లెక్క ప్రకారం 2024లో జరగాల్సిన సార్వత్రిక ఎన్నికలు అంతకన్నా ముందే వస్తాయని ప్రకటించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్! తన పార్టీ కార్యకర్తల సమావేశంలో పవన్ కల్యాణ్ ఈ ప్రకటన చేశారు! అదెప్పుడో ఆయన కూడా చెప్పలేదు కానీ.. ముందస్తుగా అయితే ఎన్నికలు ఖాయమట. ఆ ఎన్నికలకు జనసైనికులు రెడీ కావాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు!
మరి ముందుగానే ఎన్నికలు అని పవన్ కల్యాణ్ కు ఎవరు చెప్పారో, ఎప్పుడు చెప్పారో కానీ.. ఇలాంటి స్పైసీ కబుర్లు మాత్రం చంద్రబాబు తర్వాత చెప్పగలిగేది పవన్ కల్యాణ్ మాత్రమే కాబోలు. ఒకవైపు చంద్రబాబు కూడా ముందస్తు ఎన్నికలు అంటూ తరచూ చెబుతున్నారు.
2022లోనే ఎన్నికలంటూ చంద్రబాబు సంవత్సరం నంబర్ కూడా చెబుతుంటారు. తన గురువు చంద్రబాబు మాటనే పవన్ కల్యాణ్ కూడా చెప్పినా.. 2022 అంటూ మాత్రం చెప్పలేదు. 2024 కన్నా ముందే ఎన్నికలు జరగుఉతాయని మాత్రం పవన్ చెప్పారు!
ఒకవైపు వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు వాటి వాటి షెడ్యూళ్ల ప్రకారం జరిగిపోతూ ఉన్నాయి. బిహార్ ఎన్నికలు అయిపోయాయి. రేపోమాపో తమిళనాడు, పశ్చిమబెంగాల్ ల అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. అన్ని ఎన్నికలూ వాటి షెడ్యూల్ ప్రకారం జరిగిపోతూ ఉంటే.. బీజేపీ వాళ్లు గతంలో ప్రతిపాదించిన ఒకేదేశం ఒకే ఎన్నికలకు అవకాశాలు తగ్గిపోతున్నట్టే!.
ఇటీవలే జరిగిన బిహార్ కు 2022లో మరోసారి ఎన్నికలు నిర్వహిస్తారా? లేక బెంగాల్ లో మమత ప్రభుత్వ గడువును పొడిగించి ఒకసారి 2022 లో అన్ని ఎన్నికలతో పాటు నిర్వహిస్తారా? ఇలాంటివి రెండూ సాధ్యం కాదని స్పష్టం అవుతోంది. అన్నింటికీ మించి అలాంటి ఎన్నికలకు వెళ్లే ధైర్యం బీజేపీకే కనిపించడం లేదు!
అయితే ఏపీలో మాత్రం చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు ఎన్నికలు ఎన్నికలంటూ కలవరిస్తూ ఉన్నారు. అవిగో.. ఇవిగో.. అంటూ తమ పార్టీ కార్యకర్తలను ఫూల్స్ చేస్తున్నారు. బహుశా ఎన్నికలు ముందుగానే వస్తాయని చెబితే తప్ప తమ అభిమానగణాల్లో ఉత్సాహం రాదని వీరి ఆలోచన కాబోలు.
అయినా ఎన్నికల్లో అంత సత్తా చాటాలని ఉబలాటమే ఉంటే.. తిరుపతి లోక్ సభ సీటుకు ఉప ఎన్నిక వస్తోంది, స్థానిక ఎన్నికలు కూడా మరి కొన్ని నెలల్లో అయినా జరిగే అవకాశాలున్నాయి. వాటిల్లో ఎందుకు సత్తా చూపకూడదు? అసెంబ్లీకి, లోక్ సభకు ఎన్నికలొస్తేనే.. ఉత్సాహమొస్తుందా! అయినా అవి జరిగి ఏడాదిన్నరే కదా అయ్యింది.. వాటిల్లో వచ్చిన ఫలితాలను అప్పుడే మరిచిపోయారా పవన్ కల్యాణ్ గారూ!