ఎంత భయం లేకపోతే మాత్రం మరీ ఇన్ని సార్లు చెప్పుకోవాలా? భయపడను.. పోరడతా… నాకు సంస్కారం ఉంది.. కులాల వెనుక దాక్కొని రాజకీయం చేయను…. ఇదీ పవన్ కల్యాణ్ తాజా ప్రసంగం వరస. ఇదంతా వింటే.. పాత క్యాసెట్టే కదా.. అనిపిస్తే తప్పు విన్నవారిది కాకపోవచ్చు! తనకు భయం లేదని పవన్ కల్యాణ్ ఇప్పటికే చాలా సార్లు చెప్పారు. క్రీస్తు పూర్వం నుంచి ఇదే చెబుతున్నట్టుగా అనిపించవచ్చు.
ఏ రాజకీయ పార్టీ అధినేతా బహుశా ఇన్ని సార్లు ఈ విషయాన్ని చెప్పి ఉండరు. ఇంతకీ పవన్ కు భయముందని ఎవరన్నారో మరి. తనకు భయం లేదని, లేనే లేదని పవన్ కల్యాణ్ పదే పదే పదే చెప్పుకుంటూనే ఉన్నారు!
ఇక తన తల్లిదండ్రులు తనకు సంస్కారం నేర్పించారని కూడా పవన్ కల్యాణ్ ఇప్పటికే కొన్ని వందల సార్లు చెప్పి ఉండవచ్చు. బహుశా ఎంత సంస్కారం నేర్చుకున్న వాళ్లు కూడా ఇన్ని సార్లు తాము సంస్కారం నేర్చామని చెప్పి ఉండరు.
పవన్ కల్యాణ్ మాత్రం అంత సంస్కారం నేర్చినట్టుగా ఉన్నారు. మరి ఈ సంస్కారం అనే మాటకు బోలెడన్ని నిర్వచనాలు ఉంటాయి. మూడు సార్లు పెళ్లి చేసుకోవడం కూడా ఈ తరంలో కుసంస్కారమే! ఇక అవతలి వారి కులాల గురించి పదే పదే మాట్లాడటం కూడా కుసంస్కారమే.. మరి ఈ సంస్కారాన్ని పవన్ కు వాళ్లింట్లో వాళ్లు నేర్పలేదేమో పాపం!
ఇక కులాల వెనుక దాక్కొని తను రాజకీయం చేయనని కూడా పవన్ కల్యాణ్ ఇంకోసారి ప్రకటించుకున్నారు! ఈయన సుదీర్ఘ ప్రసంగాలు ఏనాలుగైదు నెలలకో ఒకసారి చేస్తే.. ఆ రోజు తప్పకుండా కుల ప్రస్తావన ఉంటుంది. అవతలి వారి కులం గురించి అయినా, అది తన కులం గురించి అయినా పవన్ కల్యాణ్ బోలెడన్ని సార్లు ప్రస్తావిస్తారు.
ఆఖరికి ఒక సినిమా ఫంక్షన్ కు వెళ్లి అక్కడ కులం గురించి మాట్లాడటం, పేరులో తన కులాన్ని ఇండికేట్ చేసుకోని ఒక నిర్మాతను ఉద్దేశించి ఆయన కులం ప్రస్తావన తీసుకురావడం, ముఖ్యమంత్రిని కులం పేరుతో ప్రస్తావించడం.. ఇవన్నీ కుల రాజకీయం కాదు! జస్ట్ అలా అనుకోవాలంతే!
ఇక నాకు థియేటర్లు లేవు, సిమెంట్ ఫ్యాక్టరీలు లేవు, లక్ష కోట్లు సంపాదించలేదు.. అంటూ మరో ఊకదంపుడు ప్రసంగాన్ని కూడా పవన్ అందుకున్నారు. తమ కష్టార్జీతం గురించి ప్రభుత్వం పెత్తనం ఏమిటని ప్రశ్నించారు! మరి ఈ లాజిక్కేమిటో మరి. సినిమా టికెట్లను ఆన్ లైన్ చేస్తామంటే..అందులో పవన్ కల్యాణ్ కష్టార్జీతం ఎలా వచ్చిందో!