రాజకీయ ప్రత్యర్థులను టార్గెట్ చేయడానికి చంద్రబాబుకి ఏదో ఒక మాధ్యమం కావాలి. అప్పట్లో మీడియాతో ఆ పని పూర్తిచేశారు, ఇప్పుడు సోషల్ మీడియాతో పరోక్షంగా తన ప్రత్యర్థులను టార్గెట్ చేస్తున్నారు. చంద్రబాబు రాజకీయ కుతంత్రాన్ని నిశితంగా విమర్శించినందుకే జీవీఎల్ నరసింహారావుపై అనుచిత పోస్టింగ్ లు పెట్టారు టీడీపీ సానుభూతి పరులు. టీడీపీ నేతలే ఇలా పార్టీకి సంబంధం లేకుండా పనికానిచ్చేశారు. చివరకు పోస్ట్ లు పెట్టిన వ్యక్తిని అరెస్ట్ చేయడంతో అసలు విషయం బైటపడింది.
కేసులను అడ్డు పెట్టుకుని సీఎం జగన్ ని విలన్ గా చూపించే ప్రక్రియ చాన్నాళ్ల క్రితమే మొదలైంది. పచ్చపాత మీడియాలో జగన్ పై కథనాలు కోకొల్లలు. గతంలో ఏ రాజకీయ నాయకుడిపై ఈ తరహాలో తప్పుడు కథనాలు వచ్చి ఉండవు. ఆరోపణలు నిరూపణ కాకముందే, ఆధారాలు దొరక్క ముందే, టీడీపీ అనుకూల మీడియా జగన్ ని దోషిగా చిత్రీకరించింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక కూడా అడపాదడపా వీలు చూసుకుని అవాకులు, చెవాకులు పేలుతోంది.
ఇక ఇప్పుడు మీడియా కంటే, సోషల్ మీడియా చంద్రబాబుకి బాగా ఉపయోగపడుతోంది. మీడియాలో వార్త రావాలంటే కనీసం ఓ స్థాయి వ్యక్తులు మాట్లాడాలి. అదే సోషల్ మీడియాలో అయితే ఎవరో అనామకుడితో ఓ పోస్ట్ పెట్టించడం, ఊరూపేరూ లేని వ్యక్తితో తిట్టించడం, అసలు మనుషులే కనపడకుండా ఆడియోలు బైటకు వదలడం, వాటిని అధికారిక అకౌంట్ల ద్వారా షేర్ చేయడం, ఇదీ ప్రస్తుతం టీడీపీ టీమ్ చేస్తున్న పని.
వైసీపీ నాయకులపై చేసిన విమర్శలు రివర్స్ కావడం, ఇటీవల కొంతమంది టీడీపీ కార్యకర్తలపై కేసులు నమోదు కావడంతో… కాస్త వెనక్కు తగ్గింది టీడీపీ. తిరిగి ఇప్పుడు బీజేపీని టార్గెట్ చేసుకుంది. కన్నా లక్ష్మీనారాయణను రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించి వీర్రాజుని నియమించడంతో టీడీపీలో సహజంగానే ఉక్రోషం మొదలైంది. అందులోనూ వీర్రాజు సహా, జీవీఎల్, రామ్ మాధవ్, విష్ణువర్ధన్ రెడ్డి.. ఇలా కొంతమంది నేరుగా టీడీపీని టార్గెట్ చేశారు. జాతీయ స్థాయిలో చంద్రబాబు పాచికలు పారకుండా రాష్ట్ర స్థాయిలోనే అడ్డుకుంటున్నారు.
దీంతో విసిగిపోయిన బాబు.. వ్యక్తిగతంగా వీరిపై తప్పుడు పోస్టింగ్ లు పెట్టిస్తున్నారు. గతంలో మీడియాని వాడుకుని కాంగ్రెస్ నేతల్ని, తర్వాత వైసీపీ, ప్రజారాజ్యాన్ని ఎలా నీరుగార్చాలని చూశారో, ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా బీజేపీని టార్గెట్ చేశారు చంద్రబాబు. పచ్చపాత మీడియాకి కాస్తో కూస్తో బీజేపీ అంటే భయం ఉంది.
రాష్ట్ర నాయకుల్ని విమర్శించినా, దెబ్బ జాతీయ స్థాయిలో పడుతుంది. అందుకే టీడీపీ అనుకూల మీడియా అంత సాహసం చేయడానికి సిద్ధపడలేదు. దీంతో సోషల్ మీడియాకి కూడా యెల్లో కలర్ వేసేశారు చంద్రబాబు. యెల్లో పోస్టింగ్ లతో తన నైజాన్ని మరోసారి చాటుకుంటున్నారు.