పాలిచ్చే ఆవు.. కుమ్మే దున్నపోతు.. ఏపీ రాజకీయం

పాలిచ్చే ఆవును వదలుకుని తన్నే దున్నపోతును ఎన్నుకున్నారట.. ఇది ఏపీ ప్రతిపక్షనేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఊవాచ. అసలు ఇప్పటికీ కూడా ఈయనకు ఎందుకు అంత తక్కువ సీట్లు వచ్చాయో అర్థంకావడం లేదట.…

పాలిచ్చే ఆవును వదలుకుని తన్నే దున్నపోతును ఎన్నుకున్నారట.. ఇది ఏపీ ప్రతిపక్షనేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఊవాచ. అసలు ఇప్పటికీ కూడా ఈయనకు ఎందుకు అంత తక్కువ సీట్లు వచ్చాయో అర్థంకావడం లేదట. నలబై ఏళ్ల రాజకీయ పరిశ్రమ నడుపుతున్నానని చెప్పుకునే చంద్రబాబు నాయుడుకు నిజంగా అర్థం కాలేదంటే ఏమనుకోవాలి. అయితే ఆయన అబద్దం ఆడుతుండాలి. లేదా ఆయనలో మాససిక ఆలోచనలలో ఏదో తేడా వచ్చి ఉండాలి. ఆయనకు ఎందుకు ఓడిపోయారో అర్థం కాకపోతే మానే.. కానీ తనను పాలిచ్చే అవుతో పోల్చుకున్నారే? అది ఏరకంగానో ఆయన చెప్పగలరా? ఆయన అధికారంలో ఉన్నప్పుడు 80శాతం మంది ప్రజలు సంతృఫ్తిగా ఉన్నారని ఏవో పిచ్చి సర్వేలు చెబుతుండేవారు.

కాని నిజం ఏమిటో ఆయనకు ఫలితాలు తర్వాత తెలిసి ఉండాలి కదా.. 87శాతం సీట్లను వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌కు ప్రజలు ఇచ్చారంటే దాని అర్థం ఏమిటి? అయినా చంద్రబాబు అర్థంకాకపోతే ఎవరితో ట్యూషన్‌ చెప్పించాలి? ఆయన పాలు ఇచ్చే ఆవు అయితే ప్రజలు అంత దారుణంగా చీత్కరించారన్నది ఆలోచిచంచకుండా ప్రజలే తప్పు చేశారన్నట్లుగా, అధికారంలోకి వచ్చిన జగన్‌ ప్రభుత్వాన్ని దున్నపోతు అన్నట్లుగా, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌కు ఓట్లు వేసినవారంతా దున్నపోతులకు ఓట్లు వేశారన్నట్లుగా ప్రచారం చేయడం అంటే ఎంత అహంభావంతో ఆయన ఉన్నారనుకోవాలి?

2014లో ఆయనకు ఎందుకు ఓటువేశారు. తెలంగాణలో తెలంగాణ కావాలని, ఏపీలో సమైక్యంగా ఉండాల్సిందే.. అంటూ రెండువాదనలు చేసి ప్రజలను పిచ్చివాళ్లను చేసినందుకా? 87 వేల కోట్ల రూపాయల రైతుల రుణాలను మాఫి చేస్తామని అది తన అనుభవం అని ప్రజలను మోసం చేసినందుకా? డ్వాక్రా మహిళల రుణాలన్నిటిని రద్దు చేసేస్తామని బొల్లినందుకా? బాబు వస్తే జాబు వచ్చేస్తుందని అసత్యాలు ప్రచారం చేసినందుకా? అప్పుడు ఆయనకు ఓటు వేస్తే ఏమని చెప్పారు?

తన అనుభవం చూసి… తానైతేనే రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళతానని ప్రజలు అనుకున్నారని, అందుకే తనకు మద్దతు ఇచ్చారని చంద్రబాబు చెప్పగలిగారే. అంటే దాని అర్థం ఆయనకు తాను ఎందుకు గెలిచింది, ప్రజలు ఎందుకు గెలిపించింది.. కారణాలు కనిపెట్టగలిగారు. అవే నిజంగా కారణాలా? కాదా అన్నది వేరే విషయం. ఆప్పటి సామాజిక సమీకరణలు, రాజకీయ సమీకరణలు, మోడీ, పవన్‌కళ్యాణ్‌ ప్యాక్టర్‌ వంటివి ఉన్నాయని కూడా చంద్రబాబు చెప్పేవారు కదా.. మొత్తం తన మహిమ వల్లే, తనపై ఉన్న అపార విశ్వాసం వల్లే ఓట్లు ఎగబడి వేశారని కనిపెట్టిన చంద్రబాబుకు ఇప్పుడు మాత్రం కారణాలు కనిపెట్టలేకపోయారట. పైగా దున్నపోతులకు జనం ఓట్లు వేశారట.

నిజమే.. తెలుగుదేశం ఎమ్మెల్యేలు దున్నపోతులా దారుణంగా ప్రజలను కుమ్మేశారు.. నిజమే లక్షన్నర కోట్ల అప్పులు తెచ్చి వాటిని ఏమి చేసిందో తెలియకుండా చంద్రబాబు ప్రభుత్వం దున్నపోతు మీద వాన కురిసినట్లు వ్యవహరించింది. నిజమే.. గోదావరి పుష్కరాలలో ఇరవైతొమ్మిది మంది మరణిస్తే దున్నపోతు కన్నా ఘోరంగా మొద్దుబారి వ్యవహరించింది. నిజమే.. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటూ ఓటుకు నోటు కేసులో హైదరాబాద్‌లో అడ్డంగా పట్టుబడిపోయినా ప్రజలు తిరగబడకుండా ఉండడం అలాంటిదే అనుకోవాలా? స్మగ్లర్లను వదలిపెట్టి ఎర్రచందనం కూలీలను దారుణంగా ఎన్‌కౌంటర్‌ చేసినా ఎవరూ ఏమి చేయలేకపోవడం కూడా అలాంటిదేనా? అవన్ని ఎందుకు!

చంద్రబాబు నాయుడు దున్నపోతు అంటూ దూషణల ప్రసంగం సాగించిన కాసేపటికి సత్తెనపల్లి టీడీపీ కార్యకర్తలు ఎందుకు మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావుపై ఫిర్యాదు చేస్తే వారికి సరైన సమాధానం చెప్పకుండా వెళ్లిపోయారు? కె.టాక్స్‌ పేరుతో కోడెల కుటుంబం ప్రజలను వేదించిందన్నది వాస్తవమా? కాదా? ఇది ప్రత్యక్ష ఉదాహరణ అయితే చింతమనేని ప్రభాకర్‌, వరదాపురం సూరి వంటివారు చేసిన అరాచకాల గురించి వేరే చెప్పాలా? ఇవేవి ఆయనకు తెలియవంటే నమ్మాలా?

ఇరిగేషన్‌ టెండర్లు, అమరావతి రాజధాణిలో స్కాములు, రియల్‌ ఎస్టేట్‌ దందాలు, స్వయంగా ఆయనే అక్రమ కట్టడంలో నివాసం ఉండడం? ఇవన్ని కూడా చూస్తూ అప్పుడు ఊరుకున్నందుకు ప్రజలను చంద్రబాబు దున్నపోతులకు ఓట్లు వేశారని పోల్చుతున్నారా? అసలు వాస్తవమేమిటంటే ప్రభుత్వాలలో ఉండేవారు ఎవరూ పాలిచ్చే ఆవులు కారు. ఎందుకంటే వారేమీ సొంత ఇంటిలో డబ్బు తెచ్చి ప్రజలకు పంచడంలేదు? చంద్రబాబు నాయుడు ఇన్ని కబుర్లు చెబుతున్నారు కదా? సంక్రాంతి కానుకలనో, మరొకటనో, హెరిటేజ్‌ సరుకులు సేల్‌ చేశారే కానీ, ఎవరికైనా ఉచితంగా ఒక సరుకు అయినా ఇచ్చారా? ఇవ్వలేదే?

వీరు ఇవ్వనవసరం లేదు.. ప్రజలు కట్టే పన్నులను సద్వినియోగం చేసి వారికి అవసరమైన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపడితేచాలు.. ప్రజలు నాయకులు ఎన్నుకుంటారు. వాళ్లు ఎన్నుకున్నంత మాత్రాన వారేమి దైవాంశ సంభూతులు కారు. ఆ విషయాన్ని మర్చిపోయి ప్రజలను దూషించే విధంగా నేతలు మాట్లాడితే కర్రుగాల్చి వాతలు పెడతారనడానికి 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికలే ప్రత్యక్ష నిదర్శనం. 2014లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ఓడిపోతే, ఆ పార్టీ అధినేత జగన్‌ ఎక్కడా ప్రజలను కాని, చంద్రబాబును కాని ఒక్కమాట అనలేదు.

కాని ఇప్పుడు చంద్రబాబు మాత్రం జగన్‌ను, జగన్‌కు ఓటు వేసినవారిని దున్నపోతులతో పోల్చి అవమానిస్తున్నారు. ఒక విషయం చంద్రబాబు అర్థం చేసుకుంటే మంచిది. ఆయన పాలిచ్చే ఆవు అని ఏపీ ప్రజలు అనుకోలేదు. ప్రజలను పీడించే  పశువుగానే చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రజలు పరిగణించారు కనుక అలాంటి ఫలితం వచ్చింది. జగన్‌ను పాలిచ్చే ఆవు అనుకున్నారు కనుకే, అందుకు విరుద్ధంగా చంద్రబాబు ప్రభుత్వాన్ని భావించారు కనుకే జగన్‌కు పట్టంకట్టారు.

ఇప్పటికైనా చంద్రబాబు వాస్తవ ప్రపంచంలోకి వస్తే మంచిది. లేకుంటే ఆయనకే నష్టం.. ఆయన తనకు నచ్చనివారిని దున్నపోతులు అనుకుంటే ఆయన ఇష్టం. కాని వాటితోనే తాను కుమ్మించుకుంటానంటే ఎవరు మాత్రం ఏమి చేయగలరు?
-కొమ్మినేని శ్రీనివాసరావు

‘బాహుబలి’ రికార్డ్స్ ను ‘సాహో’ అధిగమిస్తుందా?