అసలు వివాదానికి కారణం ఏంటి? పోసాని ఆవేశపడ్డానికి రీజన్ ఎవరు? ముందుగా తిట్టింది ఎవరు? వీటన్నింటికీ మూలకారణం పవన్ కల్యాణ్. సినిమా ఫంక్షన్ లో సదరు సినిమా గురించి తప్ప మిగతా విషయాలన్నీ మాట్లాడారు పవన్ కల్యాణ్. ఆయన ''సన్నాసి'' అనే పదప్రయోగం వాడిన తర్వాతే, వైసీపీ నేతల దృష్టిలో ''వెధవన్నర వెధవ'' అయ్యారు. ఇవన్నీ మరిచిపోయిన పవన్ ఇప్పుడు తానేదో పతివ్రతుడ్ని, తనను కావాలనే రెచ్చగొట్టారు అనే విధంగా మాట్లాడ్డం జబర్దస్త్ కామెడీని తలపించింది.
మంగళగిరిలో కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన పవన్.. సూటిగా మాట్లాడతానంటూ సొల్లు చెప్పారు. వివాదానికి కారణమైన టికెట్ల ఇష్యూపై ఆయన సూటిగా స్పందించలేదు. అసలు స్పందించలేదు అనడం కరెక్ట్. పోసాని అడిగిన ప్రశ్నలపై ఆయన రియాక్ట్ అవ్వలేదు.
మంత్రి పేర్ని నాని సంధించిన వసూళ్ల లెక్కలపై క్లారిటీ ఇవ్వలేదు. చివరికి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ''పంజాబీ అమ్మాయి'' పై కూడా పవన్ నోరు మెదపలేదు. ఇన్ని కీలకమైన అంశాల్ని వదిలిపెట్టి ఏకంగా 2 గంటల పాటు ప్రసంగించారు. ఏం మాట్లాడారంటే అంతా సొల్లు అని మాత్రమే చెప్పక తప్పడం లేదు.
ఎన్నో ఆశలతో టాలీవుడ్ కొచ్చి ఓ ''స్టార్ హీరో'' చేతిలో మోసపోయిన పంజాబీ అమ్మాయికి న్యాయం చేయమని పోసాని డిమాండ్ చేశారు. దానిపై పవన్ కల్యాణ్ స్పందించలేదు. తనపై వ్యక్తిగత దాడికి దిగొద్దని ఫ్యాన్స్ కు పవన్ చెప్పాలని పోసాని డిమాండ్ చేశారు. దానిపై కూడా పవన్ కల్యాణ్ స్పందించలేదు.
కనీసం చిరంజీవి కూతురుపై గతంలో జరిగిన వివాదాస్పద ఘటనకు సంబంధించి పోసాని చేసిన వ్యాఖ్యలపై కూడా పవన్ మాట్లాడలేదు. చివరికి టిక్కెట్ రేట్లు తగ్గింపు, ఆన్ లైన్ టిక్కెట్ వ్యవస్థపై కూడా సూటిగా స్పందించలేకపోయారు జనసేనాని.
“నా సంపాదనపై కన్నేశారు. నా సంపాదనను తగ్గించడానికి చూస్తున్నారు. ఇండస్ట్రీకి మంచి చేయమని నేను అడిగితే నా సంపాదన మీకు ఎందుకు? అవసరమైతే నా సినిమాను నేను ఉచితంగా చూసేలా రిలీజ్ చేసుకోగలను. ఇండస్ట్రీతో నాకు సంబంధం లేదు. ఒక మనిషి ఆర్జించే హక్కును మీరు ఎలా అడ్డుకుంటారు”
ఇలా పొంతన లేకుండా మాట్లాడారు పవన్ కల్యాణ్. తన సుదీర్ఘ ప్రసంగంలో మరోసారి సన్నాసి అనే పదాన్ని విరివిగా వాడిన పవన్ కల్యాణ్.. తను కవ్వించలేదని, వైసీపీ నేతలే తనను యుద్ధానికి రమ్మని పిలిచారంటూ వాదించుకున్నారు. ఇన్నాళ్లూ తను రాజకీయ నాయకుడిగా కాకుండా, ఓ సామాజిక కార్యకర్తలా పనిచేశానని, ఇకపై తన నుంచి అసలైన రాజకీయం చూస్తారంటూ స్టేట్ మెంట్ ఇచ్చుకున్నారు. తన ప్రసంగంలో మరోసారి అగ్రభాగాన్ని ''కులం కంపు''కు కేటాయించారు.
పనిలో పనిగా ప్రత్యేక హోదా గురించి కూడా మాట్లాడారు పవన్. స్పెషల్ స్టేటస్ కు సంబంధించి తనపై జరుగుతున్న ట్రోలింగ్ కు అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో మరోసారి నెపాన్ని జనంపై నెట్టేశారు. గతంలో ''మీకు బుద్ధిలేదు'' అంటూ చంద్రబాబు, జనాల్ని ఎలాగైతే తిట్టారో.. దాదాపు అదే అర్థం వచ్చేలా జనంపై విసుర్లు విసిరారు పవన్. తనను 2 చోట్ల ఓడించి, పని చేయమంటే ఎలా అంటూ ప్రశ్నించారు.
“ప్రత్యేక హోదా కోసం ఒకప్పుడు నేను బలంగా నిలబడ్డాను. నేను హోదా కోసం ముందుకెళ్తుంటే, ఎవరైతే నాకు అండగా ఉండాలో వాళ్లే నా ముందరి కాళ్లకు బంధం వేశారు. హోదా కోసం కేంద్ర ప్రభుత్వంతో గొడవ పెట్టుకున్నాను, అది చాలా పెద్ద సాహసం. అది కూడా బలమైన ప్రధాన మంత్రితో పెట్టుకున్నాను. మోదీ మామూలు వ్యక్తి కాదు. తెలిసి కూడా ఆయనతో పెట్టుకున్నాను. కానీ జనం నాతో నిలబడలేదు. కనీసం నన్ను వైజాగ్ లోనైనా గెలిపించుకొని ఉంటే స్టీల్ ప్లాంట్ కోసం బలంగా నిలబడేవాడ్ని. కానీ నన్ను ఓడించారు. స్టీల్ ప్లాంట్ కోసం ఎలా పోరాడాలి చెప్పండి.”
ఇలా స్టీల్ ప్లాంట్ ఉద్యమాన్ని కూడా నీరుగార్చేశారు పవన్ కల్యాణ్. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు, రెండు కాదు.. జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి ఎన్నో విషయాలు చెప్పుకుంటూ వచ్చారు పవన్. కానీ అసలు వివాదానికి కారణమైన అంశాల్ని మాత్రం ఆయన టచ్ చేయకపోవడం విశేషం. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో కచ్చితంగా గెలుస్తామని, వైసీపీని అడ్డుకుంటామని ప్రకటించి కార్యకర్తల్లో ఉత్సాహం నింపిన పవన్ కల్యాణ్.. 2009లో మాటిచ్చి నిలబడలేకపోయానని, చేసిన పొరపాట్లకు క్షమించాల్సిందిగా వేడుకున్నారు.
మొత్తంగా చూసుకుంటే, ప్రస్తుతం తన చుట్టూ తిరుగుతున్న వివాదాస్పద అంశాలపై స్పష్టత ఇచ్చే ప్రయత్నం మాత్రం చేయలేదు పవన్ కల్యాణ్. ఈసారి ఆయన వైసీపీకి చెందిన నేతల పేర్లతో పాటు, పోసాని పేరు కూడా ఉచ్ఛరించలేదు. బాలకృష్ణ ప్రసంగంలా ఎక్కడో స్టార్ట్ చేసి, ఏదో మాట్లాడి, ఇంకెక్కడో ముగించారు. మరోసారి మంచి మాటకారి అనిపించుకున్నారు.