ఇసుక కొరతపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ మండిపడ్డారు.
శనివారం విశాఖపట్నం వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఇసుక కొరత లేదని తాము ఎక్కడా చెప్పలేదని.. ఇసుక కృత్రిమ కొరత సృష్టించామని ప్రతిపక్షాలు మాట్లాడటం దారుణంగా ఉందన్నారు.
వరదల సమయంలో ఇసుక తీయడం ఎంత కష్టమో ఐదు కోట్ల ప్రజలకు తెలుసునన్నారు.
పవన్ కల్యాణ్ లాంగ్ మార్చ్‌కి ఇసుక డాన్ అచ్చెన్నాయుడు టీడీపీ తరపున ముఖ్య అతిథిగా వస్తున్నారనడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు.
మీరు లాంగ్ మార్చ్ చేసినా, పాకినా ప్రజలు విశ్వసించరన్నారు. ‘మీది లాంగ్ మార్చ్ కాదని.. షార్ట్ మార్చేనని… మీకు లాంగ్ అనే పదం సూట్ కాదని’ ఎద్దేవా చేశారు.
చంద్రబాబు ట్రాప్‌లో పవన్ ఎందుకు పడిపోయారో అర్థం కావటం లేదన్నారు. అక్రమ పోరాటాలను ప్రజలు విశ్వసించరన్నారు.
ఏపీ ప్రజల మేలు కోసం వైఎస్ జగన్ ఎన్నో సంక్షేమ పథకాలు చేపడుతున్నారన్నారు. భవన కార్మికులకి ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని, ఇసుక కొరత తాత్కాలికమేనని అమర్‌నాథ్ తెలిపారు.