బీజేపీ-జనసేన రెండూ మిత్రపక్షాలు. దాదాపుగా ఏ అంశంపై అయినా రెండు పార్టీల స్టాండ్ ఒకటే. ప్రమాదాలు జరిగినా, ప్రకృతి విపత్తులు జరిగినా, సహాయ కార్యక్రమాలలో, పరిహారం డిమాండ్ చేయడంలో.. రెండు పార్టీలు ఒకే మాటకు కట్టుబడి ఉన్నాయి. అలాంటిది చంద్రబాబు విషయానికొచ్చే సరికి ఎందుకో పవన్ కల్యాణ్ లో మొహమాటం ఇంకా తగ్గలేదు.
గతంలో కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో.. జనసేన-బీజేపీకి వైసీపీ ఒక్కటే టార్గెట్. వీర్రాజు ఎపిసోడ్ స్టార్ట్ అయ్యాక వైసీపీ కంటే ఎక్కువగా టీడీపీని టార్గెట్ చేస్తున్నారు నేతలు. రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తామన్నా, భవిష్యత్ లో అధికారంలోకి వస్తామని చెబుతున్నా.. ఇవన్నీ కేవలం బీజేపీ రంకెలే. జనసేన నుంచి అలాంటి వ్యాఖ్యానాలేవీ రాలేదు, పవన్ కల్యాణ్ కనీసం చంద్రబాబు పేరెత్తడానికి కూడా ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తోంది.
గతంలో బాబుతో ఉన్న స్నేహాన్ని ఇంకా మరచిపోలేకపోతున్నారో లేక, తన వీక్ పాయింట్స్ బాబు దగ్గర ఉన్నాయని భావిస్తున్నారో తెలియదు కానీ.. పవన్ మాత్రం చంద్రబాబు జోలికి వెళ్లడం లేదు. గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని కనీసం మాట మాత్రంగానైనా చెప్పడంలేదు. వరద బాధితుల్ని ఆదుకోండి అంటూ విడుదల చేసిన తాజా వీడియోలో ఎంతసేపు ప్రభుత్వానికి సుద్దులు చెప్పడమే పనిగా పెట్టుకున్న పవన్ కల్యాణ్… బాబును పల్లెత్తుమాట అనలేదు.
పోలవరం పూర్తయి ఉంటే ఇలాంటి కష్టం, నష్టం వచ్చేది కాదని చెబుతున్న పవన్, ఐదేళ్లు పోలవరాన్ని కోల్డ్ స్టోరేజ్ లో పెట్టి, దాన్ని పిక్నిక్ స్పాట్ గా మార్చేసిన చంద్రబాబుని ఒక్కమాట కూడా అనలేకపోయారు. ఎలాగూ పోలవరం ప్రస్తావన వచ్చింది కదా, గత ప్రభుత్వ తప్పిదాన్ని ఈ ప్రభుత్వం కొనసాగించకుండా పోలవరాన్ని పూర్తి చేయాలి అని కూడా చెప్పే సాహసం చేయలేదు. పోలవరం ప్రాజెక్ట్ ఇటీవలే ప్రారంభించినట్టు, దాన్ని వెంటనే వైసీపీ ప్రభుత్వం పూర్తి చేయాలన్నట్టు మాట్లాడారు.
అసలింతకీ టీడీపీ హయాంలో జరిగిన తప్పుల్ని పవన్ కల్యాణ్ ఎందుకు ప్రస్తావించలేకపోతున్నారు, గతంలో ఆ పార్టీతో అంటకాగిన పాపానికి అప్పుడు జరిగిన తప్పుల్లో తనకూ భాగం ఉందని ఆయన అనుకుంటున్నారా? లేక చంద్రబాబుతో ఇంకా లోపాయికారీ ఒప్పందాలు మిగిలే ఉన్నాయా? ప్రజలకు కాకపోయినా కనీసం జనసైనికులకైనా చెప్పాల్సిన బాధ్యత పవన్ పై ఉంది.