కులాలు కలిపే రాజకీయం అన్నది పవన్ తరచూ చెప్పే ఓ మాట. నిజానికి దీనివెనుక ఆయన స్ట్రాటజీ పెద్దదే వుంది. కేవలం కాపులు మాత్రమే పార్టీని నడిపి, అధికారం సాధించలేరు అని పవన్ కు తెలుసు. ప్రజారాజ్యంతో ఆయనకు ఆ మాత్రం క్లారిటీ వచ్చింది. జగన్ ను వీడి రెడ్లు రారు అని కూడా తెలుసు. అన్నింటికి మించి తనకు తానుగా పెట్టుకున్న తెలుగుదేశం బంధాల గురించి కూడా పవన్ కు తెలుసు. అందుకే కమ్మ-కాపులను ఏకం చేసి, అధికారం సాధించాలన్నది పవన్ ఫార్ములా. దానికే ఆయన ముద్దుగా కులాలు కలిపే రాజకీయం అనే పేరు పెట్టుకున్నారు.
కానీ ఇప్పుడు అదే వికటిస్తోంది. పార్టీలోని కాపు నాయకులు, పవన్ కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాదెండ్ల మనోహర్ కు ఇస్తున్న ప్రయారిటీని చూసి బుస్సుమంటున్నట్లు బోగట్టా. కమ్మ-కాపు కులాల మధ్య వున్న అభిప్రాయ బేధాలు ఈనాటివి కాదు, కృష్ణ, గుంటూరు, ఈస్ట్, వెస్ట్ ల్లో అవి బలంగా ఎప్పటి నుంచో వున్నాయి. ముఖ్యంగా కృష్ణ, ఈస్ట్ గోదావరి జిల్లాల్లో ఎక్కువ.
ఇలాంటి నేపథ్యంలో పవన్ ఇలా చేయడం ఇది తమ పార్టీ అని అనుకుంటున్న కాపు నాయకులకు సరిపడడం లేదు. పైగా ఎన్నికల తరువాత నుంచి జనసేనలో కాపు వర్గానికి చెందిన కీలకనేతలు కనిపించడం లేదు. తోట చంద్రవేఖర్, జేడి లక్ష్మీనారాయణ లాంటి వాళ్లు సైలంట్ అయిపోయారు.
కేవలం నాదేండ్ల మనోహర్ మాత్రమే ఎక్కువగా కనిపిస్తున్నారు. దీంతో పవన్ ఆయనకే ప్రయారిటీ ఇస్తున్నట్లు ప్రొజెక్ట్ అవుతోంది. అధికారం సాధించడం కోసం పవన్ అనుకున్న ఫార్ములా, అధికారం లేనపుడే వికటిస్తే, అధికార సాధనకు ఏ మేరకు ఉపకరిస్తుంది అన్నది చూడాలి.