ఏపీ ప్రభుత్వం పై పవన్ కల్యాణ్ స్పందించిన తీరుపై మెగాస్టార్ చిరంజీవి చింతించారని మంత్రి పేర్ని నాని ప్రకటించారు. ఈ విషయంపై చిరంజీవి తనతో మాట్లాడారని, పవన్ వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేశారని నాని అన్నారు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలతో చిత్రపరిశ్రమకు సంబంధం లేదని చిరంజీవి అన్నారని మంత్రి వివరించారు.
తనతో సమావేశం అయిన సినీపరిశ్రమకు సంబంధించిన వ్యక్తులు కూడా.. పవన్ వ్యాఖ్యలతో ఇండస్ట్రీకి సంబంధం లేదన్నారని నాని చెప్పారు. పవన్ కల్యాణ్ కిరాయి కోసం పార్టీ పెట్టారని, పార్టీని ఒక టెంట్ హౌస్ మాదిరిగా అద్దెకు ఇస్తున్నారని నాని మరోసారి పవన్ పై విరుచుకుపడ్డారు.
ఇక ఈ వివాదం గురించి మంత్రితో సమావేశం అయిన వారిలో ఒకరనైన ప్రముఖ నిర్మాత దిల్ రాజు కూడా స్పందించారు. చిత్రపరిశ్రమను వివాదాల్లోకి లాగొద్దని ఆయన అన్నారు. సినిమా టికెట్ రేట్లను పెంచాలని తాము కోరినట్టుగా, ఈ అంశంపై గత సమావేశంలోనే మంత్రి సానుకూలంగా స్పందించినట్టుగా చెప్పారు.
ఈ విషయాన్ని తాము పరిశ్రమకు సరిగా వివరించలేకపోయామని, అందుకే ఈ పరిస్థితి తలెత్తిందని, అనుకోని పరిణామాలు జరుగుతున్నాయని రాజు వ్యాఖ్యానించారు. మొత్తానికి తనను ఇబ్బంది పెట్టడానికే పోర్టల్ తెస్తున్నారంటూ పవన్ కల్యాణ్ చెప్పుకున్న మాటకు ఇంటాబయట ఎక్కడా మద్దతు లభిస్తున్నట్టుగా లేదు!