కేఏ పాల్‌ను త‌ల‌ద‌న్నే నేత

ఏపీ రాజ‌కీయాల్లో నారా లోకేశ్‌కు ప్ర‌త్యేక స్థానం. ఇంకా చెప్పాలంటే ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయ చిత్ర రంగంలో లోకేశ్‌ది విల‌క్ష‌ణ పాత్ర‌. లాక్‌డౌన్ స‌మ‌యంలో ఆయ‌న శారీర‌క బ‌రువు త‌గ్గి అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. అంతేకాదండోయ్‌…తెలుగుపై మ‌రింత…

ఏపీ రాజ‌కీయాల్లో నారా లోకేశ్‌కు ప్ర‌త్యేక స్థానం. ఇంకా చెప్పాలంటే ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయ చిత్ర రంగంలో లోకేశ్‌ది విల‌క్ష‌ణ పాత్ర‌. లాక్‌డౌన్ స‌మ‌యంలో ఆయ‌న శారీర‌క బ‌రువు త‌గ్గి అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. అంతేకాదండోయ్‌…తెలుగుపై మ‌రింత ప‌ట్టు సాధించారు. ఇప్పుడు త‌క్కువ త‌ప్పుల‌తో అన‌ర్ఘ‌ళంగా మాట్లాడ‌గ‌లుగుతున్నారు.

రాజ‌కీయాలు సీరియ‌స్‌గా న‌డిచే స‌మ‌యంలో లోకేశ్ త‌ప్పులోనో, ప‌ప్పులోనో కాలో, చేయో వేస్తూ త‌న ఉనికిని కాపాడు కోవ‌డం తో పాటు రాష్ట్ర ప్ర‌జ‌ల‌కి వినోదాన్ని పంచేవారు. గ‌త ఏడాది సార్వ‌త్రిక ఎన్నిక‌ల సంద‌ర్భంగా ప్ర‌జాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రాజ‌కీయ రంగ ప్ర‌వేశం చేసి హ‌ల్‌చ‌ల్ సృష్టించారు. కేఏ పాల్ ఎదుట రాజ‌బాబు, ప‌ద్మ‌నాభం, ర‌మ‌ణారెడ్డి, రేలంగి, బ్ర‌హ్మానందం, బాబుమోహ‌న్ త‌దిత‌ర హాస్య న‌టులు బ‌లాదూర్ అని అప్ప‌ట్లో పెద్ద ఎత్తున చ‌ర్చించుకునే వాళ్లు.  

చివ‌రికి త‌న పార్టీ బీ ఫారాల‌ను కూడా త‌న‌కు తెలియ‌కుండా ఇత‌ర పార్టీ నేత‌లు ఇచ్చార‌ని పాల్ ఆరోపించారు. ఈ విష‌య‌మై ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేసి…ఎన్నిక‌ల‌ను వాయిదా వేయాల‌ని ఆయ‌న డిమాండ్ చేసిన విష‌యం తెలిసిందే. దీన్నిబ‌ట్టి కేఏ పాల్ ఏ స్థాయిలో కామెడీ పండించారో అర్థం చేసుకోవ‌చ్చు. లోకేశ్ స్థానాన్ని కేఏ పాల్ భ‌ర్తీ చేశారు. అయితే ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల అదృష్టం ఏమంటే సీరియ‌స్ రాజ‌కీయాల‌తో బుర్ర వేడెక్కిన స‌మ‌యంలో లోకేశ్‌, కేఏ పాల్ ఎంట‌రై కామెడీ పండిస్తూ జ‌నాల్ని కూల్ చేసేవాళ్లు.

లోకేశ్ స్థానాన్ని కేఏ పాల్ భ‌ర్తీ చేస్తే…తాజాగా పాల్ స్థానాన్ని మ‌రొక నేత కొల్ల‌గొట్టారు. ఆయ‌నే ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌. గురు, శుక్ర‌వారాల్లో జ‌న‌సేన పార్టీ త‌మ అధినేత ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఇంట‌ర్వ్యూ వీడియోల‌ను విడుద‌ల చేసింది. ఈ వీడియోల్లో ప‌వ‌న్ చెప్పిన అంశాల్లో కొత్త‌ద‌నం లేక‌పోగా….త‌న అజ్ఞానాన్ని ప్ర‌ద‌ర్శించిన‌ట్టుగా ఉంది. ఇంకా చెప్పాలంటే ఓ క‌మెడియ‌న్ పాత్ర పోషించిన‌ట్టుంది.

ముఖ్యంగా కాపు రిజ‌ర్వేష‌న్ల అంశంపై ప‌వ‌న్ చెప్పిన తీరు జ‌న‌సైనికుల‌కే న‌వ్వు తెప్పించేలా ఉందంటే…ఇక ఆయ‌న ప్ర‌త్య‌ర్థుల‌కు ఎలా ఉంటుందో అర్థం చేసుకోవ‌చ్చు.

“కాపు రిజర్వేషన్ల‌కు సంబంధించి.. మేము ఇవ్వమని జగన్ గతంలోనే స్పష్టంగా చెప్పారు. అయినా ప్రజలు గెలిపించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్ రెడ్డి, ఇతర మంత్రులు కూడా ప్రజలకు మరోసారి చెబితే రిజర్వేషన్లపై స్పష్టత వస్తుంది” అని ప‌వ‌న్ పేర్కొన్నారు.

నిన్న ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో మాత్రం రాజ‌ధాని మార్పు విష‌య‌మై జ‌గ‌న్ ఎన్నిక‌ల ముందు చెప్ప‌లేద‌ని విమ‌ర్శించారు. ఇప్పుడు కాపు రిజ‌ర్వేష‌న్లపై మ‌ళ్లీ ఒక‌సారి చెప్పాల‌ని డిమాండ్ చేస్తున్నారు. ఇది ఏం రాజ‌కీయ‌మో? అస‌లు ప‌వ‌న్ తానేం చెప్ప‌ద‌ల‌చుకుంటున్నారో ఆయ‌న‌కే స్ప‌ష్ట‌త లేదు. కాపు రిజ‌ర్వేష‌న్ చ‌ట్రంలో జ‌గ‌న్‌ను ఇరికించి రాజ‌కీయ ప‌బ్బం గ‌డుపుకోవాల‌ని ప‌వ‌న్ ఆలోచిస్తున్న‌ట్టున్నారు. ప‌వ‌న్ మాట‌లు మ‌రీ చిలిపిగా ఉన్నాయి. అందుకే కేఏ పాల్‌ను ప‌వ‌న్ మించిపోయారంటే అతిశ‌యోక్తి కాదేమో!

గుమ్మడికాయల దొంగ అంటే, భుజాలు తడుముకుంటున్నారు