జనసేనాని పవన్‌కల్యాణ్ ఇంత వరకూ యుద్ధం చేయడాన్ని ఎవరూ చూడలేదు. కానీ ఆయన అనేకసార్లు యుద్ధశంఖారావం పూరించారు. పవన్‌కు తెలియంది ఏంటంటే ఆల్రెడీ యుద్ధం జరుగుతూ వుంది. ఆయనే పాల్గొనలేదు. కానీ తాను చేస్తేనే అది యుద్ధం అనే భ్రమలో ఆయన ఉన్నారు.
పవన్‌కల్యాణ్ రాజకీయ ఉనికి ఆయన అజ్ఞానం, అమాయకత్వం, అవివేకంలపై ఆధార పడి ఉన్నాయనే వాళ్లే ఎక్కువ మంది. పవన్ గొప్పతనం ఏంటంటే… సమాజం తన గురించి ఏమనుకుంటున్నదో తెలుసుకోవా లని ఏ రోజూ అనుకోకపోవడం. ఇదే ఆయనకు శ్రీరామ రక్ష. పవన్‌కల్యాణ్ మరోసారి యుద్ధ హెచ్చరిక చేశారు. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి.
మంగళగిరి పార్టీ కార్యాలయంలో జనసేన విస్తృతస్థాయి సమావేశంలో ఆయన ఆవేశపూరిత ప్రసంగం చేశారు. పవన్‌కు ఆవేశమే ఆభరణం, బలహీనత రెండూనూ. నిన్నటి సభలో ఆయన ఏమన్నారంటే…
‘ఓటమి భయం, ప్రాణ భయం లేనివాడిని. యుద్ధానికి సంసిద్ధంగా ఉన్నవాడిని. కడదాకా పోరాడే వాడిని. వైసీపీ దుష్టపాలనను అంతమొందించాల్సిన సమయం ఆసన్నమైంది. వ్యూహాలు మారుస్తాం’
‘వైసీపీ వాళ్లకు డబ్బు, అధికారం, అహంకారం బాగా ఉన్నాయి. వారికి భయమే లేదు. అది ఎలా ఉంటుందో చూపిస్తా! అనాల్సిన వన్నీ అనేసి కులాల చాటున దాక్కుంటే బయటకు లాక్కొచ్చి కొడతాం. లేదంటే, చట్టం ప్రకారం శిక్షలు పడే బాధ్యత తీసుకుంటాం’
‘యుద్ధం ఎలా కావాలి? ప్రజాస్వామ్యబద్ధంగా యుద్ధం కావాలన్నా, మరో రకంగా అయినా… మేం సిద్ధం! వైసీపీ నాయకత్వానికి ఇదే నా చాలెంజ్! బయటికి రండి… మీరో మేమో తేల్చుకుందాం. మీ తాట తీసి మోకాళ్ల మీద కూర్చో బెడతాం. యుద్ధానికి మీరే పిలిచారు. యుద్ధం ఏ సైజులో, ఎలా కావాలో కోరుకోండి ’
రాజకీయ పరిపక్వత ఉన్న నేత ఎవరైనా పైన పేర్కొన్న విధంగా మాట్లాడ్తారా? ఏమిటా భాష? బయటికి లాక్కొచ్చి కొడతారా? ఎవరిని కొడతానని హెచ్చరిస్తున్నారు? ప్రజాస్వామ్యబద్ధంగా యుద్ధం కావాలన్నా, మరో రకంగా అయినా తాము సిద్ధమని ప్రకటించడం దేనికి సంకేతం? ఇలా రెచ్చగొడుతూ మాట్లాడుతూ, ప్రత్యర్థులు గట్టిగా కౌంటర్ ఇస్తే లబోదిబోమనడం పవన్‌కల్యాణ్‌కే చెల్లింది.
ఎవరి యుద్ధ వ్యూహాలు వాళ్లకుంటాయి. ఏం చేస్తే యుద్ధంలో గెలుస్తామో, ఆ రకంగా ప్రత్యర్థులకు ఉచ్చు బిగిస్తారు. తాను పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోవడంతో పాటు తన పార్టీని మట్టికరిపించిన వైసీపీకి యుద్ధం గురించి పవన్‌కల్యాణ్ చెప్పడం అంటే, ఆయన అజ్ఞానం ఎంత అపారమో అర్థం చేసుకోవచ్చు. ఇదే ప్రత్యర్థులకు పవన్‌ను దెబ్బతీయడం సులువైంది.
పవన్ గత కొన్నిరోజులుగా తాను మాట్లాడిన మాటలను ఒకసారి ఒంటరిగా వింటే…తాను యుద్ధం ఎవరిపై చేయాలపై సమాధానం దొరుకుతుంది. పవన్ మొట్ట మొదట యుద్ధం చేయాల్సింది… తన అహంకారం, అపారమైన అజ్ఞానం, జగన్ అనే వ్యక్తిపై నింపుకున్న ఈర్ష్య, అసూయలపై అని తెలుసుకోవాలి. ప్రత్యర్థుల ఎదుగుదలపై ఓర్వలేనితనంపై యుద్ధం చేయాలి.
తానేమన్నా భరిస్తూ, నోరు మూసుకుని పడి ఉండాలనే భావజాలంపై యుద్ధం చేయాలి. రాజకీయం అంటే రీల్ లైఫ్ అనే భ్రమలపై యుద్ధం చేయాలి. రాజకీయం అంటే నిత్య కురుక్షేత్రమని, దానికి సినిమా షూటింగ్ల్లా షెడ్యూళ్లు ఉండవనే వాస్తవాన్ని గ్రహించేందుకు అజ్ఞానాన్ని పారదోలాలి.
పవన్‌లో నిజంగా తెలివితేటలే ఉంటే… యుద్ధం అంటే ఏంటో గ్రహించొచ్చు. నాలుగైదు రోజుల క్రితం తన మేనల్లుడి సినిమా ఫంక్షన్లో వివాదాస్పద వ్యాఖ్యలు ఏపీలో తీవ్ర రాజకీయ దుమారం రేపాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకూ చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలను గమనిస్తే… యుద్ధంలో ఎవరు గెలిచారో పవన్ గుర్తించొచ్చు.
పవన్ వ్యాఖ్యలకు, తమకు ఎలాంటి సంబంధం లేదని ఫిల్మ్ చాంబర్ ప్రకటించింది. అలాగే హీరో నాగార్జున కూడా ఇదే అభిప్రా యాన్ని వ్యక్తం చేశారు. నిర్మాతలు దిల్‌రాజ్, తదితరులు నిన్న మంత్రి పేర్ని నాని ఇంటికెళ్లి మరీ పవన్‌కల్యాన్ పిచ్చివాగుడుకు, సినీ పరిశ్రమకు సంబంధం లేదని వివరణ ఇచ్చుకున్నారు. అంతెందుకు స్వయంగా తన అన్న మెగాస్టార్ చిరంజీవి కూడా పవన్ మాటలు ఆయన వ్యక్తిగతమని చెప్పినట్టు మంత్రి నాని తెలిపారు.
తాను ఏ ఇండస్ట్రీ కోసమైతే ప్రభుత్వాన్ని విమర్శించానని పవన్ చెబుతున్నారో, అక్కడి నుంచి మద్దతు లభించలేదు. అంటే పవన్ ఒంటిరయ్యారు. ఇది చాలదా యుద్ధంలో తాను ఓడిపోయానని జ్ఞానోదయం కావడానికి? పవన్ యుద్ధం మొదలు పెట్టడం గురించి మాట్లాడుతుంటే, ఇదే జగన్మోహన్రెడ్డి యుద్ధాన్ని ముగించి విజయాన్ని ఆస్వాదిస్తుంటారు. దటీజ్ జగన్.
మరీ ముఖ్యంగా చంద్రబాబు మాదిరిగా వైఎస్ జగన్, ఆయన అనుచరులు అంత మర్యాదస్తులు కాదని గ్రహించాలి. తలకిందులు తపస్సు చేసినా.. జగన్మోహన్రెడ్డి అనే నాయకుడు తన దగ్గరికి సహాయం కోరేందుకు రారని గ్రహించాలి. తాను రీల్ లైఫ్ హీరోని మాత్రమేనని, జగన్ రియల్ హీరో అని గుర్తించుకుని పవన్ నోటిని అదుపులో పెట్టుకుని మాట్లాడాలి.
ప్రధానంగా తన రాజకీయ ప్రత్యర్థులెవరో తెలియని అజ్ఞానంపై పవన్ యుద్ధం చేయాలి. గమ్యం లేని పోరాటం, లక్ష్యం లేని గమ్యంపై యుద్ధం చేయాలి. మరీ ముఖ్యంగా తన నోటి దురుసే అన్నిటికి మించి ప్రధాన శత్రువని గుర్తించి, దానిపై పవన్ యుద్ధం చేయాలి. శత్రువు ఎక్కడో ఉండరు. మనలోనే ఉంటాడు. దానిపై విజయం సాధిస్తే… అన్నీ జయించినట్టే. అందుకే నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని పెద్దలు ఊరికే చెప్పలేదు.
పవన్‌తో వచ్చిన సమస్య ఏంటంటే… తాను విపరీతమైన చదువరని, లక్షలాది పుస్తకాలు చదవడం వల్ల అనంత జ్ఞానాన్ని ఆర్జించాననే భ్రమలో ఉంటారు. ఈ అజ్ఞానమే ఆయన కొంప ముంచుతోంది. పవన్ ఎప్పుడూ ఊహాలోకంలో విహరిస్తుంటారు. తానంటే రియల్ లైఫ్‌లో కూడా హీరో అనుకుని, తనను వ్యతిరేకించే వారిని విలన్లగా భావించి నోరు పారేసుకుంటూ ఉంటారు. దీంతో రివర్స్ అటాక్‌కు గురై తట్టుకోలేక యుద్ధశంఖారావం పేరుతో ఆర్తనాధాలు చేస్తూ వుంటారు.
పాపం అవతల తన ప్రత్యర్థులు యుద్ధతంత్రాల్లో ఆరితేరిన వారని తెలియదు. తాట తీస్తా, తోలు తీస్తా, లాక్కొచ్చి కొడతా అని పవన్ మాటల్లో చెబితే, ప్రత్యర్థులు మాత్రం ఆచరిస్తుంటారు. పవన్‌కు, ఆయన ప్రత్యర్థులకు తేడా అదే. ఇప్పటికైనా పవన్ తాను ఎవరిపై యుద్ధం చేయాలో గ్రహిస్తే… అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది.