ఇటీవల కొంత కాలంగా జగన్ ప్రభుత్వంపై ఏదో రకంగా జనసేనాని పవన్‌కల్యాణ్ విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ను అడ్డుపెట్టుకుని ఏపీ ప్రభుత్వంపై పవన్ విమర్శలు సంధించడం విశేషం.
ఈ సందర్భంగా ఇటీవల ఉండవల్లి మీడియాతో మాట్లాడిన అంశాల్లో ముఖ్యమైన వీడియోను ఆయన ట్విటర్‌లో షేర్ చేయడం గమనార్హం.
‘దయనీయమైన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఉంది. 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఇవాళ్టి దయనీయ స్థితి ఎప్పుడూ లేదు. జీవోలు పెట్టడమే మానేశారు. పారదర్శకత లేదు. గవర్నమెంట్ ఏం చేస్తున్నదో ప్రజలకు తెలియకూడదు’ అని ఉండవల్లి అన్న మాటలను ఆయన మరోసారి తెరపైకి తేవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
‘ఉండవల్లి’గారి లాంటి రాజకీయ ఉద్ధండులు ఈ మాట మాట్లాడుతున్నారంటే పరిస్థితి తీవ్రత అర్ధం చేసుకోవచ్చు అని పవన్‌కల్యాణ్ ట్వీట్ చేశారు. ఇదెలా ఉందంటే, తానంటే పట్టించుకోవద్దని, కనీసం ఉండవల్లి లాంటి పెద్ద మనిషి ఏమంటున్నారో వినండయ్యా, అర్థం చేసుకోండయ్యా అని వేడుకుంటున్నట్టుగా ఉంది.