హిందూ, ముస్లింల మధ్య చిచ్చుపెట్టాలని చూసే నాయకులే దేశ రాజకీయాల్లో పాకిస్తాన్ ప్రస్తావన తెస్తారు. గతంలో ఇలాంటివారిని చాలామందినే చరిత్ర చూసింది.
అయితే ఏపీ రాజకీయాల్లో కూడా పాకిస్తాన్ విషయాన్ని ఉదాహరణగా చూపే ఓ వ్యక్తి వస్తారని ఎవరూ ఊహించలేదు. అలాంటి పని చేసిన పవన్ ని ఎవరూ క్షమించరు కూడా.
పాకిస్తాన్ ముస్లిం దేశం. అక్కడ హిందువులు మైనార్టీలు. సహజంగానే మైనార్టీలపై దాడులు జరిగితే ప్రభుత్వాలు రక్షణ కల్పిస్తాయి. కానీ పాక్ ప్రభుత్వానికి అంత మంచి బుద్ధి లేదు.
పాకిస్తాన్ లో హిందువుల ఆలయాలపై దాడులు జరిగితే అక్కడి ప్రభుత్వాలు రక్షణ కల్పించిన ఉదాహరణలు ఎక్కడా లేవు. ఒకవేళ పాక్ ప్రభుత్వం హిందువులకు రక్షణ కల్పిస్తున్నట్టు వార్తలొస్తే.. అది పాక్ మీడియా కల్పితం కాక ఇంకేమీ కాదు.
మరి పవన్ కల్యాణ్ కి ఏ పాకిస్తాన్ ఏజెంట్ సమాచారం అందించాడో తెలియదు కానీ, అక్కడ హిందూ ఆలయాలను ధ్వంసం చేస్తే 45 మందిని ప్రభుత్వం అరెస్ట్ చేసిందట, అంతే కాదు పునర్నిర్మాణ బాధ్యతల్ని కూడా ప్రభుత్వమే స్వీకరించిందట.
ఆ ఉదాహరణను ఏపీకి ముడిపెడుతూ పవన్ కల్యాణ్ భలే పాయింట్ రైజ్ చేశారు. పాకిస్తాన్ పాటి చర్యలు తీసుకోలేదా జగన్ సర్కారు అంటూ రెచ్చిపోయారు.
అసలింతకీ పవన్ సమస్య ఏంటి? జనాల్ని వదిలేసి తనపాటికి తాను సినిమాలు చేసుకుంటున్నారు కదా? పోనీ చంద్రబాబు హయాంలో విజయవాడ చుట్టుపక్కల జరిగిన ఆలయ విధ్వంసాలపై కూడా పవన్ గతంలో ప్రశ్నించి ఉంటే.. ఇప్పుడాయన్ని నిఖార్సయిన మనిషి అనుకుని ఉండేవారు.
అప్పుడు ప్రభుత్వమే ఆలయాలు కూలదోస్తే పవన్ నోరు మెదపలేదు, ఇప్పుడు ఎవరో చేసిన తప్పుకి ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు, పాకిస్తాన్ తో పోల్చి మరీ ఎగతాళి చేస్తున్నారు. రోజు రోజుకీ దిగజారిపోతున్న పవన్ మాటల్ని ఎవరైనా ఎందుకు లెక్కలోకి తీసుకుంటారు చెప్పండి.
బీజేపీకి కోపం తెప్పించిన పవన్..
పాకిస్తాన్ మాట అంటేనే బీజేపీకి కోపం. అందులోనూ పాక్ ప్రభుత్వాన్ని పొగుడుతూ మన పవన్ కల్యాణ్ స్టేట్ మెంట్లు ఇచ్చేస్తున్నారు.
జగన్ పై అక్కసు వెళ్లగక్కాలనుకోవడం వరకు ఓకే, అదే సమయంలో పాకిస్తాన్ ని వెనకేసుకు రావడం ఎంతవరకు కరెక్ట్. బీజేపీ కేంద్ర నాయకత్వం కూడా ఇదే విషయంలో పవన్ పై ఆగ్రహం వ్యక్తం చేసిందట. బీజేపీ కోపం సంగతి పక్కనపెడితే.. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు మరీ శృతిమించిపోతున్నాయనే విషయం ఏపీ ప్రజలకు కూడా అర్థమవుతోంది.