ఎక్కడయినా, నష్టపోయిన వాడి పట్ల సానుభూతి వుంటుంది. అయ్యో అన్న మాటలు వినిపిస్తాయి. అందరూ కాకున్నా ఒకరో, ఇద్దరో మద్దతుగా నిలుస్తారు. కానీ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, (ఆఫ్ కోర్స్ ఆ పార్టీ ఆంధ్రలో మాత్రమే కొన ఊపిరితో వున్నా, మరే రాష్ట్రంలోనూ దాని, ఉనికి లేకపోయినా, జాతీయ పార్టీనే అని చెప్పుకుంటుంది) చంద్రబాబునాయుడు విషయంలో వ్యవహారం వేరుగా వుంది.
ఆ పార్టీ నుంచి నలుగురు ఎంపీలు జంప్ అన్నా, పైగా అదంతా చట్టబద్దమే అన్నా, దీని పట్ల ఎటువంటి నిరసనా లేదు, సానుభూతి అంతకన్నా లేదు. ఎందుకుని? ఇధంతా చంద్రబాబు స్వయంకృతాపరాధం కనుక. దీనికి చాలా కారణాలు వున్నాయి.
అసలు ఇలాంటి ఫిరాయింపులు గడచిన అయిదేళ్లుగా భయంకరంగా ప్రోత్సహించింది చంద్రబాబే. ఫిరాయించిన వారి రాజీనామాలు తూతూ మంత్రంగా అలావుంచి, వారిలో కొందరిని మంత్రులుగా కూడా చేసిన ఘనత చంద్రబాబుదే. ఈ విషయంలో జగన్ మోహన్ రెడ్డి, వైకాపా ఎంత గోలపెట్టినా, స్పీకర్ పట్టించుకోలేదు. మరి ఇప్పుడు ఇదే సంఘటన బాబు విషయంలో జరిగితే ఎవరు మాత్రం ఎందుకు స్పందిస్తారు?
ఇంకా చిత్రమేమిటంటే… అసలు ఆ నలుగురు వాళ్ల అంతట వాళ్లు వెళ్లలేదు, చంద్రబాబే పంపేసారు అన్న టాక్ రావడం. దీనికి కూడా కారణం చంద్రబాబే. ఇలాంటి టక్కు టమార విద్యలు ఆయన గతంలో అనేకం ప్రదర్శించారు. పైగా ఎన్నికలు అయిపోయి, ఫలితాలు వచ్చేసిన తరువాత, తూచ్.. తమకు యూపీఏతో ఏనాడూ సంబంధం లేదు, ఎన్డీఎను ఏమాటా అనేదిలేదు అంటూ చటుక్కున యూటర్న్ తీసుకునే ప్రయత్నం చేసారు.
మరి అలాంటి నేపథ్యంలో యూపీఏ ఎందుకు బాబుకు సపోర్టుగా వస్తుంది? ఇదంతా ఎన్డీఎకు దగ్గర కావడం కోసం బాబు ఆడుతున్న నాటకమే అని అనుకుంటున్నారు జనాలు. అలా అనుమానం రావడం బాబు గారి ట్రాక్ రికార్డు ప్రకారం సహజమే కూడా. అందుకే ఈ సమస్య కేవలం బాబుగారు ఒక్కరిదే అన్నట్లు వుంది పరిస్థితి. జాతీయ పార్టీల నాయకులు కానీ, జాతీయ మీడియా కానీ బాబుకు మద్దతుగా రాలేదు.
వెళ్లిన వాళ్లు బాబుగారి ఆంతరంగికులు, ఆయన బినామీలు అని ఇన్నాళ్లు వినిపిస్తూ వచ్చింది. అందువల్ల వాళ్లు వాళ్లంతట వాళ్లు వెళ్లి వుండరని, ఎన్డీఎతో పొత్తుకోసం, భవిష్యత్ అవసరాల కోసం, లావాదేవీల కోసం బాబుగారే వారిని స్వయంగా సాగనంపి వుంటారని వార్తలు వస్తున్నాయి తప్ప, అయ్యో.. చంద్రబాబు, అధికారాంతమందు? ఇలాగునా అని అనడం లేదు.
పాపం, బాబుగారిని బాబుగారే ఓదార్చుకునే పరిస్థితి.