చర్యకు ప్రతి చర్య వుంటుందని సైన్స్ చెబుతుంది. టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై తీవ్ర అభ్యంతరకర భాషలో మాట్లాడ్డంపై వైసీపీ భగ్గుమంది. పట్టాభి వ్యాఖ్యలకు నిరసనగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా టీడీపీ కార్యాలయాలపై వైసీపీ నేతలు, కార్యకర్తలు ప్రతీకార దాడులకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో ఏపీ వ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి.
ఏపీలో గంజాయి వ్యాపారానికి, వైసీపీ నేతలు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ముడిపెడుతూ టీడీపీ నేతలు, మాజీ మంత్రులు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శలు చేశారు. ఆధారాలు చూపాలంటూ కొందరు టీడీపీ నేతలకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇవాళ మంగళగిరిలో టీడీపీ కార్యాలయంలో పట్టాభి మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రిపై నోరు పారేసుకున్నారు. రాయలేని భాషలో జగన్‌పై తిట్ల పురాణాన్ని ప్రదర్శించారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను ఉద్దేశించి రేయ్, బోసిడీకే అంటూ యథేచ్ఛగా పట్టాభి తన నోటి దురుసు ప్రదర్శించారు. గతంలో కూడా ఇలాగే పట్టాభి సంస్కారం మరిచి ప్రత్యర్థులపై విమర్శలు చేశారు. దీనికి పర్యవసానంగా ప్రత్యర్థుల చేతిలో దెబ్బలు తినాల్సి వచ్చింది. అయినప్పటికీ తన వైఖరిని మార్చుకోకపోగా, మరింత రెచ్చపోతూ మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో అది కాస్తా హద్దుమీరడంతో ప్రత్యర్థులు ప్రతిచర్యకు దిగారు.
తమ అధినాయకుడు, ముఖ్యమంత్రిపై పట్టాభి దుర్భాషకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కార్యాలయాలు, ముఖ్య నాయకుల ఇళ్లపై వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడి తమ నిరసన వ్యక్తం చేశాయి. విజయవాడలో పట్టాభి ఇల్లు, మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయం, విశాఖలో టీడీపీ కార్యాలయం, చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలో రేణిగుంటలో టీడీపీ ఇన్‌చార్జ్ సుధీర్‌రెడ్డిపై వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయి.
ఇప్పటికే పట్టాభి నోటిని అదుపులో ఉంచేలా చర్యలు తీసుకుని, శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పేందుకు చంద్రబాబు ముందుకు రావాలి. అలాగే వైసీపీ నేతలు కూడా తమ నోటిని అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది.