ఆళ్లగడ్డ వైసీపీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రరెడ్డిపై ముస్లిం మైనార్టీలు ఆగ్రహంగా ఉన్నారు. తమ అభిప్రాయాలు, ఆకాంక్షలకు విరుద్ధంగా ఎమ్మెల్యే నడుచుకోవడంపై మైనార్టీలు మండిపడుతున్నారు. వైసీపీకి ముస్లిం మైనార్టీలు మొదటి నుంచి బలమైన ఓటు బ్యాంకు.
ఇవాళ వైసీపీ అధికారంలో ఉందంటే ముస్లిం పాత్ర అత్యంత క్రియాశీలకమనే సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ ముస్లిం ప్రజాప్రతినిధితో బలవంతంగా రాజీనామా చేయించడంపై ఆ సామాజిక వర్గం కోపంగా ఉన్నారు.
ఆళ్లగడ్డ మండలంలోని కోటకందుకూరు సర్పంచ్‌గా కొలి దాదాపీర్ ఎన్నికయ్యారు. ఇటీవల ఆయనతో ఎమ్మెల్యే రాజీనామా చేయించారు. ఇది వైసీపీలో వివాదాస్పద నిర్ణయమని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఎమ్మెల్యే బ్రిజేంద్ర వైఖరితో పార్టీకి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందనే ఆందోళన మొదలైంది.
తన ముఖ్య అనుచరుడిని సర్పంచ్ పీఠంపై కూచోపెట్టేందుకు ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా ఎమ్మెల్యే నడుచుకుంటున్నారనే విమర్శలున్నాయి. కోటకందుకూరు పంచాయతీ పరిధిలో 3200 ఓట్లున్నాయి. ఇందులో ముస్లిం ఓట్లు 1500 నుంచి1600, బలిజల ఓట్లు 800-1000 మధ్య వుంటాయి.
ఇదిలా వుండగా కొలి దాదాపీర్ ఎంపీటీసీగా కూడా ఎన్నిక కావడాన్ని సాకుగా తీసుకున్న ఎమ్మెల్యే సర్పంచ్ పదవికి బలవంతంగా రాజీనామా చేయించారని చెబుతున్నారు. తన మిత్రుడైన బలిజ సామాజిక వర్గానికి చెందిన శీను అనే వ్యక్తిని సర్పంచ్ చేసేందుకు దాదాపీర్‌ను మెడపెట్టి గెంటేశారనే భావనలో ముస్లింలు ఉన్నారు.
కోటకందుకూరులో తమ వాడి పట్ల ఎమ్మెల్యే అనుసరించిన వైఖరిపై ఆ నియోజకవర్గంలోని ముస్లింలంతా గుర్రుగా ఉన్నారని సమాచారం. కోటకందుకూరులో ఎలాగైనా వైసీపీ మద్దతుదారుని ఓడించాలనే పట్టుదలతో ప్రతిపక్షాలు ఉన్నాయి. కోటకందుకూరులో తమను అవమానించిన ఎమ్మెల్యేకి గట్టి బుద్ధి చెప్పాలని మైనార్టీలు ఉన్నారని తెలుస్తోంది. ఒకవేళ ఇక్కడ వైసీపీ మద్దతుదారుడు ఓడిపోతే మాత్రం ఎమ్మెల్యే కోరి సమస్యలను తెచ్చుకున్నట్టే.