ఏపీలో సినిమా టికెట్ల ధరల సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో ఇండస్ట్రీ పెద్దలకు అర్థం కావడం లేదు. మొదటి నుంచి జగన్ ప్రభుత్వం పట్ల నిర్లక్ష్య, చిన్నచూపు ధోరణితో టాలీవుడ్ వ్యవహరిస్తోందనే విమర్శలున్నాయి. హీరోలు చిరంజీవి, నాగార్జున లాంటి ఒకరిద్దరు మినహా మిగిలిన వాళ్లంతా టీడీపీకి అనుకూలమనే ప్రచారం ఉంది.
తన ప్రభుత్వం విషయంలో టాలీవుడ్ చూపుతున్న వివక్షకు తగిన విధంగా బుద్ధి చెప్పాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎదురు చూస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఏపీ ప్రభుత్వానికి కూడా ఒక రోజంటూ వచ్చింది. దాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుంటోంది. సినిమా టికెట్ల ధరలపై నియంత్రణ, అలాగే నిబంధనల ప్రకారం సినిమాలు ప్రదర్శించడం తదితర అంశాలపై అంతా చట్ట ప్రకారం నడుచుకోవాలని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. దీంతో చిత్రపరిశ్రమ గిలగిలా కొట్టుకొంటోంది.
ఈ నేపథ్యంలో అఖండ విజయోత్సవ సభలో అగ్రహీరో, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఏపీలో సినిమా టికెట్ల వివాదాన్ని పరిష్కరించేందుకు పరిశ్రమలోని అందరూ కలిసికట్టుగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. టికెట్ ధరలపై పరిశ్రమ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ఆయన అన్నారు. సినిమా గోడును ఏపీలో పట్టించుకునే వారు ఎవరున్నారు? అని ఆయన ప్రశ్నించడం గమనార్హం.
చిత్ర పరిశ్రమలోని అందరూ ఏకం కావాలని బాలయ్య పిలుపు ఇవ్వడం వెనుక ఉద్దేశం…జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జట్టు కట్టాలనే అర్థం దాగి ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జగన్ ప్రభుత్వంతో సామరస్యంగా చర్చలు జరిపి, సమస్యను పరిష్కరించుకోడానికి బదులు కయ్యానికి దిగి, కొత్త సమస్యలు కొని తెచ్చుకునేందుకు చిత్ర పరిశ్రమ సిద్ధంగా ఉంటుందా? అనేది ఇప్పుడు ప్రధాన ప్రశ్న.
ఇంతకూ బాలయ్య మాటలకు ఆవేశ పడి జగన్‌కు వ్యతిరేకంగా గ్రూపు కట్టేందుకు ఎవరు నాయకత్వం వహిస్తారు? అనేది మరో ప్రశ్న. సమస్య వస్తే తప్ప, ఏపీ ప్రభుత్వం గురించి మామూలు రోజుల్లో గుర్తించకపోవడంతో చిత్ర పరిశ్రమ తగిన మూల్యం చెల్లించుకుంటోందనే చర్చ నడుస్తోంది.