బాస్ ఈజ్ ఆల్వేజ్ రైట్ అన్నది నానుడి. బాస్ పడుకున్నా కూడా ఆలోచిస్తున్నాడు అనుకోవాలి కానీ, బద్దకిష్టి అనుకోకూడదు. బాస్ లేట్ గా వచ్చినా, బిజీ వల్ల అని అనుకోవాలి కానీ ఇన్ డిసిప్లిన్డ్ అని అనుకోకూడదు. జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ కూడా బాస్ నే. ఆయన జనసేనకు బాస్. అందుకే ఆయన చర్యలను కానీ, ఆయన నిర్ణయాలను కానీ, ప్రశ్నించవద్దని కుండబద్దలు కొట్టినట్లు చెబుతున్నారు సోదరుడు నాగబాబు. 'పవన్ ను నిలదీయకండి. ప్రశ్నించకండి. ఆయన చర్యలు ఇప్పుడు అంతుపట్టకపోవచ్చు. అవన్నీ పార్టీ కళ్యాణం కోసమే' అన్న టైపులో నాగబాబు ప్రవచించారు.
పవన్ కళ్యాణ్ ను ఇలా చేయండి, అలా చేయండి అని ఎవ్వరూ చెప్పక్కరలేదు. పవన్ చర్యలు అన్నీ భవిష్యత్ లో పార్టీకి పనికి వచ్చేవే అని నాగబాబు అన్నారు. అసలు నాగబాబు ఇలా ఎందుకు అనాల్సి వచ్చినట్లు? కాకినాడ రూరల్ నుంచి పోటీచేసి ఓడిపోయిన పంతం నానాజీ జనసేన మీటింగ్ లో పవన్ ను ఉద్దేశించి కొన్ని సూచనలు చేయడమా? లేక సోషల్ మీడియాలో జనసేన జనాలు నాదెండ్ల మనోహర్-పవన్ జోడీ వ్యవహారంపై కామెంట్లు చేయడమా?
అయినా ఈపాటి సజెషన్లకే ఇలా ఫీలయిపోయి నాగబాబు అలా మాట్లాడడం సరికాదేమో? ఇక పార్టీ సమావేశాల్లో ఎవ్వరూ పెదవి విప్పరు. పవన్ ప్రవచనాలు విని, ఆనంద బాష్పాలు రాల్చి ఇంటికి వెళ్లడమే. కానీ ఇది పార్టీని బలోపేత మాత్రం చేయదు.
గాజువాక గుర్తే లేదు
ఎన్నికలు జరిగిపోయి ఇన్నాళ్లు అయింది. ఓడిపోతే ఓడిపోయారు. భీమవరం, గాజువాక వెళ్లి తనకు ఓట్లు వేసిన వారికి అయినా కృతజ్ఞతలు చెప్పడం పవన్ బాధ్యత. కానీ ఇప్పటిదాకా అలాంటి పని చేయలేదు. ఇప్పుడు భీమవరం మాత్రం రెండు రోజులు పర్యటిస్తా అంటున్నారు. గాజువాక సంగతి మాత్రం చెప్పడంలేదు. ఎన్నికల ముందు అక్కడ ఇల్లు తీసుకుని, ఇక్కడేవుంటా అంటూ చెప్పినట్లు జనాలకు గుర్తుంది. అక్కడ వుండడం అన్నది పవన్ కు సాధ్యంకాదని అందరికీ తెలుసు.
కానీ తన తరపున ఓ ప్రతినిధిని వుంచడం, గాజువాక వెళ్లి, ఎవరైతే తనకు ఓట్లువేసారో వాళ్లకు థాంక్స్ చెప్పడం పవన్ విధి. కానీ దాన్ని కూడా ఆయన విస్మరించారు. పవన్ చేయరు. ఇలా చేయండి అని ఎవ్వరూ చెప్పకూడదు. అలాచెబితే నాగబాబు లాంటి వాళ్ల క్లాస్ పీకుతారు. ఇక జనసేన పార్టీ ముందుకు సాగుతుందని, ఆశించేదెలా?