పవన్ కళ్యాణ్ గారిని మంత్రి పేర్ని నాని, నటుడు పోసాని కృష్ణమురళి లెక్కలేనట్టుగా మాట్లాడడం వారి అవివేకం.
పవన్ గారిలో అవతారపురుషుడు లక్షణాలు కనిపిస్తాయి. వాటిని గుర్తిస్తే ఎవరూ ఆయన గురించి చెడుగా మాట్లాడే ధైర్యం చేయరు.
అయితే ఆ లక్షణాలు ఒక్క పవన్ కల్యాణ్ గారికి తప్ప ఇంకెవరికీ కనపడకపోవడం అశేష భారత, రష్యన్ దేశవాసుల దౌర్భాగ్యం.
అందుకే అందరికీ కళ్లు తెరిపించేలాగ ఆయనే ఆయనలోని అవతార లక్షణాలని వేదిక మీద చెప్పుకుంటున్నారు.
ఒక్కోక్కటీ విశ్లేషించుకుందాం.
స్థిత ప్రజ్ఞత:
శ్రీకృష్ణుడు గీతలో చెప్పిన స్థితప్రజ్ఞతకి కేరాఫ్ అడ్రస్ గా తనని తాను అభివర్ణించుకున్నారు పవన్ కళ్యాణ్.
“నేను యోగ మార్గం నుంచి వచ్చాను. నాకేవీ అంటవు” అని చెప్పి తనని ఎవరు ఏం తిట్టినా కూర్చుని వలవలా ఏడుస్తానని అనుకోవద్దన్నారు.
“ఔనా!” అని ఆశ్చర్యపడే లోపే “ఎవడ్నీ వదిలిపెట్టను, అందర్నీ గుర్తు పెట్టుకుంటా. తాట తీసి మోకాళ్ల మీద నిలబెడతా. తోలు తీస్తా” అని ఊగిపోయారు.
యోగ మార్గంలో ఇలా పేట్రేగిపోమని ఉందా? అదేం యోగ మార్గమో మరి!! ఈ కొత్త అవతారమూర్తికే తెలియాలి.
మహిళా మాన సంరక్షకుడు:
2024లో తన ప్రభుత్వం రావడం ఖాయమని, తాను ముఖ్యమంత్రయ్యాక శాంతిభద్రతలంటే ఏంటో చూపిస్తానని చెబుతూ, ఒక మగాడు ఆడిదానివంక కన్నెత్తి చూడాలంటేనే భయపడేలా చేస్తానన్నారు.
బహుశా వారు గతంలో చెప్పినట్టే రేపిస్టులని స్కూల్లో టీచరు కొట్టినట్టు రెండు బెత్తం దెబ్బలు కొడితే మాగాళ్లందరికీ తడిసిపోయి ఇక ఆడవాళ్లని కన్నెత్తి చూడరేమో.
అంతేనో, లేకపోతే తాలిబన్ చట్టాన్ని తెచ్చేస్తారో!
లేక, తనకి తప్ప అలా చూసే హక్కు ఇంకెవ్వరికీ లేదని చట్టం తీసుకొస్తారో!
రజోగుణ సంపన్నుడు:
“బిహార్ నుంచి గ్యాంగుల్ని రప్పించుకోండి. రండి. మీరా, మేమా తేల్చుకుందాం” అని బస్తీమే సవాల్ టైపులో వైసీపీ శ్రేణుల్ని యుద్ధానికి పిలవడమంటే అది రజోగుణాన్ని చాటుకోవడమే.
“మనలాంటి వాళ్లని వీళ్లు చూడలేదు. తోలు తీసేస్తాం” అని చెబుతూ జనసైనికుల కరతాళధ్వనుల మధ్య ప్రజాస్వామ్య పద్ధతిలో అందరికీ శిక్షలేస్తామని చెప్పారు.
“తోలు తీయడం” బహుశా అవతారమూర్తి లెక్కలో ప్రజాస్వామ్య పద్ధతే కాబోలు.
కులాతీతుడు:
తనకు కులాల గురించి మాట్లాడడం చిరాకని ఈ మధ్య ఒక వేదిక మీద చెప్పారు. ఇది చెప్పిన నాలుగు రోజుల్లోనే కమ్మ, కాపు, బలిజ, దళిత, బోయ, రెల్లి..ఇన్ని కులాల ప్రస్తావన ఈ రోజు మీటింగులో తీసుకొచ్చారు.
వాళ్లకి రాజకీయాల్లో స్థానం కావాలని గొంతెత్తారు (అక్కడికి ఇప్పుడు లేనట్టు).
ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాటగరీల్లో నియోజకవర్గాలు కేటాయించి రాజ్యాంగం ఎప్పుడో ఆ సమన్యాయం చూపించింది.
ఇప్పుడు కొత్తదేవుడు తీసుకొచ్చే సరికొత్త రాజకీయ సమన్యాయం ఏమిటో?
రెల్లి కులస్థుడు తనను కౌగిలించుకోవడానికి దగ్గరికొస్తే, “నేను నీ కులంలో పుట్టలేదు కానీ, నన్ను నీ సోదరుడిగా అనుకో” అని అన్నానని చెప్పుకున్నారు.
కాసేపట్లోనే, “నాకు అగ్రకులాలంటే గౌరవం” అన్నారు.
ఇంతకీ వీరికి మొత్తం కులాలంటే చిరాకా? అగ్రకులాలంటే గౌరవమా?
ఆయన భక్తులు దీనికి భాష్యం రాయొచ్చేమో గానీ, సగటు వోటరు మాత్రం బుర్రగోక్కుంటూ చూడాలి అయ్యవారి ఆంతర్యమేమిటో బోధపడక.
నిస్వార్థ జీవి:
“వోట్లన్నీ వైసీపీకి వేసి నన్ను పనిచెయ్యమంటే ఎలా? అయినా చేస్తా” అన్నారు.
పవరివ్వకున్నా పని చెయ్యాలంటే ఎంత పవరుండాలి!
నిజమే.
రాష్ట్రమంతా అడిగేసారు కదా ఈ అవతారమూర్తిని వైజాగ్ స్టీల్ కోసం పోరాడమని!
“ఢిల్లీలో బలవంతుడైన ప్రధానిని ఏదైనా అడగాలంటే సాహసం ఉండాలి, అయినా ధైర్యంచేసి నిస్వార్థంగా అడిగా”నంటూనే, ఆయనకి తనంటే ఎంతో ఇష్టమని చెప్పారు. ఇష్టమైన వ్యక్తిని ఆడగడం సాహసమెందుకవుతుందో?!
మళ్లీ సగటు వోటరుకి అర్థం కాక ఈ సారి బుర్ర కాకుండా ఇంకోటేదో గోక్కుంటున్నాడు.
నిరాడంబరుడు
హైదరాబాదులో నేటి ఖరీదైన ప్రాంతంలో ఎకరం లక్ష రూపాయలున్నప్పుడు తను సినిమాల్లో కోటి పారితోషకం తీసుకునే వారట. ఒకవేళ స్థలాలు కొనుంటే ఈ పాటికి వేల కోట్ల అధిపతి అయ్యుండేవాడినని, కానీ చెయ్యలేదని చెప్పారు.
దానికి కారణం కూడా చెబుతూ ఆస్తులుంటే పోతాయేమోనని భయం పెరుగుతుందని అటువంటి భయాలు తనకు పడవని చెప్పారు అవతార పురుషుడు.
మరి కేసీయార్ గారు “నిన్ను టుకడా టుకడా చేస్తాం” అంటే “ఓరేయ్ సన్నాసి! నువ్వేం చేస్తావురా. నేనే నీ తాట తీసి మోకాళ్ల మీద నిలబెడతా” అని తిరగబడకుండా నోరు మూసుకుని కూర్చోవడానికి గల కారణం ఏంటి? హైదరాబాదులో ఆస్తుల మీద మమకారం అవునో కాదో మిస్టర్ అవతార్ గారే చెప్పాలి.
భవిష్య కాలజ్ఞాని:
2024 లో జనసేన ప్రభుత్వం వచ్చేస్తోందని, వైసీపీకి 151 కి చివరి 1 పోయి 15 సీట్లే మిగుల్తాయని సంఖ్యాశాస్త్రంతో కలగలిపిన కాలజ్ఞానం చెప్పారు.
ఏం చూసుకుని జనాలు గెలిపించాలి జనసేనని?
మంత్రిని “సన్నాసి” అన్నందుకా? సన్నాసిన్నర అని అనిపించుకున్ననందుకా?
పోసాని తిట్టినందుకా? పోసానిని కొట్టడానికి ఫ్యాన్స్ మీదికొచ్చినందుకా?
స్పీచులు దంచినందుకా? గెడ్డం పెంచినందుకా?
జనానికి జనసేన-టీడీపీ పొత్తు నచ్చినందుకా? లేక వారికి వైసీపీ వెల్ఫేర్ స్కీములు నచ్చనందుకా?
వీటికి సమాధానాలు కూడా అయ్యవారు చెప్పరు, భక్తులే భాష్యాలు రాయాలి.
ధర్మ స్థాపనాకారుడు:
“ఇన్నాళ్లూ కౌరవ సభ చూసారు. 2024లో గెలిచి పాండవసభ చూపిస్తా” అన్నారు.
అంటే తాను గెలిస్తేనే, తాను ముఖ్యమంత్రి అయితేనే ధర్మం నాలుగు కాళ్ల మీద నడుస్తున్నట్టు. లేకపోతే అధర్మం తాండవించెస్తున్నట్టే.
తనను తాను శ్రీకృష్ణపరమాత్ముడు టైపులో బిల్డప్పిచ్చేసుకుని స్వప్నమేఘాల్లో విహరిస్తున్న ఈ పౌండ్రకవాసుదేవుడు నేటి అవతారపురుషుడు.
ఈ సందర్భంగా అవతారమూర్తికి, వారి భక్తులకి తెలుగు, మరాఠి, రష్యన్, పంజాబీ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో నమస్కారాలు.
ఈ వ్యాసాన్ని చదివినా, విన్నా, చదివించినా తాటికాయంత పుణ్యం, టెంకాయంత పురుషార్థం కలుగుతాయి.
– రాంబాబు పి