కేసీఆర్ మేనల్లుడు హరీష్ రావు అనేస్థాయి నుంచి తెలంగాణ ఉద్యమంలో కీలక నేతగా, తొలి తెలంగాణ ప్రభుత్వంలో ముఖ్య నాయకుడిగా ఎదిగారు హరీష్ రావు, క్రమక్రమంగా కేసీఆర్ అనే ముద్ర తొలగించుకుంటూ.. హరీష్ అనే బ్రాండ్ ని పెంచుకుంటూ పార్టీ ట్రబుల్ షూటర్ గా మారిపోయారు.
అంతా బాగుందనుకున్న టైమ్ లో కొడుకు కేటీఆర్ రాజకీయ భవిష్యత్ కోసం మేనల్లుడి రాజకీయ జీవితంపై చావుదెబ్బ కొట్టారు కేసీఆర్. అత్యంత వ్యూహాత్మకంగా మంత్రిమండలిలో చోటు దక్కకుండా చేసి కేవలం ఎమ్మెల్యేగా పరిమితం చేశారు. తాజాగా ప్రారంభమైన కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో కూడా హరీష్ రావు పాత్ర కాదనలేనిది. మంత్రిగా ఉన్న సమయంలో వందలసార్లు కాళేశ్వరం ప్రాజెక్ట్ పనుల్ని పర్యవేక్షించారు హరీష్ రావు. తీరా ఆ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి కూడా ఆయనకి ఆహ్వానం అందలేదు.
పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, మంత్రులకు ఇచ్చినంత గౌరవం కూడా హరీష్ కి దక్కలేదనేది వాస్తవం. అయితే టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మాత్రం మామా అల్లుళ్ల మధ్య ఏమీలేదని చెబుతుంటాయి. స్వయంగా హరీష్ రావు కూడా తనకు ఏమాత్రం అసంతృప్తి లేదని చెప్పుకొస్తుంటారు. కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం రోజున హరీష్ తన అసంతృప్తినంతా ట్విట్టర్ లో వెళ్లగక్కారు.
ప్రాజెక్ట్ ప్రారంభం రోజున తన నియోజకవర్గంలో విగ్రహావిష్కరణకు హాజరైన ఫొటోల్ని, ఓ పెళ్లి వేడుకకు వెళ్లిన ఫొటోల్ని, యోగా చేస్తున్న ఫొటోల్ని.. వీటితోపాటు.. తన సొంత నియోజకవర్గంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ కేక్ కట్ చేస్తున్న ఫొటోల్ని ఉంచారు హరీష్ రావు. ఎంతో ముఖ్యమైన విషయం అయితేనే హరీష్ ట్విట్టర్ లో పోస్ట్ చేస్తారు. రెండు రోజులకోసారి మాత్రమే ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉంటారు. అలాంటి హరీష్.. ఒకేరోజు.. ఇలా తన పర్సనల్ కార్యక్రమాలన్నిటినీ సోషల్ మీడియాలో ఉంచడం చూస్తుంటే ఆయనలో అసంతృప్తి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది.
ప్రాజెక్ట్ ప్రారంభోత్సవంలో ఉండాల్సిన తను ఇలా సొంత నియోజకవర్గానికే పరిమితం కావాల్సి వచ్చిందన్న బాధను ఆయన పరోక్షంగా ఇలా వెల్లడించారు. అంతేకాదు ఇదే విషయాన్ని సన్నిహితుల వద్ద వెళ్లగక్కారు. బాధను దిగమింగుకుంటూ నవ్వుతూ ఈ కార్యక్రమాలన్నిటిలో పాల్గొన్నారు హరీష్. పరాయి రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, మంత్రులను వేదిక మీదకు తెచ్చి పెట్టుకుని తనను కనీసం ప్రాజెక్ట్ దగ్గరికి కూడా రానీయలేదనే అసంతృప్తి మాత్రం ఆయన వ్యవహార శైలిలో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.
సోషల్ మీడియాలో కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవ ఫొటోలు ఎంత ఫేమస్ అయ్యాయో.. అంతకంటే ఎక్కువగా హరీష్ రావు ఫొటోలు సర్క్యులేట్ అవుతున్నాయి. ఇంతకీ మామ దయ కోసం హరీష్ వేచి చూస్తున్నారా లేక, పరోక్షంగా కేసీఆర్ ని బెదిరిస్తున్నారా తేలాల్సి ఉంది.