వ్యవస్థల్ని తన గుప్పెట్లో పెట్టుకున్నంత కాలం చంద్రబాబు ఆడింది ఆట, పాడింది పాటలా సాగింది. ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్ వెంకటేశ్వరరావు సహా.. బాబు హయాంలో జరిగిన చాలా నియామకాలు, బదిలీలు రాజకీయ ప్రయోజనాల కోసం చేసినవే.
అప్పట్లో బాబు సూచనలతో.. పవన్ కల్యాణ్ ని కూడా పోలీస్ డిపార్ట్ మెంట్ బాగానే మోసేది. అడుగడుగునా జగన్ పాదయాత్రలకు అడ్డుపడుతూ.. పవన్ యాత్రల్ని సజావుగా చేసేందుకు ఈ సిస్టమ్ వారికి బాగానే సహకరించింది.
2019 ఎన్నికల నోటిఫికేషన్ వెలువడబోయే ముందు పోలీస్ డిపార్ట్ మెంట్లో జరిగిన బదిలీలు చంద్రబాబు కుట్రని మరోసారి బైటపెట్టాయి. అయితే వైసీపీ అధికారంలోకి రాగానే ఆయా నియామకాలన్నిటినీ సమీక్షించి చక్కదిద్దారు. దీంతో ఆటోమేటిక్ గా పోలీస్ వ్యవస్థ ఇప్పుడు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కి శత్రువులా కనిపిస్తోంది. తమకు వంతపాడకపోయే సరికి పోలీస్ వ్యవస్థపై ఎగిరెగిరి పడుతున్నారు బాబు, ఆయన దత్తపుత్రుడు.
రాష్ట్రంలో ఎక్కడ ఏ వ్యక్తిగత వివాదం జరిగినా దానిలోకి పార్టీని లాగడం, పార్టీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయంటూ గగ్గోలు పెట్టడం చంద్రబాబు దినచర్యగా పెట్టుకున్నారు.
ఓ సారి జడ్జి సోదరుడిని టార్గెట్ చేశారన్నారు, తప్పు వారిదేనని తెలిసేసరికి తోక ముడిచారు. మరోసారి పోలీసులే ఆటో డ్రైవర్ కుటుంబం ఆత్మహత్యకు కారణం అన్నారు. చివరికి టీడీపీకి చెందినవారే సదరు నిందితులకు బెయిల్ ఇప్పించేసరికి కంగుతిన్నారు.
ఒకటా రెండా.. ఇలాంటి ఉదాహరణలు చాలానే ఉన్నాయి. ఇక ఇప్పుడు బాబు రాగాన్ని పవన్ కల్యాణ్ అందుకున్నారు. అభివృద్ధి గురించి మాట్లాడలేక అరాచకం చేస్తున్నారంటూ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు పవన్.
జనసేన పార్టీని ఎవరూ లెక్కలోకి తీసుకోరు. ఒకవేళ తీసుకున్నా వారి వల్ల తమ గెలుపుపై ప్రభావం పడుతుందని ఊహించరు. అలాంటి సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన కార్యకర్తలపై దాడులు చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది. కానీ పవన్ కల్యాణ్ మాత్రం వైసీపీది అరాచకం, అధికార పక్షం దాడులంటూ రెచ్చిపోయారు.
తాజాగా శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన ఇంచార్జి ఇంటిపై దాడి జరిగిందని, అయితే పోలీసులు సదరు ఇంచార్జిపైనే కేసులు పెట్టారంటూ రంకెలేసారు పవన్. పోలీసులు వైసీపీ చేతిలో కీలుబొమ్మల్లా మారిపోయారని, వంత పాడుతున్నారని, జనసేనను టార్గెట్ చేశారంటూ పెద్ద పెద్ద డైలాగులే కొట్టారు. వ్యక్తిగత వ్యవహారాలన్నిటికీ పార్టీ రంగుల పులమాలనుకుంటున్నారు.
చూస్తుంటే.. చంద్రబాబు నీఛ రాజకీయాల్ని లోకేష్ కంటే పవన్ బాగా వంటబట్టించుకున్నట్టు కనిపిస్తున్నారు. చంద్రబాబు హయాంలో లాగానే.. వ్యవస్థలెప్పుడూ అధికార పక్షానికే వంతపాడతాయనే భ్రమలో పవన్ ఉన్నట్టున్నారు.