ఆమె నమ్మకం …సెంటిమెంట్ నాన్నే !

రాజకీయ రంగంలో, సినిమా రంగంలో నమ్మకాలు, సెంటిమెంట్లు ఎక్కువ. ఒక సెంటిమెంట్ వల్ల ప్రయోజనం కలిగిందంటే ఇక అందరూ దాన్నే ఫాలో అవుతుంటారు. దానివల్ల అనుకున్న ఫలితం వస్తుందా అంటే ఏమో చెప్పలేం. కొందరు…

రాజకీయ రంగంలో, సినిమా రంగంలో నమ్మకాలు, సెంటిమెంట్లు ఎక్కువ. ఒక సెంటిమెంట్ వల్ల ప్రయోజనం కలిగిందంటే ఇక అందరూ దాన్నే ఫాలో అవుతుంటారు. దానివల్ల అనుకున్న ఫలితం వస్తుందా అంటే ఏమో చెప్పలేం. కొందరు సెంటిమెంట్ ను నమ్ముకుంటూనే అనుకున్న పని కావడం కోసం వేరే వ్యూహాలు కూడా అనుసరిస్తుంటారు. 

ఇప్పుడు వైఎస్సార్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల కూడా ఈ పనే చేస్తోంది. ఆమె రేపటి నుంచి (20 వ తేదీ ) సుదీర్ఘ పాదయాత్రకు శ్రీకారం చుడుతోంది. 2004 లో నాన్న వైఎస్ రాజశేఖర రెడ్డికి, 2019 లో అన్న జగన్ కు అధికారం తెచ్చిపెట్టింది పాదయాత్రే. వారికి అధికారం రావడానికి ఉన్న అనేక కారణాల్లో పాదయాత్ర ఒకటి. అంతేగానీ వంద శాతం అదే కారణం కాదు. ఉమ్మడి రాష్ట్రం విడిపోయాక ఏర్పడిన ఏపీలో తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అధికారంలో రావడానికి పాదయాత్ర కూడా దోహదం చేసింది.

ఈ అధికారం లోకి రావడానికి పాదయాత్ర కారణమనే నమ్మకం రాజకీయ నాయకుల్లో బలంగా ఏర్పడడంతో షర్మిల కూడా దాన్నే నమ్ముకుంది. పాదయాత్ర వల్ల అధికారం దక్కుతుందనే సెంటిమెంట్ ఒకటైతే, వైఎస్సార్ అధికారంలో ఉండగా అమలు చేసిన సంక్షేమ పథకాలను తెలంగాణా ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేదనే నమ్మకం మరొకటి. 

షర్మిల ఈ సెంటిమెంటును, నమ్మకాన్ని మాత్రమే నమ్ముకుంది. ఇవి రెండూ ఉంటే చాలవని ఏపీలో అన్న జగన్ అధికారంలోకి రావడానికి కారకుడైన ప్రశాంత్ కిషోర్ ను కూడా నమ్ముకుంది. ఈ మధ్య కాలంలో తమిళనాడులో ఎంకే స్టాలిన్, పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ అధికారంలో రావడానికి కూడా ప్రశాంత్ కారకుడయ్యాడు. ఇలా ఇన్ని నమ్మకాల నడుమ షర్మిల పాదయాత్ర మొదలు పెట్టబోతోంది.

షర్మిల పార్టీలోకి నేతలు ఎవరూ వచ్చి చేరలేదు. ఇతర పార్టీల నుంచి వలసలు తనకు అవసరం లేదని..ప్రజల్లో నుంచే కొత్త నేతలు వస్తారంటూ షర్మిల ధీమా వ్యక్తం చేసింది. కొందరు పార్టీ నుంచి తప్పుకున్నారు. ఇక, ఉద్యోగ కల్పన పైనే ఇప్పటి వరకు షర్మిల రాజకీయ పోరాటం చేస్తూ వచ్చింది.  

తన అన్నతో విభేదించి తెలంగాణలో రాజకీయాలు చేస్తోంది. అవసరమైతే తెలంగాణ కోసం తన అన్నతో అయినా కోట్లాడుతానని చెప్పుకొచ్చింది. ప్రతీ మంగళవారం నిరుద్యోగ దీక్షలు చేస్తోంది. పాదయాత్రలో సైతం ఈ దీక్షలు కొనసాగుతాయని చెప్పింది.   

తెలంగాణ రాజకీయాలతో తనకు ఏం సంబంధం అనే ప్రశ్నకు సుదీర్ఘ కాలం షర్మిల సమాధానం ఇచ్చుకోవాల్సి వచ్చింది. తెలంగాణలో పార్టీ విస్తరణ..మద్దతు కోసం పూర్తిగా వైఎస్సార్ అభిమానుల మీదే షర్మిల ఆధారపడింది. ఇదే సమయంలో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీం మద్దతు తీసుకుంటోంది. ఆయన టీం వ్యూహాల మేరకే ఇప్పుడు పాదయాత్ర సాగుతుంది. షర్మిల  పాదయాత్ర రూట్ మ్యాప్ ఖరారైంది.

తెలుగు రాజకీయాల్లో తొలుత పాదయాత్ర చేసిన వైఎస్సార్ తరహాలోనే షర్మిల సైతం చేవెళ్ల నుంచే పాదయాత్ర ప్రారంభిస్తోంది. నాన్న సెంటిమెంట్ కాకుండా ప్రాంతం సెంటిమెంట్ కూడా ఫాలో అవుతోంది.  వైఎస్సార్ మండు ఎండాకాలంలో 1,475 కిలో మీటర్ల మేర పాదయాత్ర చేశారు.  ఇక, 2012 అక్టోబర్ 2న టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్రం విడిపోయాక మిగిలిన ఏపీలో  పాదయాత్ర ప్రారంభించారు. 2013 ఏప్రిల్ వరకు మొత్తంగా 2,808 కిలో మీటర్లు ఆయన పాదయాత్ర చేసారు. 

ఇక, తన అన్న జగన్ జైల్లో ఉన్న సమయంలో షర్మిల మొదటిసారిగా 2012 అక్టోబర్ 18న పాదయాత్ర  ప్రారంభించింది. ఇది 2013 ఆగస్టు 4వ తేదీ వరకు సాగింది. మొత్తం 14 జిల్లాల్లో 3 వేల కిలో మీటర్ల యాత్ర సాగింది. ఈ పాదయాత్ర జగన్ పార్టీని ఉనికిని కాపాడింది.  

ఇక, వైసీపీ అధినేతగా జగన్ తన సుదీర్ఘ పాదయాత్ర 341 రోజుల పాటు మొత్తంగా 3,648 కిలో మీటర్ల మేర సాగింది. దాదాపు రెండు కోట్ల మంది ప్రజలతో జగన్ మమేక మయ్యారు. ఈ యాత్ర సమయంలో పీకే టీం పూర్తిగా అనుసరించింది. 2019 ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించి సీఎం అయ్యారు. 

ఇక, ఇప్పుడు షర్మిల తన అన్న రికార్డును తిరగరాసి కొత్త చరిత్ర  సృష్టించడానికి రెండోసారి పాదయాత్ర చేస్తోంది.  14 నెలలు, 4 వేల కిలోమీటర్లు, 90 నియోజక వర్గాల్లో ఈ పాదయాత్ర జరుగుతుంది. ప్రతి రోజు 12 కిలోమీటర్లు పాదయాత్ర చేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. 

నాడు జగన్ పాదయాత్రలో ఏ రకంగా ప్రజలతో మమేక్ అయ్యారో..ఇప్పుడు షర్మిల సైతం యువత లక్ష్యంగా యాత్ర ప్రారంభిస్తోంది. ఈ తరం యువతకు నవతరం న్యాయకత్వం స్లోగన్‌తో షర్మిల పాదయాత్ర జరుగుతుంది. తెలంగాణలో కొత్త నాయకత్వానికి పార్టీలో అవకాశం ఇవ్వటంతో పాటుగా..ప్రజలు తనకు అవకాశం ఇచ్చేలా తన పాదయాత్ర ఉంటుందని షర్మిల చెబుతోంది.

మొదటి పాదయాత్ర చేసిన పదేళ్లకు షర్మిల రెండో పాదయాత్ర చేస్తోంది. ఆమె పాదయాత్రను తెలంగాణలోని మీడియా ఎలా కవర్ చేస్తుందనే ఆసక్తి జనాల్లో ఉంది. జగన్ పాదయాత్ర చేసినప్పుడు ఆయనకు సొంత మీడియా ఉంది. అది ఆయనకు ప్లస్ అయింది. కానీ షర్మిల పరిస్థితి అందుకు విరుద్ధం. 

అధికారంలో ఉన్నది కేసీఆర్ పార్టీ కాబట్టి మీడియా సహకారం ఎంతమేరకు ఉంటుందో చెప్పలేం. షర్మిల పార్టీ పెట్టినప్పటి నుంచి ఆమెకు మీడియా కవరేజ్ పెద్దగా లేదనే చెప్పుకోవాలి. తాను అధికారంలోకి రావాలనే ఆకాంక్షను ఈ పాదయాత్ర నెరవేరుస్తుందా? నాన్న సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా? చూడాలి.