గాజువాకలో పోటీ చేశారు, చిత్తుగా ఓడిపోయారు. భీమవరంలోనూ పోటీ చేశారు, అక్కడ కూడా చిత్తుగా ఓడిపోయారు. ఈసారి పవన్ కన్ను పిఠాపురంపై పడింది. కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న పిఠాపురం నియోజకవర్గం నుంచి ఈసారి పోటీ చేయాలని భావిస్తున్నారట పవన్ కల్యాణ్. నిజంగా ఇది మంచి ఆప్షనే.
గతంలో ప్రజారాజ్యం ఇక్కడ గెలిచింది. 2009లో వంగా గీత ప్రజారాజ్యం తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014లో గెలిచిన వర్మకు అప్పట్లో పవన్ పరోక్ష మద్దతు బాగా పనిచేసింది. ఇక 2019లో జనసేన ఇక్కడ ఓడిపోయినా తనకంటూ 15శాతం ఓట్ షేర్ సాధించగలిగింది. అందుకే ఈసారి పవన్ పిఠాపురంపై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది.
పిఠాపురంలో టీడీపీ, జనసేన ఓట్ షేర్ కలిపితే.. వైసీపీకి నష్టం. అందులోనూ ఈసారి పవన్ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చబోనంటున్నారు. అంటే ఇక్కడ టీడీపీ, జనసేన, అదనంగా బీజేపీ కూడా కలవబోతున్నాయి. సో.. కచ్చితంగా తనకు విజయావకాశాలుంటాయని అనుకుంటున్నారట పవన్ కల్యాణ్. ఆయన నిజంగా ఈ నియోజకవర్గంపై కన్నేస్తే మిగతా వాళ్లంతా ఇక ఆశలు వదులుకోవాల్సిందే.
తిరుపతి సంగతేంటి పవన్..?
పవన్ కల్యాణ్ కి తిరుపతిపై ఎప్పటినుంచో గురి ఉంది. చిరంజీవిని సొంత జిల్లా కాదు పొమ్మన్నా.. అప్పట్లో తిరుపతి ఆదుకుంది, ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపించింది. అక్కడ కాపు సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ. ఆ లెక్కలతోనే పవన్ తిరుపతిపై ఫోకస్ పెట్టారు.
గతంలో తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో కూడా జనసేన అభ్యర్థిని బరిలో దింపాలని పవన్ ఉబలాటపడింది అందుకే. కాలం కలిసొచ్చి అక్కడ జనసేన-బీజేపీ ఉమ్మడి అభ్యర్థి గెలిస్తే.. 2024లో తిరుపతికే ఫిక్స్ అవ్వాలని అనుకున్నారు. కానీ అది సాధ్యం కాలేదు.
గాజువాకను మరచిపోయినట్టేనా..?
ఉత్తరాంధ్ర వెనకబాటుతనం గురించి పదే పదే మాట్లాడే పవన్ కల్యాణ్, గాజువాకను వదిలిపెట్టే ప్రసక్తే లేదని కూడా ప్రచారం జరిగింది. భీమవరంని పక్కనపెట్టినా, గాజువాకను పవన్ ఫిక్స్ చేసుకుంటారని అనుకున్నారు.
ఆమధ్య స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గళం విప్పితే.. స్థానిక ఓట్ల కోసం గేమ్ ప్లాన్ అనుకున్నారు. కానీ పవన్ ఎప్పుడూ నాలుగైదు ఆప్షన్లు పెట్టుకుంటారని పాపం వారికి తెలిసినట్టు లేదు. అందులో ఒకటి గాజువాక.. అంతే.
ఉగాది తర్వాత తేలిపోతుందా..?
ప్రస్తుతం నియోజకవర్గాలకు ఇన్ చార్జిలను నియమించే పనిలో ఉన్నారు జనసేనాని పవన్ కల్యాణ్. పొత్తుల్లో ఖాయంగా తమకే వస్తాయనుకుంటున్న సీట్లలో నమ్మకస్తులను ఇన్ చార్జిలుగా పెడుతున్నారు. సైలెంట్ గా పనిచేసుకోండని చెబుతున్నారు. మరి తాను మోజు పడుతున్న పిఠాపురంకు ఎవర్ని ఇన్ చార్జిగా నియమిస్తారనేది సస్పెన్స్ గా మారింది.
ఎవర్ని నియమించినా, ఆ నియోజకవర్గంపై ఆశలు పెట్టుకోవద్దని మాత్రం చెప్పేస్తారట. పవన్ పేరుతో ప్రచారం జరిగేలా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటారట. జనసేనలో ప్రస్తుతం నడుస్తున్న ఇంటర్నల్ టాక్ ఇదే.