వైఎస్సార్ జిల్లా బద్వేలు ఉప ఎన్నిక చడీచప్పుడు లేకుండా సాగుతోంది. ఈ ఎన్నికలో ఏ పార్టీ ఘన విజయం సాధిస్తుందో బహిరంగ రహస్యమే. తెలంగాణలోని హుజూరాబాద్ ఉప ఎన్నిక సమరంతో పోల్చితే అసలు బద్వేలులో ఎన్నిక ఉందా? అనే అనుమానం కలుగుతుంది. బద్వేలులో బరి నుంచి ప్రధాన ప్రతిపక్షం టీడీపీ తప్పుకోవడంతో మజా లేకుండా పోయింది.
జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌తో పాటు నామమాత్రంగా వివిధ పార్టీల నుంచి కొందరు పోటీదారులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్, బీజేపీ బలాలేంటో అందరికీ తెలిసిందే. కేవలం పోటీ ఉండాలంటే ఉండాలనే పట్టుదలతో ఆ రెండు పార్టీలు ఎన్నికల క్షేత్రంలో నిలిచాయి. కాంగ్రెస్‌తో పాటు బీజేపీని వైసీపీ ఏ మాత్రం పట్టించుకోలేదు.
కానీ బీజేపీ నాయకుడు, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి కేంద్రంగా వైసీపీ విమర్శలకు పదును పెట్టింది. పోరుమామిళ్లలో మంగళవారం నిర్వహించిన దళితుల ఆత్మీయ సమ్మేళనంలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి మాట్లాడుతూ ఆదినారాయ ణరెడ్డిపై విరుచుకుపడ్డారు.
మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డిని బద్వేలు ప్రజలు తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచి, మంత్రి పదవి కోసం పార్టీకి ద్రోహం చేసి వెళ్లాడని మండిపడ్డారు. దళితులకు నాగరికత లేదని మాట్లాడిన ఆదినారాయణరెడ్డికి వాళ్ల ఓట్లు అడిగే హక్కు లేదని అన్నారు. కడప ఎంపీ అవినాష్‌రెడ్డి కూడా మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డిపై విమర్శలు చేయడం గమనార్హం.