పవన్ మాటలు వింటే రష్యా దాటుతాయి. చేతలు మాత్రం కనీసం అమరావతి కూడా దాటవు. రాజధాని రైతులకు మద్దతుగా విజయవాడలో బీజేపీతో కలసి లాంగ్‌మార్చ్ చేస్తానని ఢిల్లీ వేదికగా ప్రకటించాడు. ఇది నెలన్నర సంగతి మాట. ఫిబ్రవరి మొదటి వారంలో విజయవాడలో లాంగ్‌మార్చ్ నిర్వహించేందుకు డేట్ కూడా ప్రకటించారు. లాంగ్‌మార్చ్ డేట్ దగ్గర పడిన తర్వాత….తూచ్ తూచ్ అంటూ బీజేపీ-జనసేన నాయకులు ఓ పత్రిక ప్రకటనతో చేతులు దులుపుకున్నారు.
ఇదేందయ్యా స్వామి గొప్పగా ప్రకటించి తుస్సుమన్నారే అని మీడియా ప్రశ్నించగా…పోలీసులు అనుమతించలేదని, మరో రోజు చేస్తామని ప్రకటించారు. సర్లే అని…వాళ్లు చెప్పినట్టే, మరికొన్ని రోజులకు లాంగ్‌మార్చ్ విషయాన్ని మీడియా గుర్తు చేసింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పెద్ద నేతలంతా తలమునకలై ఉన్నారని, అవి ముగిసిన వెంటనే సత్తా చూపుతామని రెండు పార్టీల నేతలు ప్రకటించారు.
ఢిల్లీ ఎన్నికలు ముగిశాయి. అక్కడ తిరిగి కేజ్రీవాల్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. రాజధాని రైతులకు మద్దతుగా మాత్రం లాంగ్‌మార్చ్ కాదు కదా….స్మాల్ మార్చ్ కూడా సాగలేదు. ఈ లోపు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చాయి. నామినేషన్ల ఘట్టం ముమ్మరంగా సాగింది. కరోనా కారణంగా ఎన్నికల ప్రక్రియ తాత్కాలికంగా ఆగింది.
ఈ నేపథ్యంలో పవన్‌కల్యాణ్ మరోసారి మీడియా ముందుకొచ్చాడు. తనదైన మార్క్ మాటలతో హెచ్చరించాడు.
‘స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వం హింస, దౌర్జన్యాలకు పాల్పడుతోంది. ఆర్థిక ఉగ్రవాదంతోను, భౌతిక దాడులతోను, రౌడీయిజంతోను భయపెట్టాలంటే ఊరుకోం. ఖచ్చితంగా రోడ్ల మీదకు వచ్చి తిరగబడతాం’ అని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ హెచ్చరించాడు. రాజమహేంద్రవరంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ హెచ్చరికలు పంపాడు.
గతంలో పవన్‌కల్యాణ్ లాంటి వాళ్లెవడో ఉన్నారట. తాను లేస్తే మనిషిని కాదు అని పదేపదే హెచ్చరించేవాడట. కానీ సదరు వ్యక్తి లేవడం ఎప్పటికీ జరగలేదట. పవన్ హెచ్చరికలు పదేపదే అలాంటి వ్యక్తిని గుర్తు చేస్తున్నాయి. ఇప్పటి వరకు పవన్ చెప్పిన ఏ ఒక్క విషయమైనా పాటించాడా? ఆత్మశుద్ధి, చిత్తశుద్ధి లేని హెచ్చరికలు ఎందుకో పవనే ఆలోచించుకోవాల్సి ఉంది. ఎందుకంటే ఆచరణకు నోచుకోని హెచ్చరికల వల్ల అభాసుపాలు కావడం తప్ప మరే ప్రయోజనం ఉండదు.