చంగా నవ్వించడానికే తీసిన సినిమాలో ఇలాగుంటే కష్టం. వెన్నెల‌ కిషోర్‌ రెగ్యుల‌ర్‌గా కనిపించే ఎన్నారై పెళ్లికొడుకు పాత్రలో కనిపించినా కానీ అతను వున్న కాపేసే కాస్తయినా నవ్వబుద్ధేస్తుంది. అందుకేనేమో కథలో చోటు లేకపోయినా కానీ మళ్లీ ఇంకోసారి అతడిని రప్పించి నవ్వించడానికి చూసారు. 

కామెడీ వర్కవుట్‌ కాని పక్షంలో నగల‌ పరంగా డ్రామా సెట్‌ చేసి ఉత్కంఠ రేపితే వర్కవుట్‌ అవుతుందని అనుకున్నారు కానీ ఆ సన్నివేశాల‌లోను పస లేకపోవడంతో నస తప్పలేదు. ఇకపోతే హీరోయిన్‌తో చిన్న ల‌వ్‌ ట్రాక్‌ పెట్టి అదో ఎలిమెంట్‌ జత చేసారు కానీ అదీ రక్తి కట్టలేదు. అల్ల‌రి నరేష్‌ బాడీ లాంగ్వేజ్‌కి తగ్గ రూరల్‌ కామెడీ కథలు రాసి, అతడి కోసమే ప్రత్యేకమైన పాత్రలు సృష్టించిన ఇ.వి.వి. రొటీన్‌ అనిపించినా కానీ ఎన్నో సక్సెస్‌ఫుల్‌ సినిమాలు తీసారు. కానీ ఆ నేర్పు ఇప్పటి దర్శకుల‌లో కనిపించడం లేదు. 

పది నిమిషాల‌ స్కిట్స్‌తో వారానికి రెండు గంటల‌ వినోదాన్ని టీవీలోనే అందిస్తోన్న హాస్య నటుల‌ను దాటి సినిమా వరకు రప్పించి నవ్వించి పంపించడమంటే చాలా పెద్ద టాస్కు. పోనీ కామెడీ అటుంచి మిగతా అంశాల‌ పరంగా అయినా ఆకట్టుకుందా అంటే కనీసం సాంకేతికంగా చెప్పుకోతగ్గ ఒక్క ఫ్యాక్టర్‌ కూడా లేదు. సంగీతం, సినిమాటోగ్రఫీ అన్నీ కూడా పాత కాలం పద్ధతుల‌కు తగ్గట్టే వున్నాయి. 

మల్టీప్లెక్సులో అయితే హోప్‌ అన్నదే లేదు కానీ సింగిల్‌ స్క్రీన్స్‌లో కూడా ఇలాంటి రూరల్‌ కామెడీలు చెల్ల‌విపుడు. మిడిల్‌ క్లాస్‌ మెలోడీస్‌ లాంటి సహజత్వం నిండిన పాత్రలు, కథలు అయితే జనం రిలేట్‌ అవుతారు. ఆడియన్స్‌ అభిరుచి మారిపోయింది కనుక వారి టేస్టుకి అనుగుణమైన హాస్యం వుందనుకుంటే తప్ప ఇలాంటి ప్రయత్నాలు చేయడం సరి కాదిపుడు. 

బాటమ్‌ లైన్‌: గిల్టు బంగారం!

-ఏ.పి.

 


×