సినిమాలు, రాజకీయాలు.. రెండు పడవలపై కాళ్లు వేసిన పవన్ అటు ఇటు ఎంట్రీలు, రీఎంట్రీలు ఇస్తూ హడావిడి చేస్తున్నారు. వకీల్ సాబ్ తో వెండితెరపై రీఎంట్రీ ఇచ్చిన పవన్, తిరుపతి ఉప ఎన్నికల తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని ఏపీ రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నారు.
ఈసారి కాస్త గట్టిగానే ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని డిసైడ్ అయ్యారట పవన్. దీని కోసం మంగళగిరిలోని పార్టీ నేతలు కసరత్తులు ప్రారంభించారు. జనంలోకి వెళ్లేందుకు రూట్ మ్యాప్ కూడా ఫిక్స్ చేశారు. తాము 'సమస్యలు' అని భావించే చిట్టా ఒకటి తయారు చేశారు.
పవన్ కల్యాణ్ నిజాయితీగా, నిఖార్సుగా పోరాటం చేయాలనుకుంటే ఏపీ ప్రజలకు చాలా సమస్యలే ఉన్నాయి. ప్రత్యేక హోదాపై పోరాటం చేసేందుకు పవన్ కి నోరు రాదు, పెరుగుతున్న పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలపై ప్రశ్నించాలంటే ఆయనకి ధైర్యం సరిపోదు.
వ్యాక్సిన్ లభ్యతను పెంచే దిశగా కేంద్రంపై ఒత్తిడి తేవడానికి ఆయనకు అంత స్థాయి లేదు. ఇక పవన్ ఏంచేయాలి, ఏదో తూతూ మంత్రంగా రాష్ట్ర ప్రభుత్వంపై బురదజల్లాలి. ఆ బురద జల్లే ఏర్పాట్లలోనే ఆయన టీమ్ ఇప్పుడు బిజీగా మారింది. ఈ వారంలోనే పవన్ కల్యాణ్ విజయవాడకు వస్తారని తెలుస్తోంది.
ఇవే సమస్యలు..
పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని, ఇంటిపన్ను తగ్గించాలని, చెత్తపన్ను ఎత్తివేయాలని, నిరుద్యోగుల జాబ్ క్యాలెండర్ వెనక్కి తీసుకుని, కొత్తగా ఉద్యోగాల ప్రకటన విడుదల చేయాలని.. పవన్ కల్యాణ్ వైసీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయబోతున్నారు. ప్రస్తుతం ఈ సమస్యలపై టీడీపీ, బీజేపీ రెండూ ఉధృతంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాయి. యువతను రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటున్నాయి. ఈ దశలో పవన్ కల్యాణ్ ఎంట్రీ ఇచ్చి, పిడికిలి బిగించి మరోసారి తన 'ఆవేశం' ప్రదర్శించబోతున్నారు.
వైసీపీ అధికారంలోకి వచ్చాక పవన్ కల్యాణ్ ఆమధ్య అమరావతి సమస్యను భుజానికెత్తుకోవాలని చూశారు. రైతులకు అండగా నిలబడతానంటూ రోడ్డుపై పైఠాయించి పెద్ద షో నడిపారు. పోలీసులు వేసిన కంచెను తొలిగించి హంగామా చేశారు. కానీ అవేవీ పూర్తి స్థాయిలో వర్కవుట్ కాలేదు. అమరావతి సమస్యను ఓన్ చేసుకున్న చంద్రబాబు కూడా దానినుంచి పక్కకి జరిగి ఇప్పుడు కరోనా మరణాలను భుజానికెత్తుకుని తిరుగుతున్నారు.
దీంతో పవన్ కల్యాణ్ కూడా కొత్త సబ్జెక్ట్ ల కోసం వెదుకుతున్నారు. నిత్యావసర సరకులు, పన్నులు, నిరుద్యోగం వంటి ఎవర్ గ్రీన్ సబ్జెక్టులతోటే తన ఉద్యమ ప్రణాళిక రచించాలనుకుంటున్నారు. మంగళగిరి పార్టీ ఆఫీస్ లో మీటింగ్ తర్వాత పవన్ తన కార్యాచరణ ప్రకటిస్తారని తెలుస్తోంది.