950 మంది సభ్యులు మాత్రమే వుండి, వారిలో దాదాపు సగం మంది మాత్రమే ఓటేసే ‘మా’ ఎన్నికలకు మీడియా అవసరానికి మించిన పబ్లిసిటీ యిస్తోందని తోస్తున్నా, నేను సైతం యీ వ్యాసం రాయడానికి కారణమేమిటంటే ఒక సామాన్యుడిగా నన్ను కొన్ని సందేహాలు తొలిచివేస్తున్నాయి. ప్యానెల్ సభ్యులు టీవీలకు, పత్రికలకు ఎడాపెడా యింటర్వ్యూలు యిస్తున్నారు కదా, పాత్రికేయులెవరూ ‘అసలు మీకు బిల్డింగు అవసరమా?’ అని ఎందుకడగరా అని నాకు ఆశ్చర్యంగా వుంది. ఎన్నికల మేనిఫెస్టో చూడబోతే ఓ పెద్ద కార్పోరేట్ బజెట్ అంత కనబడుతోంది. అన్నీ సంక్షేమ పథకాలే కనబడుతున్నాయి కానీ ఆదాయం ఎక్కణ్నుంచి వస్తుందో తెలియటం లేదు. కరోనా వచ్చి చిత్రపరిశ్రమను దెబ్బ తీసిన యీ తరుణంలో, నటీనటుల దగ్గర డబ్బులుంటాయని, యీ పథకాల అమలుకై వాళ్లు ఆదాయం సమకూర్చగలరని ఎలా అనుకుంటాం?
పోనీ పెద్ద స్టార్లు మరింత పెద్ద మనసు చేసుకుని విరాళాలు యిచ్చేస్తారని అనుకోవాలా? కరోనా వచ్చి, థియేటర్లు కుదేలయ్యాయి, సినిమా యిండస్ట్రీ బతకాలంటే మీ భారీ పారితోషికాలు తగ్గించాలి అని బతిమాలుతున్నా వాళ్లు వినటం లేదు. ‘ఉండవయ్యా, మొదటి వారాల్లో హెచ్చు రేట్లకు టిక్కెట్లు అమ్మకూడదంటూ ప్రభుత్వాలు స్క్రూలు బిగిస్తూంటే బెంగపడి ఛస్తున్నాం. మధ్యలో విరాళాలొకటా? ఏం తక్కిన నటీనటులు మాత్రం మాలాగే కష్టపడి పైకి రావచ్చుగా, వచ్చిన డబ్బులు వృథా చేయకుండా, వ్యసనాలకు ధారపోయకుండా మాలాగ దాచుకోవచ్చుగా.’ అనవచ్చు వారు. ఇక బయటి పారిశ్రామికవేత్తలకు సినిమా వాళ్లపై అసూయ తప్ప, జాలి ఏముంటుంది? ఎన్నికల వేళ ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకుంటూ, నిధుల దుర్వినియోగం అంటూ బహిరంగంగా యింత రచ్చ చేసుకున్న తర్వాత యీ అసోసియేషన్‌కు విరాళాలిస్తే సద్వినియోగం అవుతుందన్న నమ్మకమేమిటనే సంశయం దాతలకు రాదా?
ఇవన్నీ ఒక యెత్తు, ‘మా’కు సొంత బిల్డింగు నినాదం ఒక్కటీ రెండు యెత్తులు. మేం గెలిస్తే బిల్డింగు కట్టిస్తాం అంటూ చెప్తున్నాయి రెండు పక్షాలూ. విష్ణు అయితే సొంత డబ్బుతో కట్టిస్తానంటున్నారు. అప్పుడే స్థలాలు కూడా చూసేసి పెట్టారట. ఎంత డబ్బుంటే మాత్రం యింత ఔదార్యమా? మింగుడు పడటం లేదు. చూడబోతే సంక్షేమ పథకాలకు నిధులు ఎక్కణ్నుంచి వస్తాయని సందేహిస్తూ పై పేరాలో రాసినదానికి సమాధానం యిక్కడే వున్నట్టుంది. ఎవరూ విరాళాలివ్వకపోతే విష్ణుయే అన్నీ యిస్తారు కాబోలు. బిల్డింగు కట్టాక దాన్ని ఏం చేస్తారో, ఎలా ఉపయోగిస్తారో, మేన్‌టేనెన్స్ ఖర్చులు రాబట్టడానికి ఏం చేస్తారో విష్ణు చెప్పటం లేదు. ఇక ప్రకాశ్‌రాజ్ తన జేబులోంచి డబ్బు తీసి కట్టిస్తాననటం లేదు కానీ, రూ. 30 కోట్లతో బిల్డింగు కట్టి దాన్ని సెల్ఫ్‌ఫైనాన్సింగ్ వెంచర్‌గా మార్చేస్తానంటున్నారు. ఆ పేద్ధ బిల్డింగులో కళ్యాణమండపాల దగ్గర్నుంచి అన్నీ వుంటాయట. అద్దెలికిచ్చి డబ్బులు వసూలు చేస్తారట. మా సభ్యులకైతే 50 శాతం రాయితీట. అలా దాని పెట్టుబడి అదే రాబట్టేసుకుంటుందట.
వింటూంటే చంద్రబాబుగారి అమరావతి బంగారుబాతు గుర్తుకు రావటం లేదూ? ఆయన అదే చెప్తూ వచ్చారు. దాన్ని ఓ సారి కట్టేస్తే చాలు, అది బంగారు గుడ్లు పెట్టి రాష్ట్రాన్నంతటినీ పోషించేస్తుంది అని. బంగారు బాతు తయారవ్వడానికి కావలసిన బంగారం ఎక్కణ్నుంచి వస్తుందనేది, ఎంత ఖర్చవుతుంది అనేదే ప్రశ్న! ఆ బంగారం తేలేకనే అమరావతిని అరకొరవతిగా మిగిల్చి దిగిపోయారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ అదేదో సినిమాలో సుత్తి వేలు ‘నీ మొహం నాకు నచ్చలేదు’ అన్నట్లు దాన్ని శత్రుక్షేత్రంగా చూసి, స్థాయి దిగజార్చి, పాడు పెట్టేశారు. ‘మా’కు రెండేళ్ల తర్వాత వచ్చే టీము అదే చేయవచ్చు.
లేదా కెసియార్‌లా నా వంశమే ఎల్లకాలమూ అధికారంలో వుండాలంటే యీ ప్రదేశం వాస్తు నప్పదు. దీన్ని కూల్చేస్తా, వేరే చోట నా గ్రహాలకు తగ్గట్టు కడతా అనవచ్చు. అప్పుడీ పెట్టుబడంతా ఏమవుతుంది? ఇదేమీ జరగకుండా చూసుకుని, ఎలాగోలా తంటాలు పడి కట్టినా నికరాదాయం వస్తుందన్న నమ్మకమేమిటి? కావాలంటే ఓ బిల్డింగును లీజుకి తీసుకుని, యీ ప్రయోగాలన్నీ చేసి చూపించమనండి. ఎవరైనా యిల్లు కట్టడానికి ముందు అద్దెంట్లో వుంటారు, షాపు కొనబోయే ముందు అద్దె షాపులో వుంటారు. ఆదాయం బాగా వస్తూ వుంటే, అద్దెకు పోసే బదులు వడ్డీకి అప్పు తెచ్చుకుంటే కొన్నేళ్లలో మనది అయిపోతుంది కదా అనుకుంటారు. సినిమారంగంలో వాళ్లు కూడా థియేటర్లను లీజుకి తీసుకుని నడిపి, లాభాలొస్తే దాన్ని కొంటారు.
తక్కిన సమయాల్లో అద్దెలొస్తాయి, ఆదాయాలొస్తాయి అంటే నమ్మవచ్చేమో కానీ, కరోనానంతర కాలంలో యిలాటి లెక్కలు వేయలేం. ఎప్పుడో 30 ఏళ్ల క్రితం ధరలు తక్కువున్న రోజుల్లో కట్టిన కళ్యాణమంటపాలే బేరాల్లేక బోసి పోతున్నాయి, రిసార్టులు డల్ అయిపోయాయి. పెళ్లిళ్లకు హాజరు కావడాలు తగ్గాయి. ఆన్‌లైన్ లింకు యివ్వండి, ఇంట్లోంచే చూసేస్తాం అంటున్నారు. ఓ ఏడాదిలోపుగా కరోనా అదుపులోకి రావచ్చు కానీ మరొకటి బయలుదేరదని నమ్మకం ఏమిటి? ఊహాన్ ల్యాబ్ కాకపోతే మరో దేశపు ల్యాబ్, యింకో దేశపు ల్యాబ్.. పోటాపోటీగా వైరస్‌లు పుట్టించలేవా? ఏది ఏమైనా గుమిగూడడాలూ, ప్రయాణాలూ తగ్గిపోతాయని, యథాతథ స్థితి యిప్పట్లో రాదని అనుకోవచ్చు. అందుకే స్టార్ హోటళ్లు సైతం తమ గదులు నింపుకోవడానికి రిబేట్లు యిస్తున్నాయి. తమ కాన్ఫరెన్స్ హాళ్లను, మేరేజి హాళ్లను చౌకగా ఆఫర్ చేస్తున్నాయి. ఇలాటి సమయంలో యీయన కొత్తగా ఫంక్షన్ హాలు కడతానంటూంటే ఆశ్చర్యంగా లేదూ?
వ్యక్తులెవరైనా సొంత బిల్డింగు ఎప్పుడు కడతారు? జీవితంలో ఓ స్థాయికి వచ్చి సెటిలయ్యాక కడతారు. ఇప్పట్లో బాంకులు ఋణాలిస్తున్నాయి కాబట్టి 40 వచ్చే లోపున కడుతున్నారు కానీ యిదివరకు రిటైరయ్యాక పిఎఫ్ డబ్బుతో కట్టుకునేవారు. ఇక అసోసియేషన్లు ఎప్పుడు కట్టుకుంటాయి? మర్చంట్స్ అసోసియేషన్ల వంటివి నిధులు బాగా చేరిన తర్వాత ఓ బిల్డింగు కట్టి దానిలో కిందంతా షాపులకు అద్దెకిచ్చి, పై అంతస్తులో సగమో, పాతికో సమావేశాలకు ఓ హాలు అంటూ కడతాయి. ‘మా’ కళాకారుల అసోసియేషనే కానీ నిజంగా చెప్పాలంటే కళాకార్మికుల అసోసియేషన్. పెద్ద నటులు మొహమాటానికి సభ్యులుగా వుంటారు. చిన్నవాళ్లకు అవసరాలు ఎక్కువ వుంటాయి. మధ్యవాళ్లు చిన్నవాళ్ల కోసం పెద్దవాళ్లను ఒప్పించి, పనులు జరిపిస్తూ వుంటారు. కరోనా ధర్మమాని మధ్యవాళ్లు కూడా చిన్నవాళ్లయి పోయారు. వీళ్ల దగ్గర రిజర్వ్ చేసేటంత నిధులు ఎక్కడున్నాయి? అందువలన అప్పు చేసి కట్టాలి.
ఇప్పుడు మా అసోసియేషన్‌కు ఏ బ్యాంకు అప్పిస్తుంది? వీళ్లు భీకరంగా కొట్టుకోవడం చూస్తూ వుంటే ఏ ఫైనాన్షియరూ సాహసం చేయడు. లక్షల టర్నోవరులోనే నిధుల దుర్వినియోగం జరుగుతోంది. కొంతమంది విరాళాలు యిస్తామని ప్రకటనలు చేస్తున్నారు కానీ చెక్కులివ్వటం లేదు వంటి వార్తలు పేపర్లలో వచ్చేసిన తర్వాత అప్పివ్వడానికి ఎవరికైనా ధైర్యం వుంటుందా? అందువలన ప్రతీ పైసాకు విరాళాల మీద ఆధారపడవలసినదే! చందాలడిగితే మీకంత బిల్డింగు ఎందుకని దాతలు అడిగితే వీళ్లేం చెప్తారు? ‘ఉన్న సభ్యులే వెయ్యికి లోపు. జనరల్ బాడీకి పిలిస్తే సగం మంది వచ్చినా బిల్డింగులో ఏ హాలూ చాలదు. ఏ రిసార్టులోనే పెట్టాలి. బోర్డు సభ్యుల మీటింగయితే ఏ ప్రొడ్యూసర్ గెస్ట్‌హవుస్‌లోనో, ఫిల్మ్‌నగర్ క్లబ్బులోనో పెట్టుకోవచ్చు. తక్కిన రోజుల్లో ఆఫీసు నడపడానికి ఒక టూ బెడ్‌రూమ్ ఫ్లాట్ చాలు. ఈ రోజుల్లో చాలాభాగం ఆన్‌లైనే అయిపోతున్నాయి. కమిటీ సభ్యులు ప్రత్యక్షంగా రానక్కరలేకుండా జూమ్ మీటింగులోనే మాట్లాడేసుకోవచ్చు. ఈ మాత్రానికి సొంత బిల్డింగు ఎందుకు?’ అంటే వీళ్ల దగ్గర సమాధానం ఏముంది?
ప్రభుత్వం కానీయండి, ప్రయివేటు కానీయండి నిధులు దుర్వినియోగం అయ్యాయని, అవినీతి, ఆశ్రితపక్షపాతం జరిగింది అనే ఆరోపణలు వచ్చేదెప్పుడూ కన్‌స్ట్రక్షన్ పనుల్లోనే! నిజంగా బిల్డింగు కట్టడానికి ఉపక్రమిస్తే మాత్రం ఈ నటీనటులందరూ షూటింగు నుంచి సరాసరి టీవీ స్టూడియోలకు వచ్చి కూర్చుని డబ్బులు తినేశారంటూ ఆఫీస్ బేరర్స్‌ని తిట్టనారంభిస్తారు. గతంలో ఓ ఫ్లాట్ కొని అమ్మినపుడు కూడా, ఆ మురిక్కాలువ దగ్గర ఎందుకు కొన్నారు, భారీగా యింటీరియర్స్ ఎందుకు చేయించారు, కొన్న ధర కంటె తక్కువకి ఎందుకు అమ్మారు? వంటి ప్రశ్నలు వచ్చాయి. వీటికి సరైన సమాధానాలు ఎవరైనా యిచ్చారా? అప్పటి కమిటీ అంగీకరించింది అని ఒక్క ముక్కలో తేల్చి పారేశారు. ఎవరికైనా ఆస్తి కొని కొన్నాళ్లకు అమ్మితే లాభాలొస్తాయి, హైదరాబాదు వంటి నగరంలో మరీ వస్తాయి. ఈ నటీనటులు కూడా వ్యక్తిగతంగా అలాటి లాభాలు పొందే వుంటారు. కానీ వీళ్లు బృందంగా ఏర్పడి రియల్ ఎస్టేటు ట్రాన్సాక్షన్ చేస్తే మాత్రం నష్టం వచ్చింది. ఎందుకా అంటే మురిక్కాలువ అంటున్నారు. అది కొనేటప్పుడు లేదా? వీళ్లు కొన్నాక ప్రభుత్వం కొత్తగా తవ్విందా?
స్థలం, పొలం, యిల్లు, కమ్మర్షియల్ కాంప్లెక్స్.. ఏదైనా సరే ఆస్తి సంపాదించడం సులభమే. మేన్‌టెనెన్సే కష్టం. కబ్జా కాకుండా కాపాడుకోవడం, రిపేర్లు చేయించడం, అద్దెలు రెగ్యులర్‌గా వసూలు చేయడం, అద్దె చెల్లించనివాణ్ని మెడబట్టి గెంటడం యివన్నీ మాటలా? నటీనటులకు ఆ విద్య వస్తే వాళ్లు నిర్మాతల దగ్గర్నుంచి తమకు రావలసిన బకాయిలు రాబట్టుకునేవారు. ఓ పాటి నటులకు టైముండదు. అన్నీ మేనేజర్ల మీద వదిలేయాలి. వాళ్లు తినేసినా వీళ్లే నింద మోయాలి. అసలు నటులు మంచి నిర్వాహకులని ఎలా అనుకోగలం? భమిడిపాటి రాధాకృష్ణ గారు నాతో చెప్పారు. ఓసారి సినిమారంగంలోకి దిగాక, రైల్వే స్టేషన్‌కి వెళ్లి టిక్కెట్టు స్వయంగా కొనుక్కోలేరు అని. వెనక్కాల ఎవరో ఒకరు తైనాతీ వుండాల్సిందే!
డబ్బు మేనేజ్‌మెంట్ అనేది ప్రత్యేకమైన కళ. ‘నా ఫేస్ చూపించి, నిర్మాతలు బాగుపడిపోతున్నారు. నేనే స్వయంగా నిర్మాణంలోకి దిగి, నా యిమేజిని నేనే ఎన్‌క్యాష్ చేసుకుంటా’ అంటూ ఎందరో హీరోహీరోయిన్లు నిర్మాతలుగా మారారు. ఖర్చు మీద నియంత్రణ లేక, మేనేజర్లపై నిఘా లేక రూపాయికి రెండు ఖర్చయి, నష్టపోయారు. నిర్మాతల మండలి వాళ్లు భవంతి కడదామనుకుంటే వాళ్లు చేయగలరు, ఎందుకంటే వాళ్లదీ వ్యాపారస్తుల సంస్థ వంటిదే. ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ తెలుసు. యాక్టర్లయితే ఎమోషనల్ వ్యక్తులు. మూడ్ స్వింగ్స్ ఎక్కువ. కోపతాపాలు అణచుకోలేక పక్కవాళ్లపై ప్రదర్శిస్తారు. వైవాహికబంధాల విషయంలో యీ తేడా కొట్టవచ్చినట్లు కనబడుతుంది. అజమాయిషీ చేతకాక, డబ్బు పోయే సందర్భాల్లో సొంత డబ్బయితే పోయినా ఫర్వాలేదు, ఓసారి ఏడ్చి ఊరుకోవచ్చు. కానీ మందికి సమాధానం చెప్పవలసిన డబ్బయితే కావాలని చేశాడనే నింద మోయాలి. ఎంత ఏడ్చినా పుండులా సలుపుతూనే వుంటుంది.
అసలీ బిల్డింగుకి బదులు నటీనటులకు రెగ్యులర్ మంత్లీ యిన్‌కమ్ యిచ్చే స్కీములు పెట్టాలి. మెడికల్, లైఫ్ ఇన్సూరెన్సులు ఎలాగూ ఏర్పాటు చేయాలి. దానితో బాటు యిదీ అతి ముఖ్యం. ఎవరైనా యాక్టరుకు మీరు యిల్లు అద్దెకిస్తారా? సంకోచిస్తారు కదూ. ఎందుకు? ఇవాళ నాలుగు వేషాలు వస్తున్నాయి, రేపు వస్తాయన్న నమ్మకమేమిటి? అద్దె రెగ్యులర్‌గా యివ్వడమో అనే సందేహం పీడిస్తుంది. అందుకని అసోసియేషన్ యిలాటి వాటికి గ్యారంటీ యివ్వాలి. ఎవరైనా యాక్టరు తనకు వచ్చిన పారితోషికాన్ని మొత్తంగా ఖర్చు పెట్టేసుకోకుండా దాన్ని అసోసియేషన్ వద్ద దాచుకోవాలి. యాన్యువిటీ మోడల్లో నెలకు యింత అని డ్రా చేసుకునే వెసులుబాటు యివ్వాలి.
సులభంగా చెప్పాలంటే యిది రివర్స్ రికరింగు డిపాజిట్ వంటిది. ఓ సినిమాలో అతనికి 60 వేలు వస్తే, దాన్ని అసోసియేషన్ తన దగ్గర పెట్టుకుని ఆరు నెలల పాటు ప్రతీ నెలా పదివేల చొప్పున యిస్తుంది. ఇంకో రెండు నెలల్లో అతనికి 30 వేలు ఆదాయం వచ్చి దాన్నీ చేరిస్తే యిచ్చే సొమ్మును 12 వేలు చేసి, యింకా కొన్ని నెలలు పొడిగించవచ్చు. ఆ విధంగా వాళ్లు అద్దెకు, తిండికి, పిల్లల స్కూలు ఫీజులకు తడుముకో నక్కరలేదు. రేపెలా గడుస్తుందన్న భయం నటుడికి, అతని కుటుంబానికి వుండదు. ఇలా డిపాజిట్ చేసిన వాళ్ల తరఫున అసోసియేషన్ యింటి ఓనర్లకు గ్యారంటీ యివ్వవచ్చు. ఇలా దాచుకోవడం ప్రయివేటు వ్యక్తుల దగ్గర కూడా చేయవచ్చు కానీ ఎగ్గొడతారనే భయం వుంటుంది. అసోసియేషన్ తమ వద్ద పెట్టిన డిపాజిట్లను నిర్మాతలకు, ఫైనాన్షియర్లకు అప్పిచ్చి వడ్డీ సంపాదించి, దానిలో కొంత డిపాజిటర్లకు యిచ్చి, కొంత నిర్వహణకు వాడవచ్చు.
ఇలాటి సింపుల్ స్కీముల గురించి ఆలోచించకుండా 30 కోట్ల బిల్డింగు కడతాం, అందరికీ సొంత యిళ్లు, కళ్యాణలక్ష్మి, కేజి నుంచి పిజి వరకు స్కాలర్‌షిప్ వంటి రంగుల కలలు ఎందుకు అమ్మాలో నాకు అర్థం కాదు. మీకు బిల్డింగు అవసరమా? అని పాత్రికేయులు ప్యానెల్ సభ్యులను అడిగారా? నాకు తెలియదు. జరుగుతున్న దేమిటంటే యాక్టర్లు వాళ్లంతట వాళ్లే వచ్చి, మీడియాకు ఎక్కుతున్నారు. సాధారణ ప్రజలకు వీటిలో ఓటింగు హక్కు లేదు. తమ అభిప్రాయాన్ని వ్యక్తీకరించే అవకశామూ లేదు. అసలు యీ యాక్టర్లు కూడా తమ వెయ్యిమందికి ఓ వాట్సాప్ గ్రూపు పెట్టి వాళ్లలో వాళ్లు చర్చించుకుంటే చాలు. కానీ మన దగ్గరకు వచ్చి గోడు వెళ్లబోసుకుంటున్నారు, ఆవేశకావేషాలు ప్రదర్శిస్తున్నారు. ఛాలెంజులు విసురుకుంటున్నారు. వాళ్లంతా తెలిసిన మొఖాలు కాబట్టి, ఇదంతా మనకో వేడుక అయిపోయింది. మనం చూస్తున్నాం కదాని మీడియా వాళ్లకి కవరేజి యిస్తోంది.
అసలు యిలాటి అసోసియేషన్ల అధ్యక్షులకు హుందాతనం వుండాలి. పెద్దరికం వుండాలి. ఎందుకంటే అసోసియేషన్ ప్రధాన కర్తవ్యం తగవులు తీర్చటం. నటీనటుల మధ్యనో, నిర్మాతలతోనో, దర్శకులతోనో పేచీలు వస్తాయి. వీళ్లు ఓపిగ్గా యిరుపక్షాల వాదనలు విని, తీర్పు చెప్పాలి. అది అవతలివాళ్లు మన్నించేటంత స్టేచర్ వీళ్లకు ఉండాలి. వయసు రీత్యా చూస్తే మంచు విష్ణుకి ఆ స్టేచర్ వున్నట్లు తోచదు. ఆవేశం రీత్యా ప్రకాశ్ రాజ్‌కు వున్నట్లు తోచదు. ప్రకాశ్ మొదట్లో గంభీరంగానే మాట్లాడాడు. కానీ పోనుపోను రెచ్చగొడితే రెచ్చిపోయాడు. పవన్ కళ్యాణ్ స్టేటుమెంటుపై మీ స్టాండ్ చెప్పండి అని విష్ణు ఉచ్చు విసిరితే దానిలో పడ్డాడు. టిక్కెట్ల అమ్మకానికి, ‘మా’ నిర్వహణకు సంబంధం ఏముంది? పైగా యిది రెండు రాష్ట్రాలకు సంబంధించిన అసోసియేషన్, థియేటర్లకు, ఒక రాష్ట్రానికి సంబంధించిన విషయంపై నేనెందుకు మాట్లాడాలి? అని తప్పించుకోకుండా, పోనీ ఔను, కాదు అనే సమాధానం చెప్పకుండా, పవన్ సినిమా కలక్షన్లతో విష్ణు సినిమా కలక్షన్లను పోల్చడం దేనికి?
అసలు సినిమా కలక్షన్ల గురించి యిక్కడ ప్రస్తావన దేనికి? పోటీదారుల నటన గురించి కూడా చర్చ జరుగుతోంది. ఎవరెంత యాక్టరైతే ఏమిటి? ఎన్ని అవార్డులు తెచ్చుకుంటే ఏమిటి? ఆ ప్రజ్ఞకు, సేవాతత్పరతకు సంబంధం ఏమైనా వుందా? ధర్మేంద్ర, గోవిందా, వినోద్ ఖన్నా యిత్యాది మహానటులను ప్రజలు పార్లమెంటు సభ్యులుగా పంపారు. వాళ్లు దిల్లీ వెళ్లేవారా? పార్లమెంటుకి హాజరయ్యేవారా? అయినా నోరు విప్పేవారా? నియోజకవర్గం ప్రజలను కలిసేవారా? వారికేమైనా చేసేవారా? మన తెలుగు యాక్టర్లూ అంతే. నటన అనేది యిక్కడ అంశం కానట్లే, ఫలానా నటుడు షూటింగుకి వస్తాడా రాడా? నిర్మాత డబ్బు ఎగ్గొట్టినా పోనీలే అనుకుంటాడా? లాటి వాటికి అసోసియేషన్ కార్యకలాపాలకు సంబంధం ఏముంది?
ఏ యూనియన్‌లో కానీ, అసోసియేషన్‌లో కానీ అధ్యక్ష పదవి చేపట్టేవారికి వుండవలసిన లక్షణాలు – సభ్యులకు అందుబాటులో వుండడం, టైము కేటాయించగలగడం, ఓపిగ్గా వినడం, సమస్యను అర్థం చేసుకోగలగడం, కమిటీలో అందర్నీ కలుపుకుని వెళ్లగలిగే తత్వం, ఆరోపణలు వచ్చినా భరించే సహనం! కోపం రాగానే రిజైనా చేస్తానంటూ రంకెలు వేయకూడదు. నా దృష్టిలో అధ్యక్షుడి పోస్టుకి తగినవారు మురళీమోహన్ వంటి సౌమ్యులు తప్ప ఆవేశపరులు కాదు. సెక్రటరీకి నిర్వహణా సామర్థ్యం మెండుగా వుండాలి. విష్ణు వంటి యువకుణ్ని సెక్రటరీగా ఊహించవచ్చు కానీ అధ్యక్షుడిగానా!? అతనికి ముందెంతో కెరియర్ వుంది కదా, అసోసియేషన్ కార్యకలాపాలకు సమయం వెచ్చించగలడా? లేక తన బదులు వేరెవరినైనా తగవులు తీర్చమని చెప్తాడా అనే అనుమానం కలుగుతోంది. అసలు ఒక యువకుడు ఎలక్ట్రానిక్ పరికరాలపై నమ్మకం లేదు, ఇవిఎమ్‌లు వద్దు అనడం కూడా నాకు వింతగానే వుంది.
నాకు వింత గొలిపే విషయాలు యీ ఎన్నికలలో అనేకం తారసిల్లాయి. ఒకాయన దైవభక్తి, దేశభక్తి లేనివాళ్లకు ఓటేయకూడదంటున్నారు. దానికీ యీ పదవికీ సంబంధం ఏమిటో తెలియదు. ఎవరిలో ఏది ఏ పాళ్లలో ఉందో కొలిచే సాధనం ఆయన దగ్గరుందా? ఈ ఎన్నికల సందర్భంగా హఠాత్తుగా తెలుగుతనం గుర్తుకు వచ్చింది కొందరు మహానుభావులకు. సంఘం పేరులో కానీ, సినిమా పేర్లలో కానీ, భావవ్యక్తీకరణలో కానీ, ఉచ్చారణలో కానీ ఎక్కడా తెలుగుతనం గురించి పట్టించుకోని వారు అర్జంటుగా ‘మనవాళ్లు, పరాయివాళ్లు’ అంటూ మాట్లాడుతున్నారు. మన తెలుగు సినిమారంగం బొంబాయి హీరోయిన్లను, విలన్లను, కారెక్టరు యాక్టర్లను, తమిళ రచయితలను, మలయాళీ సంగీతదర్శకులను, హాలీవుడ్ స్టంటుమాస్టర్లను అందర్నీ తెచ్చుకుంటుంది. స్థానికులకు అవకాశాలివ్వదు. అప్పుడేమో తెలుగుతనం గుర్తుకు రాదు.
ఆ సందర్భాల్లో కళలకు ఎల్లలు లేవు వంటి భారీ డైలాగులు కొట్టేవారికి ఇప్పుడు మాత్రం ప్రకాశ్‌రాజ్ పరాయివాడు అయిపోయాడు. కనీసం ఆయన తెలుగు నేర్చుకుని, ఆయన డైలాగులు ఆయనే చెపుతున్నాడు. తెలుగు కవిత్వం చదువుతాడు, రాస్తాడు వంటివి యిక్కడ అప్రస్తుతం. సినిమాల వరకు తీసుకుందాం. మరి దశాబ్దాలుగా యీ యిండస్ట్రీలో వుంటూ తన డబ్బింగు తను చెప్పుకోలేని ఆర్టిస్టులకు పిలిచి పెద్దపీట వేస్తూ వచ్చిన సినిమా పెద్దలు యీరోజు తెలుగువాళ్లం అనడం హాస్యాస్పదంగా లేదా? అన్నిటికన్న పెద్ద జోకు విష్ణు వేశారు. ‘మేం దానాలు చేసి కూడా చెప్పుకోం, ఎందుకంటే మేం తెలుగువాళ్లం’ అని. ఈ లెక్కన సుబ్బరామిరెడ్డి లాటి వాళ్లు తెలుగువాళ్లే కాదు. ఈ సంకుచిత ధోరణి ముదిరితే ప్రమాదం. మరో ఆయన తెలుగువాళ్లయితే చాలదు, తెలంగాణ వాళ్లయి వుండాలన్నారు, పోనుపోను ఫిల్మ్‌నగర్‌లో నివాసముండే వాళ్లే నటుల సంఘానికి అధ్యక్షుడు కావాలి అని వాదించేట్టున్నారు.
ఇంతింత గొడవలు అవసరమా? అదీ పబ్లిగ్గా కొట్టుకోవాలా? సింగరేణి యూనియన్‌లో ఎన్నికలు జరిగాయంటే ఫలితాలు మాత్రం పేపర్లో వస్తాయి. ఈ లోపున జరిగే చర్చలన్నీ వర్కర్లకే తెలుస్తాయి. ఇక్కడ మనను పిల్చి మరీ చెప్తున్నారు. నిజానికి ‘మా’లో డబ్బు లేదు, ఇదేదో ప్రభుత్వ పదవీ కాదు, పెద్ద అధికారమూ లేదు. కేవలం పరువుకోసం నడుస్తోన్న పోరాటమిది. రెండు వర్గాలుగా చీలి, తమ ఆధిపత్యాన్ని నిరూపించుకోవడానికి చేస్తున్న ప్రయాస యిది. సమాజంలో జరిగే ప్రతి చెడుని, ప్రతి వర్గాన్ని సినిమాల్లో విమర్శిస్తారు. సమాజం ఎలా వుండాలో హీరోలు తమ డైలాగుల ద్వారా సుద్దులు చెప్తారు. మరి తమ వరకు వచ్చేసరికి యిలా ప్రవర్తిస్తే ఎబ్బెట్టుగా వుంటుందని వాళ్లకు ఎందుకు తోచటం లేదో!
– ఎమ్బీయస్ ప్రసాద్ (అక్టోబరు 2021)