బిగ్ బాస్ విన్నర్ రాహుల్.. ఈ లీక్ నిజమౌతుందా?

బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ ఎవరో తెలిసిపోయింది. రేపు రాత్రికి రావాల్సిన ఈ రిజల్ట్ లీకుల రూపంలో కొన్ని గంటల నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బిగ్ బాస్ సీజన్ 3…

బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ ఎవరో తెలిసిపోయింది. రేపు రాత్రికి రావాల్సిన ఈ రిజల్ట్ లీకుల రూపంలో కొన్ని గంటల నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బిగ్ బాస్ సీజన్ 3 మొదలైనప్పట్నుంచి లీకులు వస్తూనే ఉన్నాయి. ఆ లీకులకు తగ్గట్టుగానే ఎలిమినేషన్స్ కూడా జరుగుతున్నాయి. అలా లీకుల ప్రకారం చూసుకుంటే.. ఈరోజు ఎపిసోడ్ లో అలీ రెజా ఎలిమినేట్ కానున్నాడు. రేపటి ఫైనల్ ఎపిసోడ్ లో రాహుల్ సిప్లిగంజ్ బిగ్ బాస్ విన్నర్ గా, శ్రీముఖి రన్నరప్ గా నిలుస్తారు.

షో ప్రారంభం నుంచి బద్దకంగా కనిపిస్తూ వచ్చాడు రాహుల్ సిప్లిగంజ్. మరీ ముఖ్యంగా పునర్నవితో రాసుకుపూసుకు తిరిగాడు. ఒకదశలో అతడు పూర్తిగా గేమ్ ను పక్కనపెట్టాడని, కేవలం పునర్నవిపైనే ఫోకస్ పెట్టాడంటూ సెటైర్లు కూడా పడ్డాయి. దానికి తగ్గట్టే షోలో దాదాపు 10 సార్లు ఎలిమినేషన్ రౌండ్ కు నామినేట్ అయ్యాడు రాహుల్. అదృష్టం ఏంటంటే.. ప్రతి ఎలిమినేషన్ రౌండ్ లో బయటపడుతూ వచ్చాడు. అలా పడుతూలేస్తూ ఫైనల్ గా టైటిల్ విన్నర్ అవ్వబోతున్నాడు రాహల్.

టైటిల్ పోరులో బాబా భాస్కర్, అలీ రెజా, వరుణ్ సందేష్, శ్రీముఖి, రాహుల్ నిలిచారు. ఇంతకుముందే చెప్పుకున్నట్టు వీళ్ల నుంచి అలీ రెజాను తీసేస్తే, మిగిలిన నలుగురు కంటెస్టంట్ల మధ్య పోటీ గట్టిగా నిలిచింది. వీళ్లలో రాహుల్, శ్రీముఖికి సమానంగా ఓట్లు వచ్చాయట. అయితే ఓటింగ్ ముగియడానికి కొన్ని గంటల ముందు రాహుల్ కు విపరీతంగా ఓట్లు పడినట్టు తెలుస్తోంది. అలా ఆఖరి నిమిషంలో రాహుల్ సిప్లిగంజ్ బిగ్ బాస్ విన్నర్ గా నిలిచాడు.

ఈ షో ప్రారంభమైన కొత్తలో వరుణ్ సందేష్ బిగ్ బాస్ విన్నర్ అవుతాడని అంతా అనుకున్నారు. ఆ తర్వాత శ్రీముఖి జోరు చూసి ఆమె విన్నర్ అవుతుందని అనుకున్నారు. మధ్యలో బాబా భాస్కర్  బిహేవియర్ చూసి విన్నర్ అయ్యే లక్షణాలన్నీ ఇతడిలో ఉన్నాయనుకున్నారు. ఫైనల్ గా షోలో బద్ధకస్తుడిగా పేరుతెచ్చుకున్న రాహుల్ విన్నర్ గా నిలిచాడన్నమాట. ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తున్న లీకులే నిజమైతే.. రాహుల్ అభిమానులకు రేపు పండగే.