ఏ వ్యవహారాన్ని అయినా తన కన్వీనెంట్ కొద్దీ మార్చుకుంటూ… సాగిపోతున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్! అది కూడా అంతా ఏకపాత్రాభినయమే! ఈ ఏకపాత్రాభినయంతో పవన్ కల్యాణ్ రాజకీయంగా ఎప్పటికి తటస్థుల మద్దతును పొందుతారు? అనేది శేషప్రశ్న.
ఇప్పుడు పవన్ మరో విద్యను కూడా నేర్చారు. మొగ్గుని కొట్టి మొగసాలకు ఎక్కినట్టు అనే సామెతను గుర్తు చేస్తున్నారు. తనే అడ్డగోలుగా మాట్లాడటం, అవతలి వారిని కించపరచడం, మళ్లీ తనపై మాటల యుద్ధానికి వచ్చారని చెప్పడం! ఈయన తీరు చూస్తే.. తన పిచ్చివాగుడు తను వాగుతాను, తన జోలికి ఎవ్వరూ రావొద్దన్నట్టుగా ఉంది!
ఇక తన గురించి తను చెప్పుకునే స్వోత్కర్ష కూడా పవన్ కు ఇంకా తీరలేదు. జనసేన ఆవిర్భావం నుంచి చెబుతూనే ఉన్నాడు. తను, తన సంస్కారం, తను పాటించే రాజకీయ విలువలు, తన ఆదర్శాలు… ఇవన్నీ చాలా వినేశారు సామాన్య ప్రజలు కూడా. అయితే పవన్ కల్యాణ్ కు ఇంకా తనివితీరడం లేదు. తను పుట్టి పెరిగిన పరిస్థితుల గురించి, వివిధ సంఘటనలు తమ జీవితాలను ప్రభావితం చేయడం గురించి కొందరు విజేతలకు చెప్పాలనిపిస్తూ ఉంటుంది. అందుకే వారు బయోగ్రఫీస్ రాయిస్తూ ఉంటారు, ఆటోబయోగ్రఫీస్ రాసుకుంటూ ఉంటారు.
తమ గురించి తాము చెప్పదలుచుకున్న దాన్ని చెప్పడానికి తగిన వేదికలు దొరక్క.. వారు పుస్తకాల రచనకు పూనుకుంటూ ఉంటారు. పవన్ కల్యాణ్ కూడా అలాంటి ప్రయత్నం ఏదైనా చేయొచ్చు, అంతే కానీ ఒక రాజకీయ పార్టీ పెట్టి.. నేను, నా సంస్కారం, నా విలువలు.. అంటూ రోజూ అదే కథ చెప్పడం ఏమిటో మరి.
అలా అని పదే పదే సంస్కారం, వ్యక్తిత్వం, విలువలూ అనే పవన్ నడవడికలో అలాంటివి ఏమైనా కనిపిస్తున్నాయా? అంటే.. ఆయన చెప్పే నిర్వచనాలకు ఆయన తీరే సెట్ కాదు! ఎర్రజెండా నుంచి కాషాయజెండా వైపు టర్న్ కావడం.. ఒక్కటీ చాలూ పవన్ కల్యాణ్ చెప్పే నీతులే ఆయనే పాటించరనేందుకు! అదొక్కటే కాదు.. 2009లో ప్రజారాజ్యంతో తెర మీదకు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకూ తను సాగించిన రాజకీయ జీవితం గురించినే పవన్ కల్యాణ్ చాలా సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే వాటికి ఆయన ఆన్సర్లు ఇవ్వరు. కానీ తను, తన విలువలూ, వ్యక్తిత్వం, రాజకీయ ఆదర్శలూ అంటూ పవన్ పదే పదే మాట్లాడుతుంటారు. ఇంతకీ పవన్ దృష్టిలో జనాలు ఏంటి?
తన గతంలో వ్యవహరించిన తీరును, అప్పుడు మాట్లాడిన మాటలనూ, ఇప్పుడు చెబుతున్న హరికథలనూ ప్రజలు గమనిస్తారు.. బేరీజు వేసుకుంటారు.. అనే కామన్ సెన్స్ పవన్ కు అస్సలు ఉండదా! అనే సందేహమూ కలుగుతుంది.
ప్రశ్నించేందుకు పార్టీ అనేది ఆయన చెప్పే ఆదర్శం. ఇప్పుడేమంటున్నారంటే తనను గెలిపించలేదు కాబట్టి పోరాడలేరట! ఇంతకీ పార్టీ పెట్టింది ఈ రెండింటిలో ఎందుకు? ఒకవైపు బీజేపీతో సావాసం చేస్తూ.. తనను గెలిపించి ఉంటే పోరాడేవాడనంటూ చెప్పుకోవడం తన చేతగాని తనాన్ని తనే హైలెట్ చేసుకోవడం కాదా!
చెప్పే నీతులు ఒక రేంజ్ లో ఉంటాయి, ఆచరించే తీరు మాత్రం అథమస్థాయిలో ఉంటుంది. పవన్ కల్యాణ్ ఎంత ఎక్కువ మాట్లాడితే.. ఆయనే అంతలా బుక్ అయిపోతూ ఉంటారు.