చేసిన స్కామ్ కు మించిన ఫైన్ పడింది జయలలిత, శశికళలకు. వారిపై నమోదైన స్కామ్ కు సంబంధించిన అభియోగాలతో పోలిస్తే.. వారికి పడిన ఫైన్ ఎక్కువే! వారు చేశారని కోర్టులో రుజువైన మొత్తం స్కామ్ మొత్తానికి రెండు మూడు రెట్లు ఎక్కువ మొత్తాన్ని ఫైన్ గా విధించారు.
ఆ ఫైన్ లో అధిక భాగం జయలలితకే పడింది. ఆమె మరణించడంతో ఫైన్ చెల్లింపు చర్చే లేదు. అయితే జయలలిత సన్నిహితురాలు శశికళ మాత్రం జైలు శిక్షను అనుభవిస్తున్నారు. ఇప్పుడు ఫైన్ కూడా చెల్లించేశారట ఆమె. శశికళకు పది కోట్ల రూపాయల ఫైన్ విధించింది న్యాయస్థానం.
త్వరలోనే శిక్ష కాలం పూర్తవుతున్న నేపథ్యంలో ఆమె ఫైన్ చెల్లిస్తే విడుదల అవుతారని వార్తలు వచ్చాయి. వాటికి అనుగుణంగా శశికళ ఫైన్ చెల్లించినట్టుగా తెలుస్తోంది. పది కోట్లా పది లక్షల రూపాయల మొత్తాన్ని డీడీ రూపంలో చెల్లించారట శశికళ. మరి ఈ పది కోట్లు ఎలా వచ్చాయి? అనే ప్రశ్న ఎవరూ అడుగరాదు. స్కామ్ లో ఆమె పాత్ర పరిమితం, వాటా పరిమితం అనే కోర్టు విచారణలో తేలింది. అలాంటామె పది కోట్ల రూపాయలు ఎలా తెచ్చించారు? అనేది న్యాయపరమైన అంశమే!
ఒకవైపు శశికళకు బినామీ ఆస్తులున్నాయని చట్టబద్ధ సంస్థలే చెబుతున్నాయి. వాటి విలువ వేల కోట్లలో అంటున్నారు. అలాంటామెకు పది కోట్ల రూపాయల ఫైన్ చెల్లింపు పెద్ద విషయం కాకపోవచ్చు. ఏ అభిమానులో అయినా ఆమె తరఫున పది కోట్ల రూపాయల ఫైన్ ను కోర్టుకు చెల్లించగలరు కూడా!
వచ్చే ఏడాది జనవరి నెలాఖరు కల్లా శశికళ శిక్ష కాలం పూర్తవుతుందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఫైన్ కూడా చెల్లించేసినట్టున్నారు శశి. మరి ఆమె విడుదలకు అంతా ఓకేనా.. అంటే, అప్పటిలోగా ఎవరో ఏవో పిటిషన్లు వేయకపోతే, ఆల్రెడీ చట్టబద్ధ సంస్థల స్కానర్ లో ఉన్న ఆమెకు ఢిల్లీ నుంచి ఆశీస్సులు లభిస్తే కచ్చితంగా విడుదల అయ్యే అవకాశాలున్నాయి.
ఢిల్లీకి నచ్చకపోతే మాత్రం ఆమె ను మరో కేసులో జైలుకు పంపడం పెద్ద కథేం కాదు అనే అభిప్రాయాలున్నాయి. అందుకే ఆమె అనుచరుడు దినకరన్ ఇప్పటికే ఢిల్లీ వెళ్లి అన్ని ఏర్పాట్లూ చేసినట్టుగా కూడా తమిళనాట ఇది వరకే వార్తలు వచ్చాయి.