యాత్ర సినిమాకు సీక్వెల్ తీస్తానని గతంలోనే ప్రకటించాడు దర్శకుడు మహి వి రాఘవ్. ఆ తర్వాత ఆ సీక్వెల్ కాస్తా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయోపిక్ గా మారింది. జగన్ రాజకీయ ప్రస్థానంపై సినిమా చేస్తానని మహి ప్రకటించాడు. అలా ప్రకటించిన రోజు నుంచి ఈ ప్రాజెక్టుపై ఆసక్తి పెరిగింది. జగన్ పాత్రలో ఏ నటుడు కనిపిస్తాడా అని అంతా ఎదురుచూశారు.
యాత్ర సినిమాలో వైఎస్ఆర్ పాత్రను మమ్ముట్టి పోషించారు. దివంగత నేతను మరోసారి తెలుగు ప్రజలకు గుర్తుచేశారు. ఆహార్యంతో అచ్చుగుద్దినట్టు వైఎస్ఆర్ ను తలపించారు. ఇప్పుడు జగన్ వంతు. ఈసారి కూడా ఓ ప్రముఖ నటుడు జగన్ పాత్రలో కనిపిస్తాడని అంతా అనుకున్నారు. మరీ ముఖ్యంగా నటుడు అజ్మల్ ను తీసుకుంటారనే ప్రచారం బాగా జరిగింది. దీనికి కారణం జగన్ పాత్రను అజ్మల్ ఆల్రెడీ పోషించడమే.
కానీ మహి వి.రాఘవ్ మాత్రం బాలీవుడ్ నటుడ్ని ఎంచుకున్నాడు. స్కామ్-1992లో నటించిన ప్రతీక్ గాంధీని సెలక్ట్ చేశాడు. జగన్ పోలికలు, హావభావాలు ప్రతీక్ లో చాలా ఉన్నాయంటున్నాడు దర్శకుడు. యాత్ర-2కు ప్రతీక్ అచ్చుగుద్దినట్టు సరిపోతాడని చెబుతున్నాడు. మరీ ముఖ్యంగా ప్రతీక్ రాకతో, ఈ ప్రాజెక్టుకు ఇప్పుడు పాన్-ఇండియా అప్పీల్ కూడా వచ్చింది.
రెండోసారి వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పట్నుంచి యాత్ర-2 స్టార్ట్ అవుతుందట. అప్పుడు జగన్ ఎలా ఉండేవారు, తండ్రి ఆకస్మిక మరణం తర్వాత ఎలా రాటుదేలారు? ఓ సాధారణ రాజకీయ నాయకుడిగా ఉన్న వ్యక్తి, ప్రజల మనసుల్ని ఎలా గెలిచారు అనే కోణంలో ఇంట్రెస్టింగ్ గా యాత్ర-2 రాబోతోంది.
ప్రస్తుత రాజకీయాలకు దగ్గరగా ఉండడం వల్ల, యాత్ర సినిమాతో పోలిస్తే యాత్ర-2 మరింత ఇంట్రెస్టింగ్ గా, గ్రిప్పింగ్ గా ఉంటుందంటున్నాడు దర్శకుడు. ప్రతి ఒక్కరు యాత్ర-2తో కనెక్ట్ అవుతారని చెబుతున్నాడు.జగన్ పై పెట్టిన అక్రమాస్తుల కేసులు, ప్రజాసంకల్ప యాత్ర, జగన్ చెల్లెలు షర్మిల లాంటి అంశాలు ఈ సినిమాలో ప్రముఖంగా కనిపించే అవకాశం ఉంది.