హీరో బెల్లంకొండకు పెద్ద అండ హిందీ డబ్బింగ్, డిజిటల్ మార్కెట్. అక్కడ నుంచి ప్రతి సినిమాకు పది పన్నెండు కోట్లు ఆదాయం నిర్మాతకు వస్తుంది. అందుకే చాలామంది నిర్మాతలు బెల్లంకొండతో సినిమా నిర్మాణానికి దిగిన సందర్భాలు కూడా వున్నాయి. అయితే ఇప్పుడు ఆ మార్కెట్ కే తూట్లు పడుతున్నట్లు గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి.
ఆ మధ్య బెల్లంకొండ నటించిన సీత సినిమా నుంచే ఈ సమస్య ఎదురయినట్లు తెలుస్తోంది. ఆ సినిమా విడుదల టైమ్ లోనే హిందీ డబ్బింగ్, శాటిలైట్ కొన్న బయ్యర్ చివరి నిమిషంలో కోటి నుంచి రెండు కోట్ల వరకు తక్కువ కట్టినట్లు తెలుస్తోంది. అంతేకాదు, సీత సినిమాలో ఆరు ఫైట్లు వుంటాయని చెప్పారని, కానీ రెండు ఫైట్లే వున్నాయని, పంచాయతీ పెడుతున్నట్లు, వ్యవహారం ఏదో నడుస్తున్నట్లు తెలుస్తోంది.
ఇలాంటి నేపథ్యంలో లేటెస్ట్ సినిమా రాక్షసుడు విషయంలో కూడా సమస్య వచ్చినట్లు తెలుస్తోంది. ఆ సినిమాను 12 కోట్లకు హిందీ హక్కులు కొనడానికి ఓకె అనిపించుకుని, రెండు కోట్లు అడ్వాన్స్ ఇచ్చిన బయ్యర్, ఇప్పుడు ఆరుకోట్లు మాత్రమే కడతానని, అంతకన్నా ఎక్కువకు తనకు వద్దని, కాదంటే తన అడ్వాన్స్ వెనక్కు ఇచ్చేయమని పట్టుపడుతున్నట్లు ఇండస్ట్రీలో గ్యాసిప్ వినిపిస్తోంది.
యాక్షన్ సీన్లు భయంకరంగా వున్న సినిమాలకు, యాక్షన్ హీరోలకు హిందీ మార్కెట్ బాగుంటుంది. కానీ సరైన హిట్ లు దొరక్క, డిఫెరెంట్ సబ్జెక్ట్ లు ట్రయ్ చేయడంతో బెల్లంకొండ హిందీ మార్కెట్ దెబ్బతింటున్నట్లుంది.