దళిత యువతిపై ఏళ్ల తరబడి సాగిన అత్యాచారం కేసులో గ్లామర్ రంగానికి చెందిన వారు, రాజకీయ నాయకుల పీఏలు, విద్యార్థి సంఘం నాయకులు, ఇతరత్రా ప్రముఖులు ఉన్నారు. దళిత యువతి ఆవేదన వింటే కన్నీళ్లు రాక మానవు. సమాజం ఎంత దుర్మార్గంగా ఉందో ఈ మహిళకు జరిగిన అన్యాయమే కళ్లకు కడుతుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు హైదరాబాద్ పంజాగుంట పోలీసులు వివిధ సెక్షన్ల కింద 143 మందిపై కేసు నమోదు చేశారు.
నల్గొండ జిల్లా వేములపల్లి మండలం సెట్టిపాలెం గ్రామానికి చెందిన దళిత యువతికి మిర్యాలగూడ నివాసితో 2009, జూన్‌లో పెళ్లి జరిగింది. అత్తింటి వారి వేధింపులు తాళ లేక 2010, డిసెంబర్‌లో విడాకులు తీసుకొంది. ఆ అమ్మాయికి చదువంటే ఇష్టం. దీంతో తల్లిదండ్రుల వద్దే ఉంటూ చదువు కునేది. ఈ క్రమంలో ఆ యువతికి విద్యార్థి సంఘం నాయకులు, ఇతరత్రా పరిచయాలు ఏర్పడ్డాయి. కళాశాలలో పరిచయమైన విద్యార్థి సంఘం నాయకుడు ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమెను నగ్నంగా ఫొటోలు తీసి బెదిరింపులకు పాల్పడేవాడు.
ఈ క్రమంలో ఆ యువతి హైదరాబాద్‌లోని రాజ్‌భవన్ రోడ్డులోని అపార్ట్‌మెంట్‌లో గదిని అద్దెకు తీసుకొంది. తనను నగ్నంగా తీసిన వీడియోలను సాకుగా చూపి, సోషల్ మీడియాలో పెడతామని సామూహిక అత్యాచారానికి పాల్పడేవారని ఆ యువతి వాపోయింది. ఫిర్యాదులో పేర్కొన్న దాంట్లో ఏమున్నదంటే…
‘గత 11 ఏళ్లలో నాపై 143 మంది సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. గర్భం దాల్చడంతో అబార్షన్ చేయించారు. నగ్నంగా చిత్రాలు, వీడియోలు తీశారు. సిగరెట్లతో కాలుస్తూ శారీరకంగా హింసించారు. ఎవరికైనా చెబితే చంపేస్తామని తుపాకీతో బెదిరిం చారు. నాపై అత్యాచారానికి పాల్పడిన వారిలో విద్యార్థి సంఘాల నాయకులు, రాజకీయ నాయకుల పీఏలు, సినీ నటులు, టీవీ యాంకర్లు ఉన్నారు. వారి నుంచి నాకు ప్రాణహాని ఉంది’ అంటూ పంజాగుట్ట పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆ యువతి తన భయాందోళనను వ్యక్తం చేసింది. పోలీసులకు ఆమె ఇచ్చిన ఫిర్యాదే 100 పేజీల్లో ఉందంటే…ఎన్నెన్ని వివరాలు ఉంటాయో అర్థం చేసుకోవచ్చు.
తనపై సామూహిక అత్యాచారాలు, వేధింపులు ఒక్క హైదరాబాద్‌లోనే కాకుండా రాష్ట్రాల హద్దులు దాటాయని చెప్పింది. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటకతో పాటు ఇతర రాష్ట్రాలకు తీసుకెళ్లి నరకం చూపించారని తన గోడు వెళ్లబోసుకొంది. తన ను ఆ కిరాతకులు వదిలిపెట్టరని, బహుశా ఇదే తన చివరి వాంగ్మూలమని పేర్కొనడం గమనార్హం.
తనతో పాటు మరికొందరు యువతులపైనా అఘాయిత్యాలకు పాల్పడినట్టు బాధిత యువతి తెలిపింది. తనకు న్యాయం చేయడంతో పాటు ప్రాణభిక్ష ప్రసాదించాలని పోలీసులను వేడుకుంది. బాధిత యువతి మేరకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఇన్‌స్పెక్టర్ నిరంజన్‌రెడ్డి తెలిపారు.