పవనిజం: సూటిగా చెప్పరు.. సైలెంట్ గా ఉండరు!

సినీజనాలు చాలామటుకు ప్రెస్ నోట్స్ కే పరిమితమౌతారు. ఏదైనా అప్ డేట్ ఇవ్వాలంటే ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తారు. దాంతో పాటు ఓ చిన్న ఫొటో పడేస్తారు. చిన్న ప్రెస్ మీట్ పెట్టి నలుగురితో…

సినీజనాలు చాలామటుకు ప్రెస్ నోట్స్ కే పరిమితమౌతారు. ఏదైనా అప్ డేట్ ఇవ్వాలంటే ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తారు. దాంతో పాటు ఓ చిన్న ఫొటో పడేస్తారు. చిన్న ప్రెస్ మీట్ పెట్టి నలుగురితో కలుద్దామనే కాన్సెప్ట్ అస్సలు ఉండదు. ప్రచారం టైమ్ లో మాత్రం వద్దన్నా మీడియా వెంట పడతారు. ప్రచారంతో ఊదరగొడతారు. చాన్నాళ్లుగా రాజకీయాలు చేస్తున్న పవన్, ఇంకా ఈ వాతావరణం నుంచి బయటకు వచ్చినట్టు లేదు. అంశం ఏదైనా ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం పవన్ కు వెన్నతో పెట్టిన విద్య.

ఎవరైనా ప్రముఖుడు పుట్టినరోజు చేసుకుంటున్నాడా..?
ప్రజలంతా జరుపుకునే పండగ ఏదైనా ఉందా?
ముఖ్యమైన వ్యక్తి ఎవరైనా చనిపోయారా..?

ఇలా సందర్భం ఏదైనా దానిపై ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం పవన్ కు అలవాటుగా మారింది. ఎన్నో అంశాలపై ఇలానే స్పందిస్తున్నారు జనసేనాని. ఇప్పుడు అత్యంత కీలకమైన తెలంగాణ ఆర్టీసీ సమ్మెపై కూడా పవన్ ఇలానే స్పందించారు. దీంతో తెలంగాణ యువత, మరీ ముఖ్యంగా పవన్ ఫ్యాన్స్ భగ్గుమంటున్నారు.

ఏపీలో కంటే తెలంగాణలో దసరా ఘనంగా జరుగుతుంది. ఇలాంటి కీలకమైన పండగ టైమ్ లో సమ్మెకు దిగింది ఆర్టీసీ. వాళ్ల డిమాండ్స్ లో హేతుబద్ధత ఉందా లేదా అనేది తర్వాత సంగతి. వాళ్లకు సంఘీభావం తెలపాలనుకున్న పార్టీలు, వ్యక్తులంతా వెళ్లి వ్యక్తిగతంగా కలుస్తున్నారు. కొంతమంది వాళ్లతో పాటు ధర్నాలో కాసేపు కూర్చుంటున్నారు. సమ్మెకు మద్దతు ఇవ్వడం ఇష్టంలేని వ్యక్తులు, పార్టీలు ఈ మొత్తం వ్యవహారానికి దూరంగా ఉంటున్నారు. కానీ పవన్ ఈ రెండు పనుల్లో ఏ ఒక్కటీ చేయలేదు.

కొద్దిసేపటి కింద పవన్ రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ అటుఇటు కాకుండా ఉంది. ఉద్యోగుల్ని తొలిగిస్తున్నట్టు వచ్చిన వార్తలు తనను కలవరానికి గురిచేశాయని వ్యాఖ్యానించారు పవన్. అంతేకానీ, తెలంగాణ ప్రభుత్వ చర్యను వ్యతిరేకించినట్టు చెప్పలేదు. ప్రభుత్వంతో పాటు ఉద్యోగ సంఘాలు కూడా సంయమనం పాటించి చర్చలకు కూర్చోవాలని చెబుతున్నారు తప్ప నేరుగా సంఘీభావం ప్రకటించలేదు. ఇక ఫినిషింగ్ టచ్ గా ఉద్యోగులపై ఉదారత చూపాలని మాత్రమే కేసీఆర్ ను కోరారు. ప్రభుత్వం ఎంత కప్పిపుచ్చుతున్నప్పటికీ.. తెలంగాణ అంతటా ప్రయాణికులు కష్టాలు పడుతున్నారనేది వాస్తవం.

టీఆర్ఎస్ పార్టీని, ఉద్యోగుల్ని పక్కనపెడితే.. కనీసం ప్రజల తరఫునైనా పవన్ మాట్లాడి ఉండాల్సింది. ఆ ప్రయత్నం జరగలేదు. పవన్ ప్రెస్ నోట్ తో తెలంగాణలో అతడి ఫ్యాన్స్ మాత్రమే కాదు, ఆర్టీసీ ఉద్యోగులు కూడా చిరాకు పడుతున్నారు. పవన్ ప్రస్తుతం వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. దానికి ఆయన చికిత్స కూడా చేయించుకుంటున్నారు. సో.. ఆయన నేరుగా వెళ్లి ఉద్యోగులకు సంఘీభావం తెలియజేయలేకపోవచ్చు. కానీ తన మద్దతును ప్రెస్ నోట్ లో నేరుగా చెప్పి ఉండే బాగుండేది.

ఇలా డొంక తిరుగుడుగా.. అటు కేసీఆర్ కు కోపం రాకుండా, ఇటు ఆర్టీసీ కార్మికులకు లాభం లేకుండా ఉంది పవన్ తాజా ప్రెస్ నోట్. అయినా పవన్ ప్రెస్ నోట్ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పుకోవడం దండగ. ఎందుకంటే అంశం ఏదైనా పవన్ రియాక్షన్ ఇలానే ఉంటుంది. కర్ర విరగకూడదు, పాము చావకూడదు. ఇదే పవన్ ప్రెస్ నోట్ సిద్ధాంతం. ఎటువైపు మొగ్గుచూపితే ఏం జరుగుతుందో అనే భయం పవన్ పత్రికా ప్రకటనల్లో స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే ఇలా తన అభిప్రాయాల్ని మధ్యేమార్గంగా వెల్లడిస్తుంటారాయ.

ఆర్టీసీ సమ్మెపై వచ్చిన ప్రకటన కూడా ఇలాంటిదే. చదివి ఊరుకోవాలంతే, ప్రభావం ఆశించకూడదు. మరోవైపు రాజకీయ విశ్లేషకులు మాత్రం తెలంగాణల జనసేనను బలోపేతం చేసే మంచి అవకాశాన్ని పవన్ చేజార్చుకున్నారని అంటున్నారు.

‘సైరా నరసింహారెడ్డి’ వాస్తవికత ఎంతంటే!