అనుకున్నంత అయింది. కార్మికులు భయపడినంత జరిగింది. ఆర్టీసీని పాక్షికంగా ప్రైవేటీకరణ చేస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా 5100 ప్రైవేట్ బస్సులకు రూట్ పర్మిట్లు ఇచ్చారు. మంత్రివర్గ సమావేశంలో ఆర్టీసీ సమ్మెపై సుదీర్ఘంగా చర్చించిన ముఖ్యమంత్రి.. ప్రైవేట్ బస్సులకు పర్మిట్లు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించినట్టు ప్రకటించారు. హైకోర్టు సూచనల్ని కూడా పరిగణనలోకి తీసుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు ముఖ్యమంత్రి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయకూడదని కేబినెట్ నిర్ణయించినట్టు తెలిపారు.
అయితే కార్మికులు భయపడినట్టు పూర్తిస్థాయిలో ఆర్టీసీ నష్టాల్లో మునిగిపోదన్నారు కేసీఆర్. పల్లెవెలుగు బస్సులు తిరిగే రూట్లలో మాత్రమే ప్రైవేట్ ట్రావెల్స్ కు పర్మిట్లు ఇస్తామని, లాభాలు బాగా వచ్చే రూట్లలో ఆర్టీసీ బస్సులే తిరుగుతాయని స్పష్టంచేశారు. పోటీతత్వం ఉండేలా ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యాలతో ఆర్టీసీ బస్సులు తిరుగుతాయన్నారు. దీనికి సంబంధించి ఓ టాస్క్ ఫోర్స్ ఏర్పాటుచేయబోతున్నామని తెలిపిన కేసీఆర్.. టిక్కెట్ ధరల నియంత్రణ, పర్మిట్లు, బస్సుల ఫిట్ నెస్ ల వ్యవహారాల్ని ఆ టాస్క్ ఫోర్స్ చూసుకుంటుందని తెలిపారు. ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ పనిచేస్తుందన్నారు.
ఈ సందర్భంగా కార్మికులకు మరో ఛాన్స్ ఇస్తున్నారు కేసీఆర్. ప్రస్తుతం సమ్మె చేస్తున్న కార్మికులంతా 5వ తేదీ అర్థరాత్రి లోపు తమ విధుల్లోకి చేరాలని అల్టిమేటమ్ ఇచ్చారు. ఇచ్చిన గడువు లోగా కార్మికులు విధుల్లోకి చేరకపోతే మిగతా రూట్లలో కూడా ప్రైవేట్ బస్సులకు పర్మిట్లు ఇస్తామని హెచ్చరించారు. కేబినెట్ నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదని, కోర్టులు కూడా కలుగజేసుకోలేవన్నారు కేసీఆర్. బేషరతుగా ఉద్యోగాల్లో జాయిన్ అయిన కార్మికుల ఉద్యోగాల్ని, భవిష్యత్తుని ప్రభుత్వం కాపాడుతుందని హామీ ఇచ్చారు.
ఈ మొత్తం వ్యవహారంలో కార్మిక యూనియన్లే విలన్లు అన్నారు కేసీఆర్. ఉద్యోగుల్ని తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. 67 శాతం జీతాలు పెంచిన తర్వాత కార్మికుల్ని సమ్మెకు ఉసిగొల్పారని, సమ్మె సందర్భంగా సంభవించిన మరణాలకు యూనియన్లే బాధ్యత వహించాలన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం సాధ్యంకాదని మరోసారి స్పష్టంచేశారు కేసీఆర్.
ఆర్టీసీ అనేది ఓ కార్పొరేషన్ అని, దాన్ని ప్రభుత్వంలో విలీనం చేస్తే.. రాష్ట్రంలో ఉన్న దాదాపు 50 కార్పొరేషన్ల నుంచి సమస్యలు వస్తాయన్నారు. మిగతా కార్పొరేషన్ ఉద్యోగులు కూడా తమను ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తారని, అది సాధ్యం కాదన్నారు. ఇప్పుడు ప్రభుత్వాన్ని తప్పుబడుతున్న కోర్టులే, రేపు మిగతా కార్పొరేషన్లను కూడా ప్రభుత్వంలో విలీనం చేయాలని ఆదేశాలిస్తాయని అన్నారు. ప్రస్తుతం కార్మికులు చేస్తున్న సమ్మె అన్యాయమని, ఎంత తొందరగా సమ్మె ముగిస్తే వాళ్లకు అంత మంచిదన్నారు.
కేసీఆర్ తాజా అల్టిమేటంతో సమ్మె చేస్తున్న కార్మికులు డైలమాలో పడ్డారు. కేబినెట్ తీసుకున్న తాజా నిర్ణయాలపై యూనియన్లు ఎలా స్పందిస్తాయో చూడాలి.