ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇటీవల ప్రవచించిన ఆత్మనిర్భర్ భారత్ గురించి ప్రచారం కల్పిస్తారట జనసేన అధిపతి పవన్ కల్యాణ్. మరి ప్రభుత్వ పరంగా ఆయన ఈ పని చేస్తారో, లేక పార్టీగా ఈ నినాదాలను ఎత్తుకుంటారో కానీ.. ఈ మేరకు ఒక ప్రకటన జారీ చేశారు.
ప్రధానమంత్రిగా నరేంద్రమోడీ వివిధ నినాదాలకు సెలబ్రిటీలను నామినేట్ చేయడం జరిగింది. బహుశా పవన్ కల్యాణ్ ఆ తరహాలో కాకుండా.. బీజేపీ మిత్రపక్ష పార్టీగా ఈ నినాదం విషయంలో పని చేస్తారేమో!
ఇటీవల చైనాతో వివాదం నేపథ్యంలో దేశంలో ఆత్మనిర్భర్ భారత్ అంటూ మోడీ నినదించారు. ఈ హిందీ నినాదం దక్షిణాదిన అంత తేలికగా అర్థం అయ్యేలా లేదు. ఇలాంటి నేపథ్యంలో పవన్ కల్యాణ్ పార్టీ , బీజేపీలు కలిసి ఈ విషయం గురించి ప్రజల్లో అవగాహన పెంచుతాయట.
జనసేన- బీజేపీలు తమ స్నేహం గురించి ప్రకటించాకా.. ఈ రెండు పార్టీలూ ఉమ్మడి ప్రోగ్రామ్ నేదీ చేపట్టలేదు. కరోనా కాలం కావడంతో సభలూ, సమావేశాలకు అవకాశం లేకుండా పోయింది. ఇక పవన్ కల్యాణ్ ఫామ్ హౌస్ దాటి బయట అడుగుపెట్టడం లేదు.
సోమూవీర్రాజు అధ్యక్షుడిగా వచ్చాకా వరద బాధిత ప్రాంతంలో పర్యటించారు. పవన్ కల్యాణ్ మాత్రం అలాంటి పనులు కూడా ఏవీ పెట్టుకోవడం లేదు. లేఖలు, ట్వీట్లు అంటూ చంద్రబాబు నాయుడు, లోకేష్ లను ఫాలో అవుతున్నారు పవన్ కల్యాణ్. ఈ క్రమంలో ఇప్పుడు ఆత్మనిర్భర్ భారత్ గురించి జనసేన ప్రచారం చేసిపెడుతుందంటూ మరో ప్రకటన విడుదల చేశారు. ఇంతకీ ఆచరణ ఏమిటో!