కరోనా యాక్టివ్ కేసుల నంబర్లు మళ్లీ పెరుగుతున్నాయి. గత కొన్నాళ్లుగా ప్రతి రోజూ క్రమం తప్పకుండా యాక్టివ్ కేసుల సంఖ్య దేశంలో తగ్గుతూ వచ్చింది. అయితే గత వారంలో యాక్టివ్ కేసుల నంబర్ పెరగడం గమనార్హం.
రోజువారీగా కోలుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉండి, కొత్త కేసులు నమోదు కావడం తగ్గింది ఇన్నాళ్లూ. అయితే ఇప్పుడు కోలుకుంటున్న వారి కన్నా కొత్త కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతూ ఉంది. అక్టోబర్, నవంబర్ రెండో వారం వరకూ యాక్టివ్ కేసుల సంఖ్య అనునిత్యం తగ్గింది. అయితే..గతవారంలో మళ్లీ యాక్టివ్ కేసుల సంఖ్య పెరగడం ఆందోళన రేపుతున్న అంశంగా నిలుస్తోంది.
అయితే ఇప్పుడు కేసుల పెరుగుదలకు ఉత్తరభారతదేశం వేదిక అవుతూ ఉంది. ఢిల్లీతో సహా ఉత్తరభారతదేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ ఉంది. ఢిల్లీలో అయితే పరిస్థితి చాలా దారుణంగా ఉందనే మాట వినిపిస్తూ ఉంది. విపరీతంగా పెరిగిపోయిన కాలుష్యంతో అక్కడ కరోనా వ్యాప్తి మరింతగా సాగుతోందని విశ్లేషకులు అంటున్నారు.
చలితో గాలి వేగం మందగించడం, ఆ పై పంటల కాల్చివేతతో తీవ్రమైన కాలుష్యం.. ఆ పై పండగలు, వేడుకలతో ప్రజలు గుంపులు గుంపులుగా ఏర్పడటం.. ఈ పరిణామాల్లో కరోనా వ్యాప్తి పెరుగుతూ ఉందని అంటున్నారు. ప్రజలు జాగ్రత్త చర్యలు తీసుకోవడం కూడా దాదాపు లేకుండా పోయిందని, దీంతోనే కరోనా మళ్లీ విజృంభిస్తూ ఉందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.
దేశ వ్యాప్తంగా రోజువారీగా ప్రస్తుతం 40 వేలకు పై స్థాయిలోనే కరోనా కేసులు నమోదవుతున్నాయి. దక్షిణ భారతదేశంలో మాత్రం కరోనా నంబర్లలో తగ్గుదల కొనసాగుతూ ఉంది. కరోనా బాగా విజృంభించిన తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ లలో యాక్టివ్ కేసుల్లో తగ్గుదల కొనసాగుతూ ఉంది.
ప్రస్తుతం దక్షిణాదిన తమిళనాడు, ఏపీల్లో 20 వేల లోపు స్థాయిలో యాక్టివ్ కేసులు ఉండగా.. కేరళలో అత్యధిక యాక్టివ్ కేసులున్నాయి. అక్కడ 60 వేలకు పైగా యాక్టివ్ కేసులు ఆందోళన రేపుతున్నాయి. కర్ణాటకలో 25 వేల స్థాయిలో ఉన్న యాక్టివ్ కేసుల సంఖ్యలో కూడా పెరుగుదల కనిపిస్తూ ఉండటం ఆందోళనకరం.