జ్వరం వస్తే ట్యాబ్లెట్ వేసుకోవడం చాలామందికి కష్టం, అస్సలు ఇష్టపడరు కూడా. అలాంటి భయస్తులు కూడా కరోనా టైమ్ లో ట్యాబ్లెట్లు టపటపా మింగేశారు. తప్పనిసరి పరిస్థితుల మధ్య పిప్పర్ మెంట్లలాగా పొట్టలోకి తోసేశారు. కరోనా కాలంలో విటమిన్ ట్యాబ్లెట్లకు ఎక్కడలేని గిరాకీ వచ్చింది.
కరోనా వచ్చిన తర్వాత మాత్రం పారాసెట్మాల్ ఒక్కటే దివ్యౌషధం అని తేలింది. ఆమధ్య ఏపీలో జగన్ వ్యాఖ్యలతో పారాసెట్మాల్, బ్లీచింగ్ పౌడర్ అనే మాటలు ఎంత పాపులర్ అయ్యాయో తెలిసిందే. అప్పుడు జగన్ మాటలకి నవ్వుకున్నవాళ్లంతా.. ఇప్పుడు పారాసెట్మాల్ ట్యాబ్లెట్ల సేల్స్ చూసి బిత్తరపోతున్నారు. ఆ మాటలన్నీ నిజమే కదా అని ముక్కున వేలేసుకుంటున్నారు.
డోలో అదరగొట్టింది..
పారాసెట్మాల్ అనేది మందు పేరు, అయితే ఆ మందు వివిధ రకాల బ్రాండ్ల పేరుతో బయట మార్కెట్లో అందుబాటులో ఉంది. క్రోసిన్, కాల్పాల్, డోలో.. ఇలా రకరకాల పేర్లున్నాయి. వీటిలో డోలో ట్యాబ్లెట్ల సేల్స్ అమాంతం పెరిగాయి. కరోనా కాలంలో రెండేళ్ల వ్యవధిలో డోలో ట్యాబ్లెట్లు బారత్ లో 350కోట్లు అమ్ముడయ్యాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
ప్రభుత్వం ఇచ్చే కరోనా మెడికల్ కిట్స్ లో కూడా డోలోకి చోటు ఉండటంతో దాని సేల్స్ భారీగా పెరిగాయి. ఒక్క ఏడాదిలోనే 70శాతం సేల్స్ పెరిగాయి. డోలోతో పాటు.. మిగతా పారాసెట్మాల్ టాబ్లెట్ల ఏడాది టర్నోవర్ లెక్క తీస్తే వెయ్యి కోట్ల రూపాయలకు చేరుకుంది. అంటే జ్వరం ట్యాబ్లెట్లు జనం ఎంతగా ఎగబడి కొంటున్నారో అర్థం చేసుకోవచ్చు.
రజినీకాంత్ మీమ్స్..
భారతీయులు డోలోని ఎంతగా ఆరాధిస్తున్నారంటే డోలోతో రజినీకాంత్ మీమ్స్ చూస్తే అర్థమవుతుంది. శివాజీ సినిమాలో రజినీకాంత్ బబుల్ గమ్ ని స్టైల్ గా నోట్లో వేసుకుంటారు. దాన్ని డోలోతో లింక్ చేస్తూ నెటిజన్లు మీమ్స్ తో అల్లాడిస్తున్నారు.
ఈ రెండేళ్లలో భారతీయులు వాడిన డోలో ట్యాబ్లెట్స్ ని ఒకదానిపై ఒకటి పెడితే అది ఎవరెస్ట్ శిఖరం కంటే ఎక్కువ ఎత్తు ఉంటుందని కూడా లెక్కతేల్చారు.
డోలోనే ఎందుకు..?
డోలో అనే పేరు పలకడానికి సులభంగా ఉంటుంది. దానికి తోడు మిగతా బ్రాండ్లు ప్రధానంగా 500 ఎంజిపై దృష్టిపెట్టిన సమయంలో డోలో నేరుగా 650 ఎంజిని తెరపైకి తెచ్చింది. తీవ్ర జ్వరం ఉన్నవారికి 650ఎంజిని సూచించేవారు వైద్యులు. పైగా కరోనా టైమ్ లో ఈ మోతాదు తప్పనిసరిగా మారింది. దీంతో డోలోకి పాపులార్టీ పెరిగింది.
నేరుగా మెడికల్ షాపుకి వెళ్లి డోలోనే అడిగి తీసుకుంటున్నారు జనం. ఒంట్లో కాస్త నలతగా ఉన్నా కూడా ముందు ఒక డోలో తగిలించేస్తున్నారు. ఇలా తగిలించి తగిలించి.. రెండేళ్లలో 350 కోట్ల మాత్రల్ని మింగేశారు.
నేపాల్ లో అధ్వాన్నం
కరోనా నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా పారాసెట్మాల్ ను ప్రజలు ఎక్కువగా వాడుతుంటే.. అటు నేపాల్ లో మాత్రం పరిస్థితి దీనికి పూర్తి భిన్నంగా ఉంది. అక్కడ కరోనా రోగులకు ఇవ్వడానికి పారాసెట్మాల్ మాత్రలు అందుబాటులో లేవు. నిల్వలు లేక కాదు, అంతా బ్లాక్ మార్కెట్ కు తరలిపోయింది.
ఒక్కో టాబ్లెట్ ను రెట్టింపు ధర పెట్టి అమ్ముతున్నారు. ఏకంగా రాజధానిలోనే చాలా షాపుల్లో పారాసెట్మాల్ మాత్రలు దొరకడం లేదు. అత్యవసరమైన పారాసెట్మాల్ తగినంతగా అందుబాటులో లేక దాదాపు 40శాతం మంది నేపాలీయులు ఇబ్బందులు పడుతున్నారు.