కులంలేని పార్టీ, మతంలేని రాజకీయం. ఇవీ పవన్ కల్యాణ్ ఇన్నాళ్లూ చెప్పిన మాటలు. సర్వమత సామరస్యంతో ముందుకెళ్తా అని కబుర్లు చెప్పిన పవన్ కల్యాణ్ ఇప్పుడు ముసుగు తీసేశారు. అంతర్వేదిలో రథం దగ్ధమైన ఘటనలో ఎప్పట్లానే ఆలస్యంగా నోరు విప్పిన పవన్ కల్యాణ్ పూర్తిగా హిందూత్వ స్టాండ్ తీసేసుకున్నారు. ఒకటికి పదిసార్లు ఆలోచించుకుని ఈ ఇంటర్వ్యూ ఇస్తున్నానంటూ చెప్పిన పవన్ కల్యాణ్, తన ఆలోచన పరిధి ఏంటో చెప్పకనే చెప్పారు.
ఇతర మతాలపై దాడులు జరిగినా, ఇతర ప్రార్థనాలయాలని కించపరిచినా అందరూ బైటకొచ్చి గొడవ చేస్తారని, హిందూ ఆలయాలపై దాడులు జరిగితే మాత్రం సెక్యులరిజం అనే ముసుగులో ఓటుబ్యాంకు రాజకీయాలు చేస్తారని చెప్పుకొచ్చారు పవన్. మతవాది అనే ముద్రపడినా పర్వాలేదు, నేను గొంతు విప్పుతానంటూ ముందుకొచ్చారు.
నెల్లూరు జిల్లాలోని ఆలయంలో గతంలో జరిగిన అగ్ని ప్రమాదాన్ని ప్రస్తావించారు. పిఠాపురంలో హిందూ దేవతల విగ్రహాలను ధ్వంసం చేసిన ఘటననూ తెరపైకి తెచ్చారు. ఇప్పుడు అంతర్వేది ఆలయ ఘటనపై కూడా ఏదో కుట్ర దాగి ఉందని అనుమానం వ్యక్తం చేశారు పవన్ కల్యాణ్. ఉగ్రవాదుల చర్యలు కూడా వీటి వెనక ఉండొచ్చని పెద్ద బాంబు పేల్చారు. వెంటనే ప్రభుత్వం ఈ ఘటనలపై ఎంక్వయిరీ వెయ్యాలని సూచించారు.
పిచ్చివాడు నెల్లూరులో రథం తగలబెట్టాడని చెబితే నమ్మే పరిస్థితిలో లేమని, తేనెతుట్టెను తగలబెట్టే క్రమంలో అంతర్వేదిలో రథం కాలిపోయిందంటే ఊరుకోమని అన్నారు. పోలీసుల ఎంక్వయిరీ నమ్మబోమంటున్న పవన్, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తితో విచారణ చేయించాలన్నారు. అది జరగని పక్షంలో తాను నేరుగా కేంద్రాన్ని సీబీఐ ఎంక్వయిరీ వేయమని కోరతానంటూ హెచ్చరించారు కూడా. ఎన్ఐఏ దర్యాప్తు కూడా అడుగుతానన్నారు.
అలా పవన్ ఇంటర్వ్యూ అప్ లోడ్ అయిందో లేదో.. ఇలా ట్రోలింగ్ మొదలైంది. కులం, మతం లేదని చెప్పుకునే పవన్ కల్యాణ్.. తాను హిందువునని ఎలా ప్రకటించుకుంటారని మండిపడ్డారు నెటిజన్లు. రాష్ట్రంలో రథం తగలబడితే సీబీఐ ఎంక్వయిరీ కోరుతున్న పవన్, ఇతర రాష్ట్రాల్లో మనుషుల్ని చంపేస్తుంటే ఎందుకు స్పందించరని మండిపడ్డారు. మొత్తమ్మీద ఈ ఇంటర్వ్యూతో తనలోని కరడుగట్టిన హిందూ ప్రచారక్ ని బైటకు తీసుకొచ్చారు పవన్ కల్యాణ్.