ఒకప్పుడు చంద్రబాబు ….ఇప్పుడు కేసీఆర్

జాతీయ రాజకీయాలు అనగానే ఒకప్పుడు తెలుగు వాళ్లకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి పేరే  గుర్తుకొచ్చేది. దేశ రాజకీయాలను ప్రభావితం చేసే జాతీయ పార్టీలు కూడా చంద్రబాబు స్మరణ చేసేవి. కానీ కాలక్రమంలో ఆ…

జాతీయ రాజకీయాలు అనగానే ఒకప్పుడు తెలుగు వాళ్లకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి పేరే  గుర్తుకొచ్చేది. దేశ రాజకీయాలను ప్రభావితం చేసే జాతీయ పార్టీలు కూడా చంద్రబాబు స్మరణ చేసేవి. కానీ కాలక్రమంలో ఆ చరిత్ర ముగిసిపోయింది. ఒకప్పుడు ఎన్టీఆర్ తరువాత జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన, వాటిని ప్రభావితం చేసిన నాయకుడు చంద్రబాబు.

కానీ రాష్ట్ర విభజన తరువాత జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు చక్రం ఆగిపోయింది. విభజన తరువాత అవశేష ఆంధ్రాకు తొలి ముఖ్యమంత్రి అయినప్పటికీ ఆ తరువాత వైసీపీ అధికారంలోకి రావడంతో బాబు రాజకీయ జీవితం మసకబారడం మొదలైంది.  తరువాత ఆయన తన రాజకీయ మనుగడ కోసం, రాజకీయ భవిష్యత్తు కోసం పోరాటం చేసే పరిస్థితి ఏర్పడింది. వైఎస్ జగన్ బాబును కోలుకోలేని దెబ్బ తీశారు.

రాష్ట్ర రాజకీయాల్లోనే దిక్కుమొక్కు లేకుండా ఉన్న బాబు ఇక జాతీయ రాజకీయాల ఊసు ఎత్తడంలేదు. తెలంగాణలో కేసీఆర్ ధాటికి ఆ రాష్ట్రంలో పార్టీని దాదాపు వదిలేసుకున్నారు. జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు అధ్యాయం ముగిసిపోగా సీఎం కేసీఆర్ అధ్యాయం మొదలైంది. ఎప్పుడో గతంలోనే జాతీయ రాజకీయాల్లోకి దూకుడుగా వెళ్లాలని ప్రయత్నించినా అడుగులు ముందుకు పడలేదు.

జాతీయ రాజకీయాల్లోకి ఆయన్ని ఎవరూ ఆహ్వానించకుండానే దేశ రాజకీయాల్లో మార్పు తేవడం కోసం కాంగ్రెసేతర, బీజేపీయేతర మూడో కూటమి పెడతానని చెప్పి పలు రాష్ట్రాల్లో తిరిగి బీజేపీ ప్రధానంగా మోడీ వ్యతిరేకులను కలుసుకున్నాడు. కానీ వివిధ కారణాలవల్ల వారి సహకారం లభించలేదు. దాంతో సైలెంట్ అయిపోయారు. కానీ ఇటీవలి పరిణామాలు చూస్తుంటే జాతీయ రాజకీయాల్లోకి అడుగు పెడతారేమో అనిపిస్తోంది.

ఈ మధ్యనే సీపీఎం, సీపీఐ జాతీయ అగ్ర నాయకులు కేసీఆర్ ను కలిసి వెళ్లారు. తాజాగా బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వి యాదవ్ కేసీఆర్ తో భేటీ అయ్యాడు. ఇద్దరూ సుదీర్ఘంగా చర్చలు జరిపారు. వీళ్ళు చర్చల్లో ఉండగానే కేసీఆర్ లాలూ ప్రసాద్ కు ఫోన్ చేసి మాట్లాడారు. ఆయన కేసీఆర్ ను జాతీయ రాజకీయాల్లోకి ఆహ్వానించాడట.

నేషనల్ పాలిటిక్స్ లో కీలక పాత్ర పోషించాలని కోరాడని వార్తలు వచ్చాయి. బీజేపీని గద్దె దింపడానికి కార్యాచరణ తయారు చేయాలని కేసీఆర్, తేజస్వి యాదవ్ నిర్ణయించుకున్నట్లు టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే కాంగ్రెస్ తో కలిసి వెళ్లాలని తేజస్వి యాదవ్ కేసీఆర్ తో చెప్పినట్లు వార్తలు వచ్చాయి. బీజేపీకి వ్యతిరేకంగా కేసీఆర్ పనిచేస్తే, లోకిక శక్తుల పునరేకీకరణకు కృషి చేస్తే ఆర్జేడీ మద్దతు ఇస్తుందని యాదవ్ అన్నాడు.

ఇక అంతకుముందు సీపీఎం అగ్ర నాయకులైన సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, కేరళ ముఖ్యమంత్రి పినారై విజయన్, సీపీఐ నాయకుడు డి. రాజా మొదలైనవారు కేసీఆర్ తో సమావేశమై జాతీయ రాజకీయాలపై చర్చించారు. టీఆర్ఎస్ తో పొత్తు గురించి మీడియా ఏచూరిని అడిగినప్పుడు పరిస్థితిని బట్టి నిర్ణయం ఉంటుందని అన్నారు. అయితే సీపీఎం తెలంగాణా కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాత్రం బీజేపీ పట్ల సీఎం కేసీఆర్ సూటిగా వ్యవహరించడం లేదన్నారు.

బీజేపీ పట్ల టీఆర్ఎస్ మెతక వైఖరితో ఉందన్నారు. అంటే సీపీఎం కేసీఆర్ ను నమ్మడం లేదనుకోవాలా ? ఇతర రాష్ట్రాల్లోని బీజేపీ వ్యతిరేక పార్టీలు కూడా కేసీఆర్ మీద నమ్మకం పెట్టుకోవడంలేదు. ఇదిలా ఉంటే అవసరమైతే కేసీఆర్ యూపీ వెళ్లి ఎన్నికల ప్రచారం చేస్తారని ఒక ఎమ్మెల్యే అన్నాడు.

కేసీఆర్ తో ప్రతిపక్షాల చర్చలు జరుగుతున్నప్పుడే యూపీలో మళ్ళీ బీజేపీ విజయం సాధిస్తుందని సర్వేలు చెబుతున్నట్లు వార్తలు వచ్చాయి. మరి వచ్చే పార్లమెంటు ఎన్నికల నాటికి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తారా? ఇది ఆయన తీసుకునే విధానాల మీద, ఇతర పార్టీల నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.